Magazines

సీసీ రోడ్ల పనులకు వేగం

1 గంట క్రితం

CC roads
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

- బతుకమ్మకు ముందే అసంపూర్తి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచన

- వైస్‌చైర్మన్‌ జూపల్లి రమేష్‌బాబు చొరవ

నవతెలంగాణ - అశ్వారావుపేట

మట్టి, గ్రావెల్‌ రోడ్ల స్థానంలో సీసీ రోడ్ల నిర్మాణంతో అశ్వారావుపేట మున్సిపాలిటీలో రహదారి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు వేగవంతమయ్యాయి. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదేశాల మేరకు చేపట్టిన పనుల్లో మిగిలిన అసంపూర్తి పనులను సైతం త్వరితగతిన పూర్తి చేయించేందుకు మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ జూపల్లి రమేష్‌బాబు అధికారులతో సమన్వయం చేస్తున్నారు.


మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు ఏఎస్‌ఆర్‌ నగర్‌లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. అయితే కాలనీ ప్రవేశద్వారం వద్ద సుమారు 20 మీటర్ల మేర రోడ్డు నిర్మాణం మిగిలి ఉండటాన్ని గుర్తించిన వైస్‌చైర్మన్‌ సంబంధిత అధికారులకు ఫోన్‌ చేసి వెంటనే పనులు పూర్తి చేయాలని సూచించారు.


అలాగే 20వ వార్డు డ్రైవర్స్‌ కాలనీలో కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో సీసీ రోడ్డు పనులు తుది దశలో ఉన్నాయి. దసరా, బతుకమ్మ వేడుకల నేపథ్యంలో ప్రజలకు, మహిళలకు రాకపోకల్లో ఇబ్బందులు తలెత్తకుండా నవరాత్రుల ప్రారంభం నాటికే మిగిలిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


మున్సిపాలిటీ పరిధిలో మట్టి, గ్రావెల్‌ రోడ్ల స్థానంలో సీసీ రోడ్లు నిర్మాణం పూర్తయితే వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే రహదారి ఇబ్బందులు తగ్గనున్నాయి. అసంపూర్తి పనులను గుర్తించి వాటిని పూర్తి చేయించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు జూపల్లి రమేష్‌బాబు తెలిపారు. కార్యక్రమంలో మండల యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు జూపల్లి ప్రమోద్‌, 10వ వార్డు కౌన్సిలర్‌ మిండా హరిబాబు, 20వ వార్డు కౌన్సిలర్‌ ఎస్‌.కె. నూర్జహాన్‌, విజయ్‌కుమార్‌రెడ్డి, కానూరి మోహన్‌రావు, ఎస్‌.కె. సైదుబాజీ, దండబత్తుల రమేష్‌, దోరేపల్లి కరుణాకర్‌, దాబా రాజు, డేరంగుల చంటి, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్