- వైఫల్యాన్ని అధికారులపై నెట్టడం తీవ్ర విచారకరం
- రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే
- పంట నష్టపోయిన రైతాంగానికి తక్షణమే పరిహారం చెల్లించాలి
- బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
నవతెలంగాణ-సత్తుపల్లి
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రే స్వయంగా అధికారులపై నెపం నెట్టే ప్రయత్నం చేయడం విచారకరమని ఆయన అన్నారు. గురువారం సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలలో సండ్ర మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యలు, గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన విప్లవాత్మక అభివృద్ధి కార్యక్రమాలను సండ్ర ప్రస్తావించారు.
రాష్ట్రంలో నెలకొన్న కరెంట్ కష్టాలను పరిష్కరించి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం, తన బాధ్యతను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. అధికారులపై కనీస పట్టు సాధించలేకపోతున్న ముఖ్యమంత్రి, మీరు నా మాట వినడం లేదు అని బహిరంగంగా వ్యాఖ్యానించడం పాలనాపరమైన వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇటీవల గోదావరిఖని పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సింగరేణి బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి నిగ్గు తేల్చి వాస్తవాలను ప్రజల ముందుంచారని గుర్తుచేశారు. గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలతో విసిగిపోయిన ప్రజలు, రైతులు సబ్స్టేషన్ల ఎదుట రాజకీయాలకు అతీతంగా ఆందోళనలు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని ధ్వజమెత్తారు.
ప్రజా సమస్యల పరిష్కారాన్ని గాలికి వదిలేసి, ఢిల్లీ పర్యటనలు, రాజకీయ కార్యకలాపాలకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని విమర్శించారు. వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ అందించే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన మౌలిక సదుపాయాలు, పనిచేసిన అధికారులే ఇప్పుడు కూడా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పాలనలోనే విద్యుత్ కోతలు ఎందుకు వస్తున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్నినో సాకుతో తప్పించుకోకుండా, సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్రవ్యాప్తంగా నిరంతర విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, కరెంట్ కోతల వల్ల పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
అవసరమైన ప్రాంతాల్లో కరువు మండలాలు ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ మాజీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, నాయకులు కూసంపూడి రామారావు, మల్లూరి అంకమరాజు, అమరవరపు కృష్ణారావు, మోదుగు పుల్లారావు, బెల్లంకొండ రాము, చాంద్ పాషా, పర్వతనేని వేణు, వల్లభనేని పవన్, నడ్డి ఆనందరావు, మేకల నరసింహారావు, జొన్నలగడ్డ విజయ్, మోరంపూడి శివ పాల్గొన్నారు.






కామెంట్లు (0)