అమరావతి : ఏపీలోని కోనసీమ జిల్లా అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జిల్లా పేరు మార్చవద్దంటూ గడియారం స్తంభం సెంటర్ దగ్గర కోనసీమ జిల్లా సాధన సమితి ఆందోళన చేపట్టింది. అది రణరంగంగా మారింది. 'కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు` అంటూ వందలాది యువకుల నినాదాలు చేశారు. ఈ క్రమంలో కొంతమంది ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకుని కొంతమంది యువకులు పరుగులు తీశారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం అమలాపురం ఆస్పత్రి వద్ద పోలీసు జీపుపై ఓ ఆందోళనకారుడు రాయి విసిరాడు. అలాగే ఆందోళనకారులను తరలిస్తున్న రెండు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడి నుంచి ఎస్పీ సుబ్బారెడ్డి త్రుటిలో తప్పించుకున్నారు. అయితే రాళ్ల దాడిలో పలువురు పోలీసులు, యువకులకు గాయాలయ్యాయి. కొందరు కలెక్టరేట్ వైపు పరుగులు తీశారు.
ఆందోళనకారులను ఎస్పీ సుబ్బారెడ్డి చెదరగొట్టారు. నల్ల వంతెన వద్ద ఆందోళనకారులపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. ఇదిలా ఉండగా బ్యాంకు కాలనీలోని మంత్రి విశ్వరూప్ ఇంటిపై ఆందోళనకారులు దాడికి దిగారు. మంత్రి ఇంటికి నిప్పంటించారు. దాడికి ముందే మంత్రి కుటుంబసభ్యులను పోలీసులు కారులో తరలించారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు నిరసనలు చేపడుతున్నారు.