ఇప్పట్లో ఎన్నికలేమీ లేవు. ఉంటే ఆచితూచి అడుగేసేదేమో! అదను చూసి దెబ్బకొట్టింది. పదో, ఇరవయ్యో కాదు, వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా రూ.69 పెంచి చిరు వ్యాపారులను మోడీ సర్కార్ బండ బాదుడు బాదింది. పండగ సీజన్ వేళ ఈ పెంపు వినియోగదారుల జేబులకూ చిల్లే. ఇంట్లో వంట చేసుకోవాలన్నా పప్పు, నూనె, ఉప్పు, చక్కెర, కూరగాయల, వంట గ్యాస్ ధరలు సామాన్యుడి బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలైతే దిగిరా నంటున్నాయి. ఆదాయం పెరగకున్నా ఖర్చులు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఉపశమనం కలిగే చర్యలు చేపట్టాల్సిన కేంద్రం మరోసారి గ్యాస్ భారం మోపడం అన్యాయం. మొన్నటివరకు రూ.2,996 ఉన్న సిలిండర్ ధర అక్టోబర్ ఒకటి నుంచి రూ.3,065కు చేరింది. ఈ పెంపు సామాన్యుల కంచంలోని ఆహారంపై తీవ్ర ప్రభావం చూపనుంది.
టీ కొట్టులో చాయ్ రూ.15. టిఫిన్ తినాలంటే కనీసం రూ.40. కాస్త పేరున్న హోటల్లో అడుగు పెడితే ఇవే ధరలు రూ.25-80 దాటుతాయి. స్టార్ హోటల్స్‌లో నైతే వేరే చెప్పక్కర్లేదు. పెంపు నేపథ్యంలో ఇవే ధరలు మరింత ప్రియం కానున్నాయి. వాణిజ్యగ్యాస్ను పెద్ద కంపెనీలు మాత్రమే కాకుండా టీ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్లు, బేకరీలు, క్యాంటీన్లు, క్యాటరింగ్ సంస్థలు కూడా ఉపయోగి స్తున్నాయి. సిలిండర్ ధర పెరిగితే ఆ భారాన్ని వ్యాపారులు పూర్తిగా భరించ డానికి సిద్ధపడరు. టిఫిన్, టీ, భోజనం ధరలను పెంచడం ద్వారా వినియోగదారుడిపైనే వేస్తారు.
మోడీ మొదటి దఫా అధికారంలోకి వచ్చిన 2014లో పందొమ్మిది కిలోల వాణిజ్య సిలిండర్ ధర సుమారు రూ.1,541 ఉండగా, ఇప్పుడది దాదాపు రెట్టింపైంది. ఒక్కో పెంపు చిన్నదిగా కనిపించినా కాలక్రమేణా ఈ భారం తడిసి మోపెడైంది. ఇది చిన్న వ్యాపారాల నిర్వహణ ఖర్చులను, చివరికి సామాన్య కుటుంబాల ఖర్చులను పెంచుతోంది.
దీనికి అంతర్జాతీయ మార్కెట్ ధరలు, దిగుమతి వ్యయం, రవాణా ఖర్చులు, సరఫరా సమస్యల కారణంగానే ధరలు పెరుగుతున్నాయని కేంద్రం చెబుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి సంక్షోభం అంతర్జాతీయ ఎల్పీజీ ధరలను ప్రభావితం చేస్తున్నది నిజమే. కానీ ధరలు పెరిగినప్పుడు ఆ భారాన్ని ప్రజలపై వేయడం ఎంతవరకు సమంజసం? ధరలు తగ్గినప్పుడు అదే వేగంతో ప్రయోజనం ప్రజలకు ఎందుకు చేరడం లేదు? ఒక సిలిండర్ ధరలో దిగుమతి వ్యయం, పన్నులు, రవాణా, మార్జిన్ల వాటా ఎంతన్నది ఎవరికీ తెలియదు. అంతర్జాతీయ ధరలను ప్రభుత్వం నియంత్రించ లేకపోయినా, ఆ భారాన్ని ప్రజలపై ఎంతవరకు మోపాలన్నది మాత్రం ప్రభుత్వ విధాన నిర్ణయమే. దాన్ని విస్మరించిన ఫలితమే కదా ఈ భారం.
