నవతెలంగాణ హైదరాబాద్: పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా నాలుగో రోజు పోటీల్లో భారత్ మరో రెండు స్వర్ణ పతకాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో మొత్తం 71 పతకాలతో (16 స్వర్ణాలు, 22 రజతాలు, 33 కాంస్యాలు) భారత్ ఐదో స్థానంలో నిలిచింది. ఈ క్రీడల్లో స్టార్ ఆర్చర్ శీతల్ దేవి అద్భుత ప్రతిభ కనబరిచింది. మహిళల వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన శీతల్, మిక్స్డ్ డబుల్స్‌లో తోమన్ కుమార్‌తో కలిసి పోటీపడి స్వర్తాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 151-148 తేడాతో ఇండోనేషియాను ఓడించి విజయం సాధించింది. అలాగే, మహిళల డిస్కస్ త్రో ఎఫ్54 విభాగంలో భారత అథ్లెట్ సువర్ణ రాజ్ 15.66 మీటర్ల దూరం విసిరి పసిడి పతారాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ టోర్నమెంట్లో స్వాతి చౌదరి ప్రత్యేక రికార్డు సృష్టించారు. ఆసియా పారా గేమ్స్‌లో పోటీ పడిన తొలి భారత డబ్ల్యూ1 (తీవ్రమైన శారీరక వైకల్యాలు ఉండి వీల్‌ఛైర్‌లో కూర్చొని ఆడే విభాగం) ఆర్చర్‌గా ఆమె చరిత్రకెక్కారు. ఈ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లిన స్వాతి, తొలి సెట్‌ను గెలుచుకున్నప్పటికీ చివరికి 4-6 తేడాతో పోరాడి ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకున్నారు.
ఇదిలాఉంటే, బ్యాడ్మింటన్ విభాగంలోనూ భారత్‌కు పలు కాంస్య పతకాలు దక్కాయి. మహిళల సింగిల్స్ ఎస్ఎల్3 విభాగంలో సంజనా కుమారి కాంస్యం సాధించగా, పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4 కేటగిరీలో అభిజీత్ మరియు సుహాస్ యతిరాజ్ కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. అయితే వీరు తమ సెమీఫైనల్ మ్యాచ్‌లలో పరాజయం పాలయ్యారు. అలాగే, మిక్స్డ్ డబుల్స్ ఎస్‌హెచ్6 విభాగంలో కృష్ణ నాగర్ - నిత్య శ్రీ జోడీ, మిక్స్డ్ డబుల్స్ ఎస్ఎల్3 కేటగిరీలో మనీషా రామ్‌దాస్ - ప్రమోద్ భగత్ జోడీలు కూడా కాంస్య పతకాలను సాధించి సత్తా చాటాయి.






కామెంట్లు (0)