దేశంలో ప్రయివేటు వైద్యం భారం
ప్రసవానికి ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.2,299.. ప్రయివేటులో రూ.37,630
ప్రయివేటు ఆస్పత్రుల ధరలకు పరిమితులు పెట్టాలన్న పార్లమెంటరీ కమిటీ
జీడీపీలో ఆరోగ్యానికి 2.5 శాతం లక్ష్యం..
1.43 శాతానికే పరిమితమైన కేంద్రం వ్యయం
కేంద్రంలోని మోడీ పాలనలో ఆరోగ్య రంగం ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటోంది. దేశంలో ఓ కుటుంబానికి అనారోగ్యం వస్తే ముందుగా గుర్తొచ్చేది ఆస్పత్రి కాదు.. ఖర్చే. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే ఖర్చు తక్కువే. ఇక తప్పని పరిస్థితిలో ప్రయివేటు ఆస్పత్రికి వెళ్తే చికిత్సతో పాటు అప్పుల భారం కూడా పెరిగే పరిస్థితి. ప్రయివేటు వైద్యం ధరలపై నియంత్రణ లేకపోవడం, ప్రభుత్వ ఆరోగ్య రంగానికి తగినంత నిధులు కేటాయించకపోవడం సామాన్యులపై ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయి. దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న మధ్యతరగతి ప్రజలకు ఈ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.
న్యూఢిల్లీ : దేశంలో వైద్యం సామాన్య కుటుంబాలకు అందని భారంగా మారుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తక్కువ ఖర్చుతో చికిత్స అందుతున్నప్పటికీ.. అక్కడ సరైన వసతులు, సేవలు లేక ప్రయివేటు ఆస్పత్రులపై ఆధారపడాల్సి వస్తే కుటుంబాలు భారీ మొత్తాలు చెల్లించాల్సి వస్తోంది. అనారోగ్యం ఒక వైపు.. వైద్య బిల్లు మరోవైపు.. ఇలా శారీరంగం, ఆర్థికంగా సాధారణ మనిషి సతమతమవుతున్నాడు. ప్రయివేటు వైద్య ఖర్చులు పేద, మధ్యతరగతి కుటుంబాలను అప్పుల్లోకి నెట్టే ప్రమాదం ఉందని ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రసవానికే 16 రెట్లు ఖర్చు
2025లో ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవానికి కుటుంబం సొంతంగా చెల్లించిన సగటు వైద్య ఖర్చు రూ.2,299గా ఉంది. అదే ప్రయివేటు ఆస్పత్రిలో రూ.37,630కు చేరింది. అంటే దాదాపు 16 రెట్లు ఎక్కువ. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందడానికి ప్రభుత్వ రంగంలో సగటు ఖర్చు రూ.6,631 కాగా.. ప్రయివేటులో రూ.50,508గా నమోదైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయటి రోగి (ఔట్ పేషేంట్) చికిత్సకు సగటు ఖర్చు రూ.289 మాత్రమే ఉండగా..
ప్రయివేటులో రూ.1,447గా ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సలకు సంబంధించి సగం సందర్భాల్లో కుటుంబాలు ఎలాంటి ఖర్చూ చేయలేదని అధి కారిక గణాంకాలు చెప్తున్నాయి. ఇది దేశంలో ప్రభుత్వ సేవల ప్రాధాన్యతను సూచిస్తోంది.
రాష్ట్రాల మధ్య భారీ తేడాలు
భారత్లో ప్రయివేటు, ప్రభుత్వ వైద్యం మధ్య ఖర్చు తేడా అన్ని రాష్ట్రాల్లో ఒకేలా లేదు. తమిళనాడులో ప్రభుత్వ ఆస్పత్రిలో ఆస్పత్రి బసకు సగటు ఖర్చు రూ.1,357 కాగా.. ప్రయివేటులో రూ.74,168గా ఉంది. అంటే ఇది 55 రెట్లు అధికం. 39.1 రెట్లు అధిక ఖర్చుతో గోవా తర్వాతి స్థానంలో ఉంది. 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పదింటిలో ప్రయివేటు ఆస్పత్రి ఖర్చులు ప్రభుత్వ ఆస్పత్రి ఖర్చులతో పోలిస్తే 10 రెట్లు అధికంగా ఉన్నాయి.
ఆరోగ్యానికి ఎంత ఖర్చు?
2022-23లో కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు కలిపి ప్రభుత్వ ఆరోగ్య వ్యయం సుమారు రూ.3.85 లక్షల కోట్లుగా ఉంది. ఇది దేశ జీడీపీలో సుమారు 1.43 శాతానికి సమానం. అయితే జాతీయ ఆరోగ్య విధానం-2017 ప్రకారం 2025 నాటికి ప్రభుత్వ ఆరోగ్య వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతానికి పెంచాలనే లక్ష్యం ఉంది. దీంతో ఆ లక్ష్యం చేరకపోవడంపై పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.
కరోనా తర్వాత మళ్లీ కుటుంబాలపైనే భారం
కరోనా సమయంలో 2021-22లో ప్రభుత్వం ప్రజల ఆరోగ్య ఖర్చుల్లో సుమారు 60 శాతం భరించింది. కానీ 2022-23లో కుటుంబాలు స్వయంగా భరించిన ఆరోగ్య ఖర్చు వాటా 43.4 శాతంగా ఉంది. అంటే మహమ్మారి సమయంలో పెరిగిన ప్రభుత్వ సహాయం తర్వాత కుటుంబాలపై మళ్లీ భారీ భారం పడింది.
మందులకే భారీ ఖర్చు
దేశంలో ఆరోగ్య ఖర్చులో మందుల వాటా కూడా గణనీయంగా ఉంది. 2022-23లో ఫార్మసీలకు వెళ్లిన మొత్తం ఖర్చు రూ.1.62 లక్షల కోట్లుగా నమోదైంది. మందుల ఖర్చులో పెద్ద భాగాన్ని ప్రజలే నేరుగా భరిస్తున్నారని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. ముఖ్యంగా ఆస్పత్రిలో చేరని వారికి వైద్య పరీక్షలు, డాక్టర్ ఫీజులు, మందుల ఖర్చులకు ప్రస్తుత బీమా రక్షణ సరిపోవడం లేదని వివరించింది.
మొత్తం 368 సిఫారసులు
ఈ ఏడాది ఆగస్టు 7న సమర్పించిన 176వ నివేదికలో ఆరోగ్య రంగంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం మొత్తం 368 సిఫారసులు చేసింది.
ప్రభుత్వ ఆస్పత్రుల మౌలిక వసతులను బలోపేతం చేయడం, ప్రయివేటు వైద్య ఖర్చులను నియంత్రించడం, మందుల లభ్యతను మెరుగుపరచడం, ఆరోగ్య బీమా పరిధిని విస్తరించడం వంటి అంశాలపై దృష్టి పెట్టింది. పీఎం-జేఏవై పరిధిలో డాక్టర్ కన్సల్టేషన్, పరీక్షలు, మందుల వంటి ఆస్పత్రి బయట ఖర్చులను కూడా చేర్చాలని సూచించింది. దేశంలో ఆరోగ్యం ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండాలంటే ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాల ్సిందేనని నిపుణులు చెప్తున్నారు. ప్రయివేటు ఆస్పత్రులపై ఆధారపడే పరిస్థితి తగ్గించడంతో పాటు.. చికిత్స ధరలపై పారదర్శకత, నియంత్రణ ఉండాలని సూచిస్తున్నారు. లేదంటే పేద, మధ్యతరగతి కుటుంబానికి అనారోగ్యం అంటే వైద్యం మాత్రమే కాదు.. అప్పుల భారం కూడా అవుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు ఆ వైపుగా దృష్టి సారించి విధానాలను తీసుకురావాలని అంటున్నారు.
మోడీ సర్కారుకు కమిటీ ప్రశ్నలు
ఆరోగ్యానికి జీడీపీలో 2.5 శాతం కేటాయించాలనే లక్ష్యం ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆరోగ్య వ్యయం 1.43 శాతానికే పరిమితమవడంపై కమిటీ ప్రశ్నలు లేవనెత్తింది. ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్సలు, పరీక్షలు, సాధారణ వైద్య ప్రక్రియలకు ధరలను ప్రామాణీకరించి పరిమితులు విధించాలని సూచించింది. ఆస్పత్రుల్లో చికిత్స ధరలను ముందుగానే స్పష్టంగా ప్రకటించాలనీ, అధిక బిల్లులపై ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది.






కామెంట్లు (0)