న్యూఢిల్లీ : బొగ్గు ఉత్పత్తిని పెంచేలా చర్యలు తీసుకోవాలని బొగ్గు శాఖను కేంద్రం కోరింది. విద్యుత్ కోతలు దేశ ఆర్థిక పునరుద్ధరణను దెబ్బతీస్తున్నాయని కేంద్రం పేర్కొంది. విద్యుత్ రంగంలోని క్యాప్టివ్ బొగ్గు గనులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తిని 40 శాతం పెంచేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ, బొగ్గు శాఖ ఆధ్వర్యంలోని మైనింగ్ సంస్థలు (కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్), సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్)) కనీసం 10 నుండి 12 శాతం ఉత్పత్తిని పెంచాలని, సరఫరాను మరింత వేగవంతం చేయాలని భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మే 23 నాటికి 164జిడబ్ల్యు పూర్తి సామర్థ్యంతో పనిచేసే 155 నాన్-పిట్ హెడ్ థర్మల్ ప్లాంట్‌లలోని బొగ్గు నిల్వలు 25 శాతం సాధారణ స్థాయిలలో ఉన్నట్లు సమాచారం. ఈ స్టాక్‌ను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సిఇఎ) పర్యవేక్షిస్తోంది. సీఈఏ డేటా ప్రకారం.. 164 జిడబ్ల్యు కంటే ఎక్కువ ఉత్పాదక సామర్థ్యం కలిగిన 155 ప్లాంట్లలలో సాధారణ స్థాయి 57,195 వేల టన్నులకు గాను 14,233 వేల టన్నుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని పేర్కొంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ రంగంలోని క్యాప్టివ్ మైన్స్‌లో బొగ్గు ఉత్పత్తి 43 శాతం పెరిగి 120 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని, కానీ సిఐఎల్, ఎస్‌సిసిఎల్ నుండి ఉత్పత్తి 4నుండి 6 శాతం మాత్రమే పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. 2022 ఆర్థిక సంవత్సరానికి గాను సిఐఎల్ 540 మిలియన్ టన్నులు, ఎస్‌ఇసిఎల్ మరో 53.65 మిలియన్ టన్నుల బొగ్గును అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ రంగానికి సిఐఎల్ ద్వారా 565 మిలియన్ టన్నులు, ఎస్‌సిసిఎల్ ద్వారా 57 మిలియన్ టన్నులు అందించనున్నట్లు అంచనా వేశారు.
Mon Jan 19, 2015 06:51 pm