న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పశ్చిమబెంగాల్ శకట ప్రదర్శనను కేంద్రం తిరస్కరించడంపై ప్రధాని మోడీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. రిపబ్లిక్ డే పరేడ్ నుండి తమ రాష్ట్ర శకటాన్ని అకస్మాత్తుగా మినహాయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల తాను దిగ్బ్రాంతికి గురయ్యానని, బాధపడ్డానని అన్నారు.. ఎటువంటి కారణాలు లేకుండా శకటం తిరస్కరించడం తమకు ఇబ్బందికరంగా ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం బెంగాల్ ప్రజలను తీవ్రంగా బాధించిందన్నారు. బెంగాల్‌కి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు, మేధావులు అందించిన సహకారాన్ని హైలెట్ చేస్తూ... స్వాతంత్య్ర పోరాటంలో బెంగాల్ ముందంజలో ఉందని, స్వాతంత్య్ర పోరాటం, దేశ విభజనల్లో లక్షలాది మంది ప్రజలు భారీ మూల్యం చెల్లించారని పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ ఇతివృత్తంతో పశ్చిమ బెంగాల్ ఈ ఏడాది శకటాన్ని ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది. ఈ శకటంలో పలువురిలో దేశ భక్తిని రగిలించిన ఈశ్వర చంద్ర విద్యాసాగర్, రవీంద్రనాథ్ ఠాగూర్, బిర్సాముండా వంటి ప్రముఖుల చిత్రాలు కూడా ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ శకటాన్ని మినహాయించడం తమ రాష్ట్ర స్వాతంత్య్ర సమరయోధులను కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.