Magazines

బీసీ సంక్షేమానికి ప్రాధాన్యం

56 నిమిషాల క్రితం

Priority for BC Welfare
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 2 నిమిషాల చదవడం

రూ. 60 కోట్లతో 50 వేల మందికి 
కాటమయ్య రక్షణ కవచాలు
రూ. 450 కోట్లతో 1.30 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు జమ
నవంబర్ నుంచి 
'రాజీవ్ యువ వికాసం' ప్రారంభం
‎‎ఓవర్సీస్ స్కాలర్‌షిప్ దరఖాస్తుల గడువు అక్టోబర్ 15 వరకు పెంపు : 
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ​

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్ ‎‎
రాష్ట్రంలో బీసీ సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ లోని ప్రజాభవన్‌లో బీసీ సంక్షేమ శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ నిధులను నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోకే జమ చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఈ నూతన విధానం ద్వారా ఇప్పటివరకు 1,30,000 మంది విద్యార్థులకు రూ.450 కోట్ల నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. అలాగే హాస్టల్ విద్యార్థుల డైట్, కాస్మోటిక్ ఛార్జీలను సైతం ఏ నెలకు ఆ నెల ఖచ్చితంగా విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేయాలని అధికారులను ఆదేశించారు.

​‎రూ.60 కోట్లతో 'కాటమయ్య రక్షణ కవచాలు' ‎
గీత కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన 'కాటమయ్య రక్షణ కవచాలు' పథకం కింద 50 వేల మందికి కిట్స్ మంజూరు కాగా, ఇప్పటికే 40 వేల కిట్లను అందించినట్టు వివరించారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న మరో 10 వేల మందికి కూడా శిక్షణ పూర్తయ్యాక కాటమయ్య రక్షణ కవచం కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ పథకం కోసం మొత్తం రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.

‎‎నవంబర్‌లో 'రాజీవ్ యువ వికాసం'

‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని నవంబర్ నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ల సమక్షంలో పారదర్శకంగా పరిశీలించి అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని అధికారులను సూచించారు. ఎంజేపీ (మహాత్మా జ్యోతిబా పూలే) గురుకులాల్లో ఉన్న పెండింగ్ బిల్లులను త్వరలోనే క్లియర్ చేస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. గురుకుల విద్యాలయాలకు స్వంత భవనాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేయగా, ఆ అంశాన్ని పరిశీలిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఏడాది ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద మొదటి, రెండవ విడతల (ఇన్‌స్టాల్‌మెంట్స్) రూపంలో 180 మంది విద్యార్థులకు రూ.18 కోట్ల 40 లక్షల నిధులను విడుదల చేశామని చెప్పారు. అర్హులైన విద్యార్థులందరికీ అవకాశం కల్పించేందుకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి కూడా త్వరలోనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ బాలామాయదేవి, ఎంజేపీ సెక్రెటరీ సైదులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్