ఇండియా బ్లాక్ ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ మహార్యాలీ సక్సెస్
రాంలీలా మైదానంలో పోటెత్తిన జనం..భారీగా తరలొచ్చిన విద్యార్థులు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు
బీజేపీ, మోడీ నిరంకుశ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామంటూ నినాదాలు
ఢిల్లీ జనసంద్రమైంది. కేంద్రంలోని మోడీ సర్కార్, కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కి వ్యతిరేకంగా దేశ ప్రజలు గుమికూడారు. వారిద్దరిపై తీవ్ర నిరసనలు వ్యక్తంచేశారు. ఇండియా బ్లాక్ నేతృత్వంలో ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక రాంలీలా మైదానంలో ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ (ఓటును కాపాడండి.. దేశాన్ని రక్షించండి) పేరుతో నిర్వహించిన మహార్యాలీ విజయవంతమైంది. ఈ ర్యాలీకి లక్షలాది మంది తరలివచ్చారు. ఎన్నికల వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేసే వరకు రాజీలేని పోరాటం కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు.
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఆదివారం తెల్లవారుజాము నుంచే దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిమంది ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి రాంలీలా మైదానం, పరిసర ప్రాంతాలు జనసందోహంతో నిండిపోయాయి. హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్, అజయ్ భవన్ నుంచి భారీ ప్రదర్శనలు బయలుదేరాయి. రాజ్యాంగ క్లబ్లో సమావేశమైన ఇండియా బ్లాక్‌కి చెందిన 200 మందికిపైగా ఎంపీలు పలు బస్సుల్లో ర్యాలీ ప్రాంగణానికి చేరుకున్నారు. మరోవైపు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నివాసమైన రాజాజీ నగర్ నుంచి ఇండియా బ్లాక్ నేతలు బహిరంగ వాహనాల్లో బయలుదేరి మింటో రోడ్డు మీదుగా రాంలీలా మైదానానికి చేరుకున్నారు. మొదటి వాహనంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎమ్ఏ బేబీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, ఫరూక్ అబ్దుల్లా, ప్రియాంక గాంధీ, మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్ తదితరులు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వాహనాల వెంట వేలాది మంది పాదయాత్రగా తరలిరావడం తో నాలుగు కిలోమీటర్ల మింటో రోడ్డు నుంచి రాంలీలా మైదానానికి చేరుకోవడానికి రెండున్నర గంటలకుపైగా సమయం పట్టింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ సుమారు మూడున్నర గంటలు ఆలస్యమైనప్పటికీ ప్రజలు ఓపికగా నాయకుల కోసం ఎదురుచూశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారుల సాంస్కృ తిక ప్రదర్శనలు ప్రజల్లో
ఉత్సాహాన్ని నింపాయి.
నినాదాలతో హోరెత్తిన హస్తిన
నాయకులు సభా వేదికపైకి చేరుకోగానే వివిధ రంగుల జెండాలు, నినాదాలతో మైదానం హోరెత్తింది. ‘ఓట్ల దొంగలు సింహాసనాలు దిగాలి’, ‘వారంతా బీజేపీ కార్యాలయంలో కనిపిస్తున్నారు’ అంటూ నిరసనకారులు పెద్దఎత్తున నినదించారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, యువత, కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో రాంలీలా మైదానం ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదాలతో మార్మోగింది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారూ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీల ఐక్యత కేంద్రంలోని నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసింది. జాతీయ జెండాలతో పాటు వామపక్ష పార్టీల ఎర్రజెండాలు, త్రివర్ణ పతాకాలు, తెలుపు, ఆకుపచ్చ, నీలం రంగుల జెండాలు మైదానాన్ని రంగులమయం చేశాయి. భగత్‌సింగ్ నుంచి చేగువేరా వరకు పలువురు విప్లవ వీరుల చిత్రాలు ప్రదర్శించారు. ర్యాలీ ముగిసే వరకు ప్రజల రాక కొనసాగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు నిరసనలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ తమ భాషల్లో నినాదాలు చేశారు. భిన్న భాషలు, సంస్కృతులు, ప్రాంతాలకు చెందిన ప్రజలంతా ఒకే వేదికపై ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గొంతెత్తారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ అసలైన ఆత్మ అని చారిత్రక రాంలీలా మైదానం మరోసారి చాటిచెప్పింది.ఈ మహార్యాలీలో మల్లికార్జున ఖర్గే, ఎంఎ బేబీ, దీపాంకర్ భట్టాచార్య, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, రాహుల్ గాంధీ, అంజలి భరద్వాజ్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, విజూ కృష్ణన్, నేహా బోరా తదితరులు ప్రసంగించారు. సోనియా గాంధీ, బృందాకరత్, ప్రియాంక గాంధీ, అరుంధతీ రాయ్, ఐషి ఘోష్, ప్రకాశ్ రాజ్, కపిల్ సిబల్, ఎంపిలు కె.రాధాకృష్ణన్, అమ్రారాం, జాన్ బ్రిట్టాస్, ఎఎ రహీం, వి.శివదాసన్, ఆర్.సచ్చిదానందం తదితరులు పాల్గొన్నారు. కేరళ ప్రతిపక్ష నేత పినరయి విజయన్ తరపున హాజరైన నాయకులతో పాటు, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్, వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు ర్యాలీలో పాల్గొన్నారు.
