నిషేధం చట్టవిరుద్ధమైన ప్రతీకార చర్యే
వాక్, పత్రికా స్వాతంత్య్రాలను ఉల్లంఘించారు
యూఎస్ ఫెడరల్ జడ్జి రూలింగ్
వాషింగ్టన్ : మీడియా సంస్థలు సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో దాఖలు చేసిన వ్యాజ్యం విచారణలో ఉన్నంత కాలం వాటిని అధ్యక్షభవనంలోకి అనుమతించాల్సిందేనని యూఎస్ ఫెడరల్ జడ్జి టిమ్ కెల్లీ రూలింగ్ ఇచ్చారు. ఆ మీడియా సంస్థలపైదేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధం మొదటి సవరణను ఉల్లంఘించి ఉండవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. 'వాదుల రిపోర్టింగ్ తప్పుగా ఉన్నదని, తనకు వ్యతిరేకంగా పక్షపాత పూరితంగా ఉన్నదని ట్రంప్ భావించినందునే వారి వైట్హౌస్ ప్రవేశాన్ని నిషేధించి ఉండవచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే లేదా నచ్చని వైఖరిని ప్రదర్శించే మీడియాను లక్ష్యంగా చేసుకోవడం చట్టవిరుద్ధమైన ప్రతీకార చర్యే అవుతుంది' అని అన్నారు.
భద్రతా పరమైన ఆందోళనల కారణంగానే మీడియా సంస్థలపై ట్రంప్ నిషేధం విధించారంటూ న్యాయ శాఖ చేసిన వాదనను జడ్జి తన తాజా ఉత్తర్వులో తోసిపుచ్చారు. ఈ వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని, అసలు తన నిర్ణయానికి జాతీయ భద్రతే కారణమని ట్రంప్ ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేశారు. అధ్యక్షభవనం ప్రెస్ పాసులను రద్దు చేయడం రాజ్యాంగం కల్పించిన వాక్, పత్రికా స్వాతంత్య్రాలను స్పష్టంగా ఉల్లంఘించడమే అవుతుందని చెప్పారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా నిషేధించడం డ్యూ ప్రాసెస్ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో కెల్లీ న్యాయమూర్తిగా నియమితులయ్యారు.






కామెంట్లు (0)