హైదరాబాద్ : సాయుధ దొంగలు నగల షాపులో దోపిడీకి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన యజమానిపై కాల్పులు జరిపి హత్య చేశారు. బీహార్‌లోని హాజీపూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 22న రాత్రి 8 గంటలకు హాజీపూర్‌లోని సుభాష్, మదాయి చౌరాస్తా మధ్యలో ఉన్న నీలం జ్యువెలరీ షాపులోకి ఐదుగురు సాయుధులు ప్రవేశించారు. గన్స్ చూపించి లోపలున్న కస్టమర్లను భయపెట్టారు. అనంతరం తమ వెంట తెచ్చిన బ్యాగుల్లో షాపులోని బంగారు ఆభరణాలను లూఠీ చేశారు. అడ్డుకోబోయిన షాపు యజమాని సునీల్ ప్రియదర్శిపై పలుమార్లు దాడి చేశారు. ఆయన తీవ్రంగా ప్రతిఘటించడంతో కాల్పులు జరిపారు. దీంతో షాపు యజమాని చనిపోయాడు. అనంతరం దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. కాగా, ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. నగల షాపులో సాయుధుల దోపిడీపై దర్యాప్తునకు డీఎస్పీ ఆదేశించారు. ఆ ప్రాంతంలో భద్రతను పెంచారు. దుండగుల కాల్పుల్లో షాపు యజమాని మరణించడంతో విషాదం నెలకొంది. మరోవైపు ఆ షాపులోని సీసీటీవీలో రికార్డైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Mon Jan 19, 2015 06:51 pm