నవతెలంగాణ-హైదరాబాద్ : ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణం చెందగా.. విషయం తెలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లిన హాస్టల్ వార్డెన్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ విషాద ఘటనలు తిరుపతి జిల్లా గూడూరులో శనివారం చోటుచేసుకున్నాయి. గూడూరులోని ఓ ప్రైయివేటు ఇంజినీరింగ్ కళాశాలలో కడప జిల్లా వేముల మండలం నారేపల్లికి చెందిన వెంకటకృష్ణారెడ్డి కుమారుడు ధరణేశ్వర్‌రెడ్డి (20) ద్వితీయ సంవత్సరం సీఈసీ చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్న భోజనం అనంతరం వసతిగృహంలో ఉరేసుకున్నాడు. సహచర విద్యార్థులు తరగతులు పూర్తయ్యాక వసతి గృహానికి వచ్చి చూడగా ధరణేశ్వర్‌రెడ్డి ఉరేసుకుని ఉండటాన్ని గుర్తించారు. వసతిగృహ వార్డెన్ బి.శ్రీనివాసులు నాయుడు (54).. కళాశాల ప్రిన్సిపల్, ఇతర సిబ్బందికి సమాచారమిచ్చి ఘటన స్థలంవద్దకు వెళ్లారు. అక్కడ ఆయన కుప్పకూలిపోవడంతో ప్రాంతీయ వైద్యశాలకు తరలించేలోపే మృతిచెందారు. సూళ్లూరుపేట ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు నాయుడు 12 ఏళ్లుగా వార్డెన్‌గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన గుండెజబ్బుకు శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిసింది
Mon Jan 19, 2015 06:51 pm