నవతెలంగాణ-హైదరాబాద్ : అదానీ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని మరోసారి పార్లమెంటు ఉభయ సభల్లో శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ నేతలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అదానీ వ్యాపార సంస్థలపై హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాలని.. సంయుక్త పార్లమెంటరీ సంఘం లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై శుక్రవారం కూడా పూర్తిస్థాయిలో ఆందోళన కొనసాగించాలని విపక్షాలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్లో విపక్ష పార్టీల నేతలు భేటీ అయ్యారు. అనంతరం అక్కడి నుంచి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపనున్నారు. ఉభయసభల్లో విపక్ష ఎంపీలు తమ ఆందోళన కొనసాగిస్తూ చర్చకు పట్టుబట్టనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆదానీ వ్యవహారంపై ప్రభుత్వం దిగిరాక తప్పదని విపక్షాలు అంటున్నాయి. కాగా నిన్న ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఆమోదించకపోవడంతో విపక్ష పార్టీలు ఆందోళనను ముమ్మరం చేశాయి. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. శుక్రవారం కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇతరత్రా పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. నిన్నటి వాయిదా తీర్మానాలు ఫార్మాట్‌లో లేవని లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అన్నారు. అందుకు అనుగుణంగా విపక్ష ఎంపీలు ఈరోజు తగిన ఫార్మాట్‌లో మళ్లీ వాయిదా తీర్మానాలు ఇచ్చారు. బీఆర్ఎస్ తరఫున రాజ్యసభలో ఎంపీ కేశవరావు.. అలాగే లోక్ సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానాలు ఇచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm