Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌంటర్ వేయకపోతే విచారణకు రావాలి: ఉన్నతాధికారులకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హిమాయత్‌సాగర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు ఉన్న కాలువల్లో నిర్మాణాల వ్యర్దాలు, ఇతర చెత్తను తొలగించకపోవడాన్ని సవాల్‌చేసిన పిల్‌లో కౌంటర్ ఎందుకు వేయలేదని హైకోర్టు పలువురు అధికారులను ప్రశ్నించింది. ఈసారి కౌంటర్ వేయకపోతే, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు స్వయంగా విచారణకు హాజరు కావాలంటూ ఉత్తర్వులిస్తామని హెచ్చరించింది. అధికారులకు చివరి అవకాశం ఇస్తున్నట్టు చెప్పింది. జనవరి 21వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయకపోతే విచారణకు ఆ ముగ్గురు అధికారులు హాజరుకావాలంటూ చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. హిమాయత్‌సాగర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు ఉన్న కాలువల్లో నిర్మాణ శిథిలాలను తీయకపోవడాన్ని సవాల్ చేస్తూ లాయర్ ఇంద్రప్రకాష్ పిల్ వేశారు. ఆరు నెలలుగా ఒక్క ప్రతివాది కూడా కౌంటర్ వేయలేదని తప్పుపట్టింది.
మినహాయింపునివ్వండి: ఏపీ సీఎం తరపు లాయర్ వినతి
సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణకు ఏపీ సీఎం జగన్ వ్యక్తిగతంగా వారంలో 5 రోజులు హాజరు కావాలనే మినహాయింపు ఉత్తర్వులు నుంచి మినహాయింపునివ్వాలని ఆయన తరఫు లాయర్ శుక్రవారం హైకోర్టును కోరారు. ఈ మేరకు జగన్‌వేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టేసిందని, దానిని రద్దు చేసి హాజరు నుంచి మినహాయింపు ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టులో వేసిన రిట్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారించారు. సీఎం వస్తే ప్రొటోకాల్ సమస్య, జనం కూడా వస్తారని, సీఎంగా ఏపీలో లేకపోతే అక్కడి అభివృద్ధి దెబ్బతింటుందని ఆయన లాయర్ వాదించారు. టూజీ స్కాం కంటే వాన్‌పిక్ కేసు పెద్దదనీ, 11 కేసులు ఉన్నాయని, వీటి విచారణకు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు జగన్‌కు ఇవ్వాలని కోరారు. వాద ప్రతి వాదనల అనంతరం కేసును ఆరో తేదీకి వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది.