హైదరాబాద్ : ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తంతో ఏకంగా ట్విట్టర్ నే షాపింగ్ చేశాడని అందరూ ఆశ్చర్యపోతున్న వేళ.. ఉన్నట్టుండి దాన్ని హోల్డ్ (నిలుపుదల)లో పెడుతున్నట్టు టెస్లా అధినేత మరోసారి ఆశ్చర్యపరిచారు. దీంతో ఎందుకు అలా..? అన్న సందేహం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి వచ్చింది. దీనికి కారణం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ తాజాగా వెల్లడించిన అంశమే అయి ఉంటుందని తెలుస్తోంది. ట్విట్టర్ లీగల్ టీమ్ (న్యాయ బృందం) నాకు కాల్ చేసింది. నేను నాన్ డిస్ క్లోజర్ అగ్రిమెంట్ (కీలక సమాచారాన్ని బయటకు వెల్లడించకూడదన్న)ను ఉల్లంఘించినట్టు చెప్పింది. బాట్ (కంప్యూటర్ సాఫ్ట్ వేర్) తనిఖీ శాంపిల్ సైజు 100 అని వెల్లడించడం ద్వారా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు ఆరోపించింది అంటూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ట్విట్టర్ కొనుగోలు డీల్ హోల్డ్ లో పెడుతున్నట్టు గత శుక్రవారం మస్క్ ప్రకటించడం గమనార్హం. ట్విట్టర్ ప్లాట్ ఫామ్ పై బాట్స్ నిర్వహించే ఖాతాలను గుర్తించేందుకు వీలుగా ర్యాండమ్ గా 100 మంది ఫాలోవర్లను పరిశీలించనున్నట్టు ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎలాన్ మస్క్ చెప్పడమే నిబంధనల ఉల్లంఘనకు దారితీసింది. దీని ఆధారంగా కావాలంటే ట్విట్టర్ యాజమాన్యం న్యాయపరమైన చర్యలు చేపట్టడానికి వీలుంటుంది. ట్విట్టర్ ప్లాట్ ఫామ్ పై నకిలీ, స్పామ్ ఖాతాలన్నవి 5 శాతంలోపే ఉంటాయని సంస్థ అంచనా. కంప్యూటర్ ప్రోగ్రామ్ అయిన బాట్ ద్వారా నడిచే ఈ తరహా నకిలీ ఖాతాలను ఎలా గుర్తిస్తారు? అంటూ ఓ యూజర్ మస్క్ ను ప్రశించి చిక్కుల్లో పడేసినట్టు కనిపిస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm