- గతంలో ఆంధ్రా వ్యాపారుల చేతుల్లోనే కొనుగోళ్లు
- పోటీతో పెరిగిన కోకో గింజల ధరలు
- 45 రోజుల్లో 60 క్వింటాళ్ల సేకరణ
- సేకరణ కేంద్రం నిర్వాహకులు పద్మ శేఖర్
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట ప్రాంతంలో తెలంగాణ కోకో కంపెనీ కలెక్షన్ సెంటర్ ఏర్పాటు కావడంతో కోకో సాగు చేస్తున్న రైతులకు మెరుగైన ధరలు లభిస్తున్నాయి. గతంలో స్థానికంగా కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారులు నిర్ణయించిన ధరలకే రైతులు కోకో గింజలను విక్రయించాల్సి వచ్చేది. తెలంగాణ కోకో కంపెనీ కొనుగోళ్లు ప్రారంభించడంతో మార్కెట్లో పోటీ పెరిగి రైతులకు ప్రయోజనం చేకూరుతోంది.
గతంలో కోకో ధర రూ.350 ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారులు రూ.300 లోపే కొనుగోలు చేసేవారు. తెలంగాణ కోకో కంపెనీ ప్రారంభంలోనే రూ.350 ధరతో కొనుగోళ్లు చేపట్టడంతో పోటీగా ఇతర వ్యాపారులు కూడా ధరలు పెంచాల్సి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో కోకో ధర రూ.400కు చేరువలో ఉండగా, మార్కెట్ ధరకు అనుగుణంగా రైతులకు మెరుగైన ధర చెల్లిస్తూ కొనుగోళ్లు చేస్తున్నామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం కంపెనీ కిలో కోకో గింజలను రూ.390కు కొనుగోలు చేస్తోందని, కొన్ని ఇతర కేంద్రాల్లో అంతకంటే తక్కువ ధర చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.
రైతు అనుభవంతో కొనుగోలు కేంద్రం ఏర్పాటు:
తాను స్వయంగా పామాయిల్, కోకో, కొబ్బరి పంటలు సాగు చేస్తున్నానని, వ్యవసాయంలో రైతులు ఎదుర్కొనే లాభనష్టాలు తనకు తెలుసని కంపెనీ ప్రతినిధి వివరించారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించాలనే ఉద్దేశంతో తెలంగాణ కోకో కంపెనీ కలెక్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రం వల్ల తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రైతులకు కూడా మెరుగైన ధరలు పొందే అవకాశం ఏర్పడిందన్నారు.
వెయ్యి ఎకరాల్లో కోకో సాగు:
అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సుమారు 100 నుంచి 150 మంది రైతులు కోకో సాగు చేస్తున్నట్లు అంచనా. కొబ్బరి, పామాయిల్ తోటల్లో అంతర పంటగా సాగు చేస్తున్న కోకో విస్తీర్ణం లేత, ముదురు తోటలన్నీ కలిపి సుమారు వెయ్యి ఎకరాలు ఉండవచ్చని తెలిపారు. ఏలూరుకు చెందిన కాడ్బరీ కంపెనీ నుంచి కోకో మొక్కలను రైతులు పొందుతున్నారని, ఉద్యానవన శాఖ ద్వారా రాయితీలు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు.
తోటల వయసును బట్టి దిగుబడి:
ఆరు సంవత్సరాలు దాటిన కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేస్తున్న కోకో నుంచి ఎకరాకు సుమారు నాలుగు నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా, అదే వయసున్న పామాయిల్ తోటల్లో ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్ల దిగుబడి వస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ కోకో కంపెనీ కలెక్షన్ సెంటర్ ప్రారంభమై 45 రోజులు కాగా, ఇప్పటివరకు 60 క్వింటాళ్ల కోకో గింజలను సేకరించినట్లు కంపెనీ ప్రతినిధి కాసాని పద్మశేఖర్ వెల్లడించారు.






కామెంట్లు (0)