నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలోని నిరుద్యోగ యువతకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో భారీ శుభవార్త తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంలోని ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టరేట్‌లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 102 ఖాళీలను భర్తీ చేయనున్నట్లుగా కమిషన్ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ పర్పస్ సోషల్ ఆర్గనైజర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కేడర్లలోని ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సరైన విద్యార్హతలు కలిగి, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
అయితే, మొత్తం ఖాళీల సంఖ్య 102 పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులు. రిజర్వేషన్ వారీగా అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితి సడలింపు వర్తిస్తుంది. అదేవిధంగా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం, కళాశాల నుంచి స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు సిలబస్, పరీక్ష విధానం, ఖాళీల కేటాయింపు, ఇతర పూర్తి సమాచారం కోసం TGPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.






కామెంట్‌లు (0)