Magazines

'మిస్ట్' ఇంజనీరింగ్ కళాశాలలో కన్నుల పండువగా బతుకమ్మ వేడుకలు

2 గంటల క్రితం

bathukamma
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 2 నిమిషాల చదవడం

- కళాత్మక బతుకమ్మలను ఎంపిక చేసి బహుమతులు ప్రదానం

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సత్తుపల్లిలోని మదర్ థెరెసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాల (మిస్ట్) లో గురువారం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉమెన్ వెల్ఫేర్ కమిటీ ఆఫ్ మిస్ట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత  వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ ఉత్సవాలు సాగాయి. డిప్లమో, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, డీఎడ్, బీఎడ్ విభాగాల విద్యార్థినులు ఈ సంబురంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 150 మంది విద్యార్థినులు 25 టీంలుగా ఏర్పడి సంప్రదాయ వస్త్రాలతో ముస్తాబయ్యారు.


ఔషధ గుణాలున్న తంగేడు, గునుగు, బంతి, చామంతి, కట్ల, సంపెంగ, మొల్ల, సీతజడలు, రుద్రాక్ష, పోకబంతి, మల్లె, మందారం, మరువం, పారిజాతం, కమలం, తామర, గన్నేరు, గుమ్మడి, గులాబీ, పట్టుకుచ్చుల పూలతో బతుకమ్మలను పేర్చారు. వివిధ పరిమాణాలలో కళాత్మకంగా పేర్చిన బతుకమ్మలను ఆవరణలో అమర్చి భక్తిశ్రద్ధలతో గౌరీదేవికి పూజలు చేసి, ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా తెలంగాణ సాంస్కృతిక గీతాలను ఆలపించారు. విద్యార్థినుల నృత్య ప్రదర్శనలు అక్కడకు వచ్చిన చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా బ్రాంచీల వారీగా ఉత్తమ బతుకమ్మ టీములను ఉమెన్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు ఎంపిక చేశారు.


విజేతలకు ప్రిన్సిపాల్ డాక్టర్ చలసాని హరికృష్ణ, మదర్ థెరెసా సంస్థల ప్రెసిడెంట్ చలసాని సాంబశివరావు, ఉమెన్స్ వెల్ఫేర్ కమిటీ కో-ఆర్డినేటర్ పద్మజ్యోతి చేతుల మీదుగా  విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ భాద్రపద అమావాస్యతో వేడుకలు మొదలవుతాయన్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించుకోవడం ఆనవాయితీ అన్నారు. ఈ ఉత్సవాలు తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయని తెలిపారు.

కులమతాలకు అతీతంగా పల్లెల నుంచి పట్టణాల వరకు అందరూ కలిసి జరుపుకుంటారని చెప్పారు.


ఈ పండుగ  వాతావరణంలో జరుపుకునే ఈ సంబురాలు సమాజంలో సోదరభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడమే దీని ముఖ్య ఉద్దేశమని, 

తెలంగాణ అస్తిత్వాన్ని చాటేలా ప్రతి ఏటా కళాశాలలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. ఉదయ్ కిరణ్ భార్గవ్, ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎంవీ రామచంద్రరావు, వెల్ఫేర్ కమిటీ సభ్యులు కె. నిరోషా, కె. సుజాత, సిహెచ్. పావని, మహిళా అధ్యాపకులు, వివిధ విభాగాల అధిపతులు, బోధనేతర సిబ్బంది పాల్గొని  బతుకమ్మ వేడుకలను విజయవంతం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్