Magazines

ఇమ్రాన్‌ ఖాన్‌కు ముంబై పోలీసుల నోటీసులు.. దేశం విడిచి వెళ్లాలని ఆదేశం

15 అక్టోబర్, 2026

Mumbai Police issues notice to Imran Khan, orders him to leave the country
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్‌ ఖాన్‌కు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. అక్టోబర్‌ 28లోగా భారత్‌ విడిచి వెళ్లాలని ఆదేశించారు. భారత పౌరుడు కాకపోయినా రాజకీయ నిరసనలో పాల్గొన్నందుకు ఇమ్మిగ్రేషన్‌ నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 10న ముంబైలోని ఆగస్ట్‌ క్రాంతి మైదానంలో ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలో ఇమ్రాన్‌ తన భాగస్వామి లేఖా వాషింగ్టన్‌, కజిన్‌ జేన్‌ మేరీ ఖాన్‌తో కలిసి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఇమ్రాన్‌తో పాటు సుమారు 400 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేశారు. ఇమ్రాన్‌ అమెరికా పౌరసత్వంతో పాటు ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) కార్డు కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భారత పౌరుడు కానందున నిరసనలో పాల్గొనడంపై సంబంధిత నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అరెస్టు సమయంలో పోలీస్‌ వ్యాన్‌లో ఉన్న ఫొటోను ఇమ్రాన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా, పోలీసులతో ‘జై హింద్‌’ అంటూ మాట్లాడుతున్న వీడియో కూడా వైరల్‌ అయింది. తనను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో తెలియదని, సుమారు రెండు గంటల పాటు వ్యాన్‌లో తిప్పి వదిలేశారని ఆయన చెప్పిన మాటలు కూడా అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్