పెరుగుతున్న నిల్వల ఒత్తిడి
దేశంలో రియాల్టీ మందగమనం.. :
నైట్‌ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్
న్యూఢిల్లీ: దేశీయ నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అమ్మకాల వేగం మందగించింది. అమ్మకాల కంటే కొత్త ఇళ్ల సరఫరా ఎక్కువవుతుండటంతో ఇన్వెంటరీ (నిల్వల) ఒత్తిడి క్రమంగా పెరుగుతోంది. డిమాండ్ కంటే సరఫరా ఎక్కువగా ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. 2026 జనవరి–సెప్టెంబర్ మధ్య దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 2,58,238 ఇండ్లు అమ్ముడయ్యాయి. ఇదే సమయంలో డెవలపర్లు 2,79,899 కొత్త నివాసాలను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. అంటే అమ్మకాల కంటే దాదాపు 21,700 ఇండ్లు అధికంగా కొత్తగా మార్కెట్‌లోకి వచ్చాయి. కొత్త ప్రాజెక్టులు అమ్మకాల కంటే ఎక్కువగా ఉండటం వరుసగా 16వ త్రైమాసికంలోనూ కొనసాగడం మార్కెట్‌లో స్తబ్దతను సూచిస్తోంది. కొత్త ఇండ్ల అందుబాటు పెరగడంతో వాటిని విక్రయిం చడానికి పట్టే సమయం కూడా ఎక్కువవు తోంది.
2025 మూడో త్రైమాసికంలో ఒక ఇంటిని విక్రయిం చడానికి సగటున 5.8 త్రైమాసికాలు (ఏడాదిన్నర పైగా) పట్టగా.. 2026 మూడో త్రైమాసికానికి ఇది 6.1 త్రైమాసికాలకు పెరిగింది. వరుసగా నాలుగు త్రైమాసి కాలుగా ఇదే పరిస్థితి కొనసాగడం రియల్ ఎస్టేట్ రంగంలో ఆందోళనలు పెంచుతోంది. 2023 రెండో త్రైమాసికం తర్వాత ఇదే అత్యధిక ఎదురుచూపు కావడం విశేషం. జనవరి–సెప్టెంబర్ మధ్య కొత్త ఇండ్ల లాంచ్‌లు గత ఏడాదితో పోలిస్తే 4 శాతం పెరిగాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్త ప్రాజెక్టుల కంటే అమ్మకాల వేగం తక్కువగా ఉండటంతో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇండ్ల నిల్వలు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది. అయితే మందగమనం అన్ని నగరాల్లో ఒకేలా లేదని నైట్‌ఫ్రాంక్ తెలిపింది. ఢిల్లీ–ఎన్‌సిఆర్‌లో జనవరి–సెప్టెంబర్ మధ్య ఇండ్ల అమ్మకాలు 11 శాతం తగ్గి 35,574 యూనిట్లకు పడిపోయాయి.
ఎనిమిది ప్రధాన మార్కెట్లలో అమ్మకాలు తగ్గిన ఏకైక ప్రాంతం ఎన్‌సిఆర్ కావడం గమనార్హం. రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్య విలువైన ఇండ్ల అమ్మకాలు ఏకంగా 39 శాతం తగ్గి 4,033 యూనిట్లకు పరిమితమయ్యాయి. మరోవైపు ముంబయిలో అమ్మకాలు 1 శాతం, బెంగళూరులో 5 శాతం, కోల్‌కతాలో 4 శాతం, హైదరాబాద్‌లో 2 శాతం, అహ్మదాబాద్‌లో 2 శాతం పెరిగాయి. స్థూలంగా రూ.50 లక్షల లోపు ఇళ్ల అమ్మకాలు 14 శాతం తగ్గగా.. రూ.1–2 కోట్ల విభాగంలో 6.8 శాతం, రూ.2–5 కోట్ల విభాగంలో ఏకంగా 19.4 శాతం పెరుగుదల నమోదయ్యింది. దీంతో మొత్తం అమ్మకాల్లో రూ.1 కోటి పైబడిన ఇండ్ల వాటా 50 శాతం నుంచి 55 శాతానికి పెరిగింది.
తగ్గని ఇండ్ల ధరలు.. అమ్మకాలు నెమ్మదించినప్పటికీ ఇండ్ల ధరలు మాత్రం తగ్గలేదు. 2026 మూడో త్రైమాసికంలో అన్ని ప్రధాన మార్కెట్లలోనూ నివాస గృహాల ధరలు పెరిగాయి. ఎన్‌సిఆర్, బెంగళూరు మినహా చాలా నగరాల్లో ఏడాదికేడాదితో పోల్చితే ధరల పెరుగుదల 3–6 శాతం మధ్య ఉంది. ఎన్‌సిఆర్‌లో గురుగావ్ ధరలు 4 శాతం, నోయిడాలో 7 శాతం, గ్రేటర్ నోయిడాలో 11 శాతం, ఘాజియాబాద్‌లో 14 శాతం పెరిగాయి. రానున్న పండుగ సీజన్‌లో అమ్మకాలు పుంజుకుంటాయా, లేక కొత్త సరఫరా మరింత పెరిగి ఇన్వెంటరీ ఒత్తిడిని తీవ్రతరం చేస్తుందా అన్నది కీలకంగా మారింది. ఆర్‌బిఐ ప్రస్తుత భేటీలో వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు రియల్ ఎస్టేట్ డిమాండ్‌పై ప్రభావం చూపనుంది.






కామెంట్‌లు (0)