శ్రీనగర్ : కశ్మీరీ టీవీ నటి అమ్రీన్ భట్(35)ను బుధవారం అర్థరాత్రి కశ్మీర్‌లోని బుద్గామ్‌లో ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దాడిలో ఆమె మేనల్లుడు కూడా గాయపడ్డాడు. వివరాల్లోకెళ్తే.. బుద్గామ్ జిల్లాలోని హిషురా ప్రాంతంలో బుధవారం రాత్రి టీవీ నటి అయిన అమ్రీన్ భట్ పదేండ్ల వయసున్న తన మేనల్లుడితో కలిసి ఇంటి బయట ఉంది. ఆ సమయంలో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఆమెపై కాల్పులు జరిపారు. ఆమె మెడలోంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. అలాగే ఆమె మేనల్లుడు ఫర్హాన్ జుబైర్ చేతికి బుల్లెట్ గాయాలయ్యాయి. వీరిద్దరిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యం లోనే అమ్రీన్ మృతి చెందింది. ఫర్హాన్‌కు చికిత్స అందిస్తున్నారని, అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అమ్రిన్ భట్ నటి మాత్రమే కాదు గాయని కూడా. అమ్రిన్ భట్ టిక్ టాక్‌లో కూడా చాలా ఫేమస్.