Magazines

2036 ఒలింపిక్స్‌ రేసులో ఏడు దేశాలు

1 గంట క్రితం

Olympics
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 2 నిమిషాల చదవడం

ఆతిథ్యం పోటీలో భారత్‌, జర్మనీ, ఖతార్‌, కొరియా, దక్షిణాఫ్రికా, టర్కీ, హంగరీ
అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ వెల్లడి


లాసానె (స్విట్జర్లాండ్‌) : 2036 ఒలింపిక్స్‌‌ ఆతిథ్య రేసులో భారత్‌ ‌సహా ఏడు దేశాలు పోటీపడుతున్నాయని అంతర్జాతీయ ఒలింపిక్‌ ‌కమిటీ (ఐఓసీ) మంగళవారం వెల్లడించింది. ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కుల ప్రక్రియలో మార్పులు చేసేందుకు ఐఓసీ అధ్యక్షురాలు క్రిస్టీ అన్ని దేశాల నుంచి సలహాలు, సూచనలు కోరిన సంగతి తెలిసిందే. ఐఓసీ ఫ్యూచర్‌ ‌హోస్ట్‌ ‌కమిషన్‌ ఈ ఏడు దేశాల ప్రపోజల్స్‌‌ను పరిశీలించనుంది. ఈ ఏడు దేశాలతో పాటు మరోవరైనా ఆతిథ్యంపై ఆసక్తి కనబరిస్తే అక్టోబర్‌ 31‌లోగా ఆసక్తి వ్యక్తీకరణ చేయాలని ఐఓసీ సూచించింది. ఆతిథ్య హక్కులు కేటాయించేందుకు ఎన్నో సాంకేతిక అంశాలు పరిశీలించాల్సి ఉంటుంది. క్రీడల మాస్టర్‌ ‌ప్లాన్‌, అథ్లెట్‌ ఎక్స్‌‌పీరియన్స్‌, ఫండింగ్‌ ‌స్ట్రాటజీ, పొలిటికల్‌-‌పబ్లిక్‌ ‌సపోర్టు, గేమ్స్‌ ‌డెలివరీ క్యాపబిలిటీస్‌, లెగసీ స్ట్రాటజీ వంటి అంశాలను కమిషన్‌ ‌పరిశీలిస్తుంది. 2036 ఒలింపిక్స్‌‌ను అహ్మదాబాద్‌ ‌నగరంలో నిర్వహించేందుకు భారత్‌ 2024లోనే ఆసక్తి కనబరిచిన సంగతి తెలిసిందే. ఇందుకోసం భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఏ) ఆసక్తి వ్యక్తీకరణ చేసింది. ఐఓఏతో పాటు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, గుజరాత్‌ ‌ప్రభుత్వం సైతం ఐఓసీ ఫ్యూచర్‌ ‌హోస్ట్‌ ‌కమిషన్‌ ‌ముందు మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌ప్రజంటేషన్‌ ఇవ్వనున్నాయి. ఒలింపిక్స్‌ ‌నిర్వహణలో క్రీడాకారుల ఎక్స్‌‌పీరియన్స్‌‌కే పెద్ద పీట వేయాలని ఐఓసీ అధ్యక్షురాలు క్రిస్టీ అభిప్రాయపడింది. ‘2036 ఒలింపిక్స్‌ ‌నిర్వహణపై ఐఓసీతో ప్రస్తుతం భారత్‌, జర్మనీ, హంగరీ, ఖతార్‌, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, టర్కీలు చర్చలు జరుపుతున్నాయి. 2036 ఒలింపిక్స్‌ ‌తర్వాత ఆతిథ్యం కోసం కొన్ని దేశాలు సంప్రదింపులు జరుపుతున్నాయి. 2036 ఆసక్తి వ్యక్తీకరణకు అక్టోబర్‌ 31 ‌తుది గడువు. ఫ్యూచర్‌ ‌హోస్ట్‌ ‌కమిషన్‌ ‌ముందు నవంబర్‌‌లో ప్రపోజల్స్‌ ‌ప్రజంటేషన్స్‌ ఉంటాయని’ ఐఓసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా, ఫ్యూచర్‌ ‌హోస్ట్‌ ‌కమిషన్‌ ఈ ఏడు దేశాల ప్రపోజల్స్‌ ‌ప్రజంటేషన్స్‌ అనంతరం సాంకేతిక కొలమానాల ప్రకారం మార్కులు వేసి ఆ నివేదికను ఐఓసీకి అందజేస్తుంది. 2029లో జరిగే అంతర్జాతీయ ఒలింపిక్‌ ‌కమిటీ ఎగ్జిక్యూటివ్‌ ‌బోర్డు సమావేశంలో ఓటింగ్‌ ఆధారంగా 2036 ఒలింపిక్స్‌ ‌హోస్ట్‌ ‌సిటీని ఎంపిక చేయనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్