Magazines

పదోతరగతి విద్యార్థినిపై ఉన్మాది ఘాతుకం

1 గంట క్రితం

Atrocity
avatar
balaji

ప్రచురించబడింది నవం 01, 2026 | 2 నిమిషాల చదవడం

రంపంతో దాడి..తీవ్ర గాయాలు

అడ్డొచ్చిన మరో విదార్థినిపైనా అఘాయిత్యం
అనంతపురం జిల్లా రాప్తాడులో దారుణం


రాప్తాడు: అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో దారుణం చోటు చేసుకుంది. పదోతరగతి విద్యార్థినిపై ఓ ఉన్మాది రంపంతో దాడి చేశాడు. దీంతో ఆమె ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిని అడ్డుకునేందుకు యత్నించిన మరో విద్యార్థినిపైనా దాడికి పాల్పడడంతో ఆమెకూ గాయాలయ్యాయి. అప్రమత్తమైన సహచర విద్యార్థులు, ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరోపక్క పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.ఈ ఘటనతో పాఠశాలలో భయాందోళనలు నెలకొన్నాయి.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని పరిస్థితిపై ఆరా తీశారు. ఆమెకు అందుతున్న చికిత్స గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్‌ స్పందిస్తూ.. చిన్నారి చెల్లిని తరగతి గదిలో రక్తపుమడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదన్నారు. ఉన్మాదులను ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. ఆడపిల్లలు, మహిళలవైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తామని, ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.

అమానవీయ ఘటనలకు సమాజంలో చోటు లేదు: పవన్‌ కల్యాణ్‌

రాప్తాడు ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అమానవీయ ఘటనలకు సమాజంలో చోటు లేదన్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలితోపాటు గాయపడిన మరో విద్యార్థినికి కూడా మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. విద్యార్థిని కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. నిందితుడిని తక్షణం అరెస్టు చేసి, చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని పోలీసుశాఖకు దిశానిర్దేశం చేశారు.

బాధితులకు ఎమ్మెల్యే సునీత పరామర్శ

అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డు ఆపరేషన్‌ థియేటర్‌లో చికిత్స పొందుతున్న బాలికను ఎమ్మెల్యే పరిటాల సునీత పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. అనంతరం సీఎం చంద్రబాబుతో ఫోన్‌లో బాలిక కుటుంబ సభ్యులను మాట్లాడించారు. బాధిత కుటుంబాన్ని సీఎం పరామర్శించి.. భరోసా ఇచ్చారు.

స్పందించిన ఏపీ మహిళా కమిషన్..
పదోతరగతి విద్యార్థినిపై ఉన్మాది దాడి ఘటనపై ఏపీ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. బాధితురాలిపై దాడితో పాటు దాడిని అడ్డుకునే క్రమంలో గాయపడిన మరో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపైనా మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డా.రాయపాటి శైలజ ఆరా తీశారు. వారికి అందుతున్న వైద్యంపై వివరాలు తెలుసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్