హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే లండన్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ..భారత విదేశాంగశాఖ నుంచి ప్రభుత్వానికి సంబంధించి (రాజకీయంగా) అనుమతి తీసుకోలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. నిబంధనల ప్రకారం.. ఒక పార్లమెంటు సభ్యుడుగానీ, ఇతర రాజకీయ నేతలు గానీ దేశం విడిచి వెళ్తే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి అనుమతులను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరుస్తారు. అలాగే వారు ఎటువంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్తున్నారో..ఆయా కార్యక్రమ నిర్వాహకుల నుంచి ఆహ్వానం నేరుగా కాకుండా విదేశాంగ శాఖకు చేరాల్సి ఉంటుంది. వ్యక్తిగతమైనా, అధికారిక పర్యటనైనా..ఆ ఆహ్వానానికి సంబంధించిన వివరాలు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకురావాలి. అయితే రాహుల్ గాంధీ పై రెండిటిలో ఏ ఒక్క పద్ధతిని పాటించలేదని భారత విదేశాంగశాఖ తెలిపింది. దీనిపై రాహుల్ గాంధీని ప్రభుత్వం వివరణ కోరే అవకాశం ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm