హైదరాబాద్ : తెలంగాణలో విద్యా విధానంపై కొత్త చట్టం తీసుకురావాలని క్యాబినెట్ సమావేశం నిర్ణయించినట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రయివేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన చేయాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు.ఈ రెండు అంశాలపై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రానున్న శాసన సభా సమావేశాల్లో దీనికి సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని క్యాబినెట్ నిర్ణయించిందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్లతో 'మన ఊరు - మన బడి' ప్రణాళిక కోసం క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు.
క్యాబినెట్ సబ్ కమిటీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్‌లు సభ్యులుగా ఉంటారు.