Magazines

రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ కర్తవ్యం

7 గంటల క్రితం

Aadi Srinivas
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 2 నిమిషాల చదవడం

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

రుద్రంగి మార్కెట్ కమిటీ కార్యాలయం ప్రారంభించిన ఆది శ్రీనివాస్

నవతెలంగాణ - రుద్రంగి
రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో సుమారు రూ.42 లక్షలతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. రుద్రంగి మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు మరో రూ.70 లక్షలకు పైగా నిధులతో పనులకు టెండర్లు పూర్తయ్యాయని వెల్లడించారు. త్వరలోనే ఈ పనులకు భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు.


మార్కెట్ యార్డు అభివృద్ధికి సంబంధించి ప్రస్తుతం ట్రెజరీలో సుమారు రూ.5 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మరో రూ.కోటి నిధులు రావాల్సి ఉందని చెప్పారు. మొత్తంగా రూ.6 కోట్లకు పైగా నిధులతో రుద్రంగి మార్కెట్ పరిధిలోని రైతులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నాయకత్వంలో రూ.76 వేల కోట్ల రుణమాఫీ జరిగిందని గుర్తుచేశారు.


రుద్రంగిలో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి పనులను మరో నెల రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉందని ఆది శ్రీనివాస్ తెలిపారు. సుమారు రూ.46 కోట్లతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. అలాగే 8 ఎకరాల స్థలంలో 8 వేల నుంచి 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాం నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని వెల్లడించారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సుందరీకరణ పనులతోపాటు బతుకమ్మ పండుగ సందర్భంగా ఐదు ప్రాంతాల్లో బతుకమ్మ తెప్పల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.


రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇటీవల రూ.99.48 కోట్ల నిధులు విడుదలయ్యాయని, సంబంధిత పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. రుద్రంగి మండలంతోపాటు వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. రైతులు, మహిళలు, పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్