నవతెలంగాణ-హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో డిజిటల్ రూపంలో కార్యకలాపాలు ఊపందుకున్న విషయం తెలిసిందే. డిజిటల్ ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వం అందుకు బహుళ ప్రచారం కల్పించింది. ఈక్రమంలోనే కేంద్ర సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆధునిక పరికరాల అవసరాల రీత్యా కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ల కొనుగోలు ధర పరిమితిని ప్రభుత్వం పెంచింది. ఇకపై అర్హత ఉన్న అధికారులు రూ.1.8 లక్షల వరకు విలువైన డివైజ్‌లను పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు వంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌లు కొనుగోలు చేసే విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ కీలక మార్పులు చేసింది.
ఆర్థిక శాఖకు చెందిన వ్యయ విభాగం (Department of Expenditure) నవంబర్ 10న కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసే విధానంలో ఈ మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, సెక్షన్ ఆఫీసర్ హోదా లేదా అంతకంటే పై స్థాయిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ డివైజ్‌లు పొందేందుకు అర్హులు. 7వ కేంద్ర వేతన సంఘం (7th Central Pay Commission) ప్రకారం, పే లెవల్ 12 లేదా అంతకంటే పై స్థాయిలో ఉన్న మంత్రిత్వ శాఖ ఉద్యోగులందరికీ ఈ డివైజ్‌లు పొందే అర్హత ఉంటుంది. పే లెవల్ 8 నుంచి 11 మధ్య ఉన్న ఉద్యోగుల్లో ఒక విభాగానికి చెందిన మొత్తం అధికారుల్లో 50 శాతం మందికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. అయితే సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా విభాగం కార్యదర్శి, ఆర్థిక సలహాదారుతో చర్చించి ఈ పరిమితిని పెంచవచ్చు.
ప్రభుత్వం అందించే ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు కొనుగోలు చేసిన తేదీ నుంచి నాలుగేళ్ల వరకు ప్రభుత్వ ఆస్తిగానే ఉంటాయి. ఈ సమయంలో వాటిని కేటాయించిన అధికారి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపయోగించాలి. అయితే ఆ డివైజ్‌లో ఉన్న డేటా, సమాచారం భద్రత విషయంలో సంబంధిత అధికారే వ్యక్తిగతంగా బాధ్యత వహించాలి. నాలుగేళ్ల వినియోగం పూర్తయిన తర్వాత ఆ అధికారికి ఆ డివైజ్‌ను తన వ్యక్తిగత అవసరాల కోసం దగ్గరే ఉంచుకునే హక్కు ఉంటుంది.






కామెంట్లు (0)