Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రక్తకన్నీరు' నాటకంతో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయిన రంగస్థల కళాకారుడు, విలనిజానికి కొత్తభాష్యం చెప్పిన సినీ నటుడు నాగభూషణం (19 ఏప్రిల్ 1921-05 మే 1995) శతజయంతి ఈ రోజు. ప్రతినాయకులకు గుర్తింపు తెచ్చిన నటుడు. విలనిజానికి విలక్షణమైన రీతిని అందించారాయన. జీవితంలో మాత్రం కథానాయకుడు. ప్రజల పక్షం నిలిచిన మనీషి. చిన్నతనం నుంచే నాటకరంగం మీద ఆసక్తి వున్న ఈయన పూర్తి పేరు చక్రవర్తుల నాగభూషణం. ప్రకాశం జిల్లా అనకర్లపూడిలో జననం. పేదరికం కారణంగా పి.యు.సి. చదివాక ఉద్యోగంలో చేరకతప్పలేదు. నెలకు పాతిక రూపాయల జీతంతో ఉద్యోగం దొరకడంతో మద్రాసుకు చేరుకున్నారు.
అక్కడే నాగభూషణం జీవితం మలుపు తిరిగింది. నాటకాల మీద ఉన్న ఆసక్తికి మద్రాసు నాటకరంగం ఊపునిచ్చింది. అతనిలోని నటుణ్ణి వెలికితీసి రంగస్థలం మీద అతని ప్రతిభని చాటింది. ప్రజానాట్యమండలితో ఉన్న బంధం ప్రజలపక్షాన నిలబడేలా చేసింది. ఆ కాలంలోనే జి.వరలక్ష్మి, మిక్కిలినేని నాగభూషణంలోని నటునికి సానబెట్టారు. వారి అండదండలు, తోడ్పాటు, ప్రోత్సాహం నాటకరంగంలో తనదైన విలక్షణరీతిన నిలదొక్కుకునేలా చేసింది. ఒకవైపున సినిమాల్లో అవకాశాలు వచ్చినా నాటకరంగాన్ని వీడలేదు. సినిమాల్లో నటిస్తూనే రంగస్థలం మీద కొనసాగడం ఆయన ప్రత్యేకత. ఆనాటికి తమిళ నాటకరంగం ఎం.ఆర్.రాధా, మనోహర్ వంటి వారి ప్రదర్శనలతో వర్థిల్లుతున్నది. అదే సమయాన మద్రాసులో తెలుగు నాటకాలు కూడా జోరుగా ప్రదర్శిస్తున్న రోజులవి. ఆత్రేయ రాసిన 'భయం, కప్పలు' వంటి నాటకాల్లో నాగభూషణం. వామపక్ష భావజాల నేపథ్యంలో సామాజిక ఇతివృత్తాలతో రూపొందిన ఈ నాటకాల్లో నాగభూషణం నటనాచాతుర్యం రంగస్థలాన్ని శోభాయమానం చేసింది.
ఆనాడు తమిళ నాట ఎం.ఆర్.రాధా, మనోహర్ ప్రదర్శించే 'రక్తకన్నీరు' నాటకం రంగస్థల సంచలనం. ఆ నాటక ప్రదర్శన నాగభూషణాన్ని ఆకర్షించింది. దాన్ని తెలుగులో రాయించి, అద్భుతంగా ప్రదర్శించారు. తొలి ప్రదర్శనలకు వచ్చిన ప్రతిస్పందన 'రక్తకన్నీరు' మీద నాగభూషణానికి మమకారాన్ని పెంచింది. ఊరూరా ఆ నాటకాన్ని ప్రదర్శించారు. మద్రాసులోనే కాదు తెలుగునాట అన్ని ముఖ్య పట్టణాల్లో ఆ నాటకం ప్రదర్శితమైంది. ప్రదర్శనల సంఖ్య పెరుగుతున్న కొద్దీ నాటకానికి ఆదరణ హెచ్చింది. జనం తండోపతండాలుగా నాటక ప్రదర్శనకు వచ్చేవారు. సూర్యాపేటలో ఈ నాటక ప్రదర్శనని జనం కిక్కిరిసి చూశారు. తెలంగాణలోని అనేక పట్టణాల్లో ఈ ప్రదర్శనకు వచ్చిన స్పందన అనూహ్యం. అంతగా జనాన్ని ఆకట్టుకున్న నాటకం 'రక్తకన్నీరు'లో శారద, వాణిశ్రీలు కూడా భిన్నమైన పాత్రల్ని పోషించారు.
ఆ నాటకం ఇతివృత్తం, అందులో నాగభూషణం వేసిన పాత్ర, ఆయన చెప్పే డైలాగులు జనాన్ని విపరీతంగా ఆకర్షించేవి. ఆయనే స్వయంగా దాదాపు రెండువేలకు పైగా ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. ఒకవైపున సినిమారంగంలో అవకాశాలు పెరుగుతున్నప్పటికీ 'రక్తకన్నీరు' ప్రదర్శనలు మాత్రం ఆపలేదు. ఒకనెలలో దాదాపు ముప్పయి ప్రదర్శనలు ఇచ్చారు. కొన్నిసార్లు రాత్రి రెండుసార్లు నాటక ప్రదర్శనలు ఇచ్చిన సందర్భాలున్నాయి. తర్వాతకాలంలో సినిమాలకు ఎక్కువ సమయం ఇవ్వాలన్న ఒత్తిడి పెరగడంతో 'రక్తకన్నీరు' ప్రదర్శనలు తగ్గించారు. అయితే స్టార్ విలన్‌గా ఉంటూ రంగస్థలానికి అంత సమయం కేటాయించిన నటుడు నాగభూషణం తప్ప మరొకరు లేరు.
సినిమా నటునిగా విలనిజానికి ఆయన ఏర్పరిచిన ఒరవడిని రావుగోపాలరావు, నూతన్‌ప్రసాద్, కోట శ్రీనివాసరావు వంటి వారు కొనసాగించారు. వెండితెర మీద విలన్‌గానే గాక, ఒకటీ రెండు చిత్రాల్లో హీరోగానూ, ఆడపిల్లల తండ్రిగా కరుణరసాత్మకంగానూ నటించారు నాగభూషణం. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు వెండితెర మీద ఒక వెలుగు వెలిగి, చిరస్మరణీయమైన పాత్రల్లో జీవించారు. సినీ కళాకారుల సంక్షేమనిధిని ఏర్పాటు చేసిన వ్యక్తిగానూ ఆయనకు గుర్తింపు ఉంది. రక్తకన్నీరు నాటకాన్ని దాదాపు పాతికేళ్ళుగా దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తూ మూడువందలమందికి పైగా కళాకారుల్ని పోషించడం చెప్పుకోదగ్గ విషయం. రంగస్థల నటునిగా, సినీనటునిగా రాణించిన నాగభూషణం నిరంతరం పేదలకు అండగా నిలబడ్డారు. మాటలో, చేతలో వామపక్షభావజాలంతోనే కడదాకా జీవించారు.
- సంజీవ్