Magazines

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ మార్పును కోరడంలో తప్పులేదు

53 నిమిషాల క్రితం

a change of government in a democracy.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 2 నిమిషాల చదవడం

నిరసనలో హింసకు ప్రేరేపించినట్లు ఎలాంటి ఆధారాలూ లేవు

ఢిల్లీ హైకోర్టులో నేహా బోరా తరపు న్యాయవాది వాదన

వ్యక్తిగత బాండ్‌ నోటీసును సవాలు చేస్తూ పిటిషన్‌

తీర్పును రిజర్వ్‌ చేసిన ఢిల్లీ హైకోర్టు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ మార్పును కోరడం లో ఎలాంటి తప్పు లేదని ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా తరఫు సీనియ‌ర్ న్యాయ వాది గోపాల్‌ శంకరనారాయణన్ ఢిల్లీ హైకోర్టులో వాదించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు రూ. 10 వేల వ్యక్తిగత బాండ్‌తోపాటు ఒక ష్యూరిటీ సమ ర్పించాలని ఢిల్లీ పోలీసులు జారీ చేసిన నోటీసును నేహా బోరా ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిష‌న్‌ను గురువారం ఢిల్లీ హైకోర్టు న్యాయ‌మూర్తి జస్టిస్‌ సుబ్రమోణియం ప్రసాద్‌తో కూడిన ఏక‌స‌భ్య ధ‌ర్మాస‌నం విచారించింది. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌ సుబ్రమోణియం ప్రసాద్‌ తీర్పును రిజర్వ్‌ చేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తీర్పు వెలువరిస్తామని తెలిపారు.

అక్టోబర్‌ 16న ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ‘లెహ్రా దో తిరంగా’ నిరసనలో పాల్గొన్న నేపథ్యంలో నేహా బోరాకు ఈ నోటీసు జారీ అయింది. భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్‌)లోని 126, 130 సెక్షన్లతోపాటు 135(3) సెక్షన్‌ కింద ఈ నోటీసు ఇచ్చారు. దీనిని, తదనంతర చర్యలను రద్దు చేయాలని ఆమె హైకోర్టును కోరారు. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చేతన్‌ శర్మ వాదిస్తూ నేహా బోరా పాల్గొన్న ఓ సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రభుత్వ మార్పుపై వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై ఆమె తరపు సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌ స్పంది స్తూ.. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ మార్పును కోరడంలో తప్పేమీ లేదని పేర్కొన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ మార్పు ఓట్ల ద్వారా జరగాలి తప్ప, ఢిల్లీ వీధుల్లో గుమిగూడే వ్యక్తుల ద్వారా కాదని వాదిం చారు. ప్రభుత్వ మార్పు కోరడం ప్రజాస్వామ్యంలో సహజమైన రాజకీయ అభిప్రాయమని, దాన్ని నేరంగా పరిగణించలేమని గోపాల్‌ శంకర నారాయణన్‌ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చేతన్‌ శర్మ వాదిస్తూ నేహా బోరాపై చేపట్టిన చర్యలు ముందస్తు భద్రతా చర్యలేనని, పిటిషన్‌ విచారణకు ఇంకా సమయం రాలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వు చేసింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్