ధరల పెరుగుదలకు అంతర్జాతీయ పరిస్థితులు మాత్రమే కారణం కాదు. దేశంలో ఇంధన దిగుమతులు ఎలా నిర్వ హించాలి, ఏ దేశాలపై ఎంత ఆధారపడాలి, పన్నులు, ధరల విధానాన్ని ఎలా అమలు చేయాలన్నది కూడా కేంద్రం తీసుకునే విధాన నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది.
చౌకైన వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ ఖరీదైన ప్రత్యామ్నా యాలపై ఆధారపడాల్సి వస్తే ఆ అదనపు వ్యయం చివరికి ప్రజలపైనే పడుతుంది. అందుకే ప్రతి ధర పెంపును అంత ర్జాతీయ మార్కెట్ ముడిపెట్టి తమ బాధ్యత నుంచి తప్పించుకోవడం సరికాదు. ఇంధన దిగుమతుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న మార్గంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత ఎల్పీజీ దిగుమతుల్లో అమెరికా వాటా 2025 సెప్టెంబర్-2026 ఫిబ్రవరి మధ్య 7.9 శాతం ఉండగా, 2026 మార్చి-ఆగస్టు మధ్య 53 శాతానికి పెరిగింది. అమెరికా నుంచి దిగుమతులు పెరగడం ధరలు, సరఫరా, భవిష్యత్ ఇంధన భద్రతపై ప్రభావం చూపే అంశంగా మారుతోంది. ఒకే దేశంపై ఎక్కువగా ఆధారపడకుండా దిగుమతులను విభిన్నీకరించాల్సిన అవసరం ఉంది.
భారత్ గతంలో రష్యా నుంచి డిస్కౌంట్ ధరలకు ముడి చమురు కొనుగోలు చేసి గణనీయంగా ఆదా చేసింది. రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గి ఖరీదైన ప్రత్యామ్నాయాలపై ఆధారపడాల్సి వస్తే ఆ అదనపు ఖర్చు కూడా రవాణా, సరుకులు, ఆహార ధరల రూపంలో ప్రజలపైనే పడుతుంది. అమెరికాతో దౌత్య సంబంధాలు ఒక అంశం అయితే, దేశ ఇంధన భద్రత, ప్రజల కొనుగోలు శక్తి మరో అంశం. ఇంధన విధానానికి ప్రమాణం ఏ అగ్రరాజ్యాన్ని సంతృప్తిపరచడం కాకుండా, భారత్‌కు చౌకగా, భద్రంగా, నిరంతరంగా ఇంధనం లభించడమే కావాలి. అందుకే రష్యా, ఇరాన్, గల్ఫ్ దేశాలు సహా ఎక్కడి నుంచి ప్రయోజనకరంగా ఇంధనం లభిస్తే అక్కడి నుంచి కొనుగోలు చేసే స్వతంత్ర విధానం అవసరం. వ్యూహాత్మక ఎల్పీజీ నిల్వలను పెంచాలి. దేశీయ ఉత్పత్తి, నిల్వ సామర్థ్యాలను విస్తరించాలి. అంతర్జాతీయ ధరలు తగ్గినప్పుడు దాని ప్రయోజనం ప్రజలకు చేరేలా పారదర్శక ధరల విధానం అమలు చేయాలి. కేంద్రం అలా చేయకపోవడం వల్లే పెంచిన ధరల భారాన్ని ప్రతిసారీ సామాన్యులు మోయాల్సి వస్తోంది.
‘‘బండ’’ బాదుడు
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 02, 2026 | 3 నిమిషాల చదవడం





కామెంట్లు (0)