నవతెలంగాణ-న్యూఢిల్లీ: సర్జరీ తర్వాత ఒక బాలిక మరణించింది. అయితే ఆమె శరీరంలోని అవయవాలు చోరీ చేసి ప్లాస్టిక్ సంచులతో నింపినట్లు ఆ బాలిక కుటుంబం ఆరోపించింది. కలకలం రేపిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల బాలిక, పేగుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నది. జనవరి 21 ఆసుపత్రిలో అడ్మిట్ కాగా 24న సర్జరీ చేశారు. అయితే జనవరి 26న ఆ బాలిక మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా, బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తుండగా బాలిక శరీరంపై రంధ్రాలు కనిపించాయి. వాటి లోపల ప్లాస్టిక్ కవర్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో సర్జరీ సమయంలో ఆమె శరీరంలోని అవయవాలను చోరీ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు మెడికల్ బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని పోలీసులు కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm