హైదరాబాద్ : ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి.. భార్యతో పాటు సోదరిని హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో ముద్దాటపేటలో ఒక్కసారిగా అలజడి రేగింది. ముద్దాపేటకు చెందిన వీసీ అప్పన్న మద్యానికి బానిసయ్యాడు. మద్యం సేవించొద్దని కుటుంబ సభ్యులు వారించినా పట్టించుకోలేదు. తాగుడు మానేయాలని వారు మందలించడంతో కోపోద్రిక్తుడైన అప్పన్న భార్య అప్పమ్మ, సోదరి రాజులును హత్య చేశాడు. భార్యను చంపుతుండగా అడ్డొచ్చిన తండ్రి, సోదరి కుమార్తె పద్మను గాయపర్చాడు. ఇద్దరిని హత్యచేసి.. మరో ఇద్దరిని గాయపర్చిన అప్పన్న అనంతరం ఆత్మహత్యాయత్నం చేశాడు. క్షతగాత్రులతో పాటు అప్పన్న.. శ్రీకాకుళం జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm