హైదరాబాద్ : పుట్టినరోజు పేరుతో బాలికకు 35 ఏండ్ల వ్యక్తిని పెండ్లి బంధంతో ముడిపెట్టిన ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలోని కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో వెలుగుచూసింది. వివరాల్లోకెళ్తే.. సంచార జీవితం గడుపుతున్న ఓ పేద కుటుంబంలో 12 ఏండ్ల బాలికకు వివాహం జరిపించాలనుకున్నారు. అందుకోసం తల్లిదండ్రులు బాలికకు.. 'కొద్ది రోజుల్లో నీ పుట్టినరోజు పెద్దగా జరుపుకుందాం`అని చెప్పారు. అయితే తీరా ఆ రోజు వచ్చాక అది పుట్టినరోజు వేడుక కాదు.. తనకు 35 ఏండ్ల వ్యక్తితో పెండ్లి చేస్తున్నారని బాలికకు అర్థమైంది. తనకు పెండ్లి వద్దని తన వాళ్లను బతిమిలాడింది. అయినా వారు వినకుండా బాలికకు ఆ 35 ఏండ్ల వ్యక్తితో వివాహం జరిపించారు. అనంతరం బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లింది. తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి.. బంధువులతో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆ బాలిక అక్కడినుంచి వెళ్లిపోయింది. మొత్తంగా ఈ విషయం ఐసీడీఎస్ అధికారులకు చేరింది. దాంతో ఐసీడీఎస్ అధికారులు పాపిరెడ్డిగూడ చేరుకుని బాధితురాలిని చేరదీశారు. తనకు పుట్టినరోజు పేరిట పెండ్లి జరిపించారని బాధిత బాలిక గ్రామస్తులకు, ఐసీడీఎస్ సిబ్బందికి తెలిపింది. ఐసీడీఎస్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm