Magazines

అవమానం, అసమానతలు లేని సమాజమే లక్ష్యం

1 గంట క్రితం

The goal is a society free from humiliation and inequality.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 2 నిమిషాల చదవడం

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఎల్బీ స్టేడియంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అవమానం, అసమానతలు లేని సమాజమే గాంధీ కోరుకున్నారనీ, అలాంటి సమాజ నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం పని చేస్తున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, టీపీసీసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారతదేశానికి మహాత్మాగాంధీ ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టారని గుర్తుచేశారు. శాంతియుత ఉద్యమంతో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని పారదోలి స్వేచ్ఛను ప్రసాదించారని తెలిపారు. సౌతాఫ్రికాలో నల్ల జాతీయుల పట్ల జరుగుతున్న వివక్షను ఎదుర్కొన్న మహాత్మాగాంధీ భారతదేశ స్వాతంత్ర్యం కోసం బయలుదేరారని తెలిపారు. 1924లో ఏఐసీసీలో అంటరానితనానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారని చెప్పారు. స్వాతంత్ర పోరాటంలో లేని బీజేపీ, గాంధీని చంపిన గాడ్సే వారసులు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ స్వాతంత్ర్య పోరాటం, స్వాతంత్ర్యం అనంతరం పంచవర్ష ప్రణాళికలు, మిశ్రమ ఆర్థిక విధానాలతో అసమానతలు లేని సమాజం కోసం ప్రయత్నం చేసిందని తెలిపారు. నాటి హరి విప్లవం తదితర కార్యక్రమాలు తీసుకుందని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలంలో ఉన్న ఏ సమాజానికైనా గాంధీయిజమే పరిష్కారమని వ్యాఖ్యానించారు. చరిత్రను వక్రీకరిస్తున్న గాడ్సే వారసులను దేశభక్తులు తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశానికి గాంధీయిజమే శ్రీరామరక్ష అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శాంతికాములకు గాంధీ జయంతి పండుగ అని చెప్పారు. అహింస ద్వారా స్వాతంత్ర్యాన్ని తెచ్చిన గాంధీయిజాన్ని అనుసరిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుందన్నారు. మాజీ ఎంపీ వీహెచ్ మాట్లాడుతూ ధనవంతులైన మోతీలాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ తదితరులు దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలతో ముందుకొచ్చారని గుర్తుచేశారు. వారి బాటలోనే రాహుల్ గాంధీ వెళుతున్నారనీ, ఇప్పటికే రాహుల్ గాంధీతో దేశంలోని విద్యార్థులు కలిసి నడుస్తున్నారనీ, ఓబీసీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు ‎గాంధీ వేషధారణలో ఉన్న చిన్నారులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను అతిథులు ఆసక్తిగా పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, గడ్డం వివేక్ వెంకటస్వామి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్