- ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు కృషి చేయండి: డీఐఈఓ రవిబాబు
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈఓ) రవిబాబు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా అధ్యాపకుల అటెండెన్స్ రిజిస్టర్, విద్యార్థుల హాజరు పట్టికలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే అకాడమిక్ రిజిస్టర్లు, ఇప్పటివరకు విద్యార్థులకు నిర్వహించిన యూనిట్, హాఫ్ ఇయర్లీ పరీక్షల మార్కుల వివరాలను ఆయన తనిఖీ చేశారు. లెక్చరర్ల టీచింగ్ డైరీలను పరిశీలించి, పాఠ్యాంశాల బోధన పురోగతిపై డీఐఈఓ రవిబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే ప్రాక్టికల్ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడానికి ల్యాబ్‌లను పరిశీలించారు.
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ప్రయోగశాలలను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మార్చి 2027లో జరగబోయే పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వార్షిక పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించేందుకు అధ్యాపకులకు పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రిన్సిపాల్ డాక్టర్ బి. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ... ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా మెరుగైన ర్యాంకులు సాధిస్తామని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి, ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు శాయశక్తులా కృషి చేస్తామని డీఐఈఓ రవిబాబుకు హామీ ఇచ్చారు.
అనంతరం కళాశాల అధ్యాపక బృందంతో డీఐఈఓ ప్రత్యేకంగా స్టాఫ్ మీటింగ్ నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కష్టపడి బోధించాలని డీఐఈఓ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. భాగ్యలక్ష్మితో పాటు అధ్యాపకులు వనజరాణి, కల్పన, కృష్ణవేణి, రామారావు, రాణి, శ్వేత, శిరోమణి, సమ్మక్క, వెంకటేశ్వరావు, సౌజన్య, సీత పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)