సీఈసీపై నిప్పులు చెరిగిన నేతలు
ఓటు హక్కు పరిరక్షణ కోసం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన ఇండియా బ్లాక్ మహార్యాలీలో వివిధ పార్టీల నేతలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, దానికి వంతపాడుతున్న సీఈసీపై నిప్పులు చెరిగారు. ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో ప్రజల ఓటు హక్కును హరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులు కాపాడుకునేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
జ్ఞానేశ్ కుమార్ తప్పుకోవాల్సిందే : రాహుల్‌గాంధీ
ఓటర్ల జాబితాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అక్రమాలకు పాల్పడి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్నికల విజయాలను కైవసం చేసుకుంటున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ అక్రమాలకు బాధ్యులైనవారు తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. జ్ఞానేశ్ కుమార్ కచ్చితంగా పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఆయన్ని తొలగించడం దేశాన్ని సరైన దారిలోకి తీసుకెళ్లేందుకు తొలి అడుగు అవుతుందన్నారు. మోడీ, అమిత్‌షాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఓట్ల చోరీ ద్వారా బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ప్రజల గొంతును నొక్కేస్తున్నాయనీ, ప్రతి పౌరుడి భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నాయని విమర్శించారు. రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదనే విషయాన్ని ప్రధాని, కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని హితవు పలికారు.
బీజేపీ ఓటమి యూపీ నుంచే ప్రారంభం : అఖిలేష్ యాదవ్
రాంలీలా మైదానంలో మహార్యాలీకి ముందు... ఉత్తరప్రదేశ్‌లో కోటిమందికి పైగా హిందువుల ఓట్లు తొలగించారంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన ప్రకటన రాబోయే ఓటమికి ముందస్తు సాకు వెతుక్కోవడమేనని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో తన ప్రభుత్వం ఓడిపోతే అందుకు కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను బాధ్యులను చేయాలనేదే యోగి రాజకీయ ఎత్తుగడ అని చెప్పారు.
జ్ఞానేశ్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : తేజస్వి యాదవ్
మహాభారతంలో శకుని కపట పాచికలతో అధికారం చేజిక్కించుకున్నట్టే మోడీ ప్రభుత్వం పదేపదే అధికారంలోకి వస్తోందని ఆర్జెడి నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. నాటి శకుని స్థానంలో నేడు జ్ఞానేశ్ కుమార్, దుర్యోధనుడి స్థానంలో మోడీ ఉన్నారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేశారని ఆరోపిస్తూ జ్ఞానేశ్ కుమార్‌పై క్రిమినల్ చర్యలు తీసుకుని జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంతోనే ప్రతీకారం : మమత
పశ్చిమ బెంగాల్ ఎస్ఐఆర్ బాధిత రాష్ట్రమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఎస్ఐఆర్ పేరుతో 90 లక్షల ఓట్లను తొలగించి బీజేపీని అధికారంలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ అన్యాయాన్ని తాము వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే తాము ప్రతీకారం తీర్చుకుంటామన్నారు.
పోరాడి విజయం సాధిస్తాం : దీపాంకర్ భట్టాచార్య
రాంలీలా మైదానంలో ఒక చరిత్రకు శ్రీకారం చుట్టామని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య అన్నారు. ఈ పోరాటంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలోనూ దేశ ప్రజల పోరాటాలకు రాంలీలా మైదానం దిశానిర్దేశం చేసిందని గుర్తుచేశారు. ఇక్కడి నుంచి వినిపించిన ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరాలని ఆకాంక్షించారు.
తొలగించిన హిందువులంతా పాకిస్థానీయులా? : ఫరూక్ అబ్దుల్లా
ఎస్ఐఆర్లో ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన హిందువులు కూడా చొరబాటుదారులేనా? అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారందరినీ చొరబాటుదారులుగా చిత్రీకరిస్తే, ఉత్తరప్రదేశ్‌లో ఓట్లు కోల్పోయిన హిందువులంతా పాకిస్థానీయులా? అని నిలదీశారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని వారు పాకిస్థానీయులంటూ ఆర్ఎస్ఎస్, బీజేపీ తరచూ ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ఈ దేశం కోసం తాము రక్తం ధారపోశామని గుర్తుచేశారు.
మోడీని గద్దె దించితేనే ప్రజాస్వామ్య పరిరక్షణ : ఖర్గే
దేశంలో ప్రజాస్వామ్యం కొనసాగాలంటే ప్రధాని నరేంద్ర మోడీని అధికారం నుంచి తొలగించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ ప్రభుత్వాలు ఓట్ల చోరీ ద్వారా అధికారంలోకి వచ్చాయని ఆరోపించారు. ఈ ఓట్ల దొంగలను అధికారానికి దూరం చేయాలని అన్నారు. మోడీ, అమిత్ షాలు దళితులు, యువత, మహిళల ఓట్లను దొంగిలిస్తున్నారని విమర్శించారు. జ్ఞానేష్ కుమార్ పదవి నుంచి వైదొలిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తే భయపడేది లేదని అన్నారు.
మరో స్వాతంత్ర్య పోరాటం : ఎంఎ బేబీ
ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు పాలనను అంతం చేసేందుకు దేశంలో రెండో స్వాతంత్య్ర పోరాటం ప్రారంభమైందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ అన్నారు. ఓట్ల చోరీకి పాల్పడిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందేననీ, ఆయనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇండియా బ్లాక్