హైదరాబాద్ : కుమురం భీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నా కానీ ప్రజాప్రతినిధులు, అధికారులు కనీసం పట్టించుకోవడంలేదని సీపీఐ(ఎం) నాయకుడు ఆనంద్ వినూత్నంగా నిరసన తెలిపారు. వర్షపు నీటిలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్లపై గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో అనేకమంది ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు ఇంత అధ్వాన్నంగా ఉంటే ప్రజాప్రతినిధులు, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంత వరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పారు. పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని నిరసనను విరమించాలని చెప్పినా ఆయన తన నిరసన కొనసాగించారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ.. సిర్పూర్ పేపర్ మిల్లుకి సంబంధించిన రోడ్డు కావడంతో విస్తరణ పనులకు ప్రతిపాదనలు ఉన్నా ఆచరణ సాధ్యం కావటం లేదన్నారు. మున్సిపల్ సిబ్బంది పేపర్ మిల్లు అధికారులతో మాట్లాడి నీటి తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరింది. పనులు ప్రారంభిస్తామని అధికారులు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీపీఐ(ఎం) నాయకుడిని పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm