- బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
నవతెలంగాణ-సత్తుపల్లి : రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిపి లక్ష్యంగా గులాబీ శ్రేణులు పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గులాబీ శ్రేణులను కోరారు. సత్తుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సండ్ర సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలపై సన్నాహక సమావేశాన్ని సండ్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి, పెనుబల్లి మండలాల ముఖ్య నాయకులకు సండ్ర ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రోజురోజుకూ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ రాజకీయ కక్ష వేధింపులకు పాల్పడుతున్నారని, మాజీ మంత్రి హరీష్ రావును అనవసరంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 22ఏ నిషేధిత భూముల వ్యవహారంపై ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడటం ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. మియాపూర్ భూముల వ్యవహారంపై మాట్లాడగా, 2017లో అక్రమ రిజిస్ట్రేషన్ల విషయం వెలుగులోకి రాగానే నాటి సీఎం కేసీఆర్ స్పందించి సర్వే నంబర్లు 100, 101లలో రిజిస్ట్రేషన్లను నిలిపివేయించారని గుర్తుచేశారు. ఉన్నతాధికారులతో సమీక్షించి, సీఐడీ విచారణకు ఆదేశించడంతో పాటు అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. 2015 నుంచి 2023 వరకు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం జరిపిన సుదీర్ఘ న్యాయపోరాటం వల్లే ప్రభుత్వ భూములకు రక్షణ దక్కిందని స్పష్టం చేశారు. ఆ విజయపు ఘనతను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం సరికాదని అన్నారు. రైతుల పరిస్థితి రాష్ట్రంలో దయనీయంగా మారిందని, ఎల్-నినో ప్రభావం, అకాల వర్షాలతో పంటలు దెబ్బతింటుంటే ప్రభుత్వం వ్యవసాయానికి సరైన విద్యుత్ ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ఉన్నత విద్య ఇబ్బందుల్లో పడిందని, నిరుద్యోగులు, ఉద్యోగులు కాంగ్రెస్ పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 స్థానాలకు గాను కేవలం ఒకే స్థానంలో గెలవడం ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై నాయకులకు మార్గదర్శకాలను అందించారు. 2026 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లు రెండూ కీలకమని చెప్పారు. నవంబర్ 6 ఓటరు నమోదుకు చివరి తేదీ కావడంతో మిగిలిన రోజుల్లో నాయకులు గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద అర్హుల జాబితాలను సేకరించి ముమ్మరంగా నమోదు ప్రక్రియ చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కూసంపూడి రామారావు, బొడ్డు శివబాబు, మందలపు ప్రభాకర్, చక్కిలాల లక్ష్మణరావు, చక్కిలాల మోహనరావు, భాను, కోటగిరి సుధాకరబాబు, మందలపు అశోక్, టీవీ రామారావు, చింతల సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.






కామెంట్లు (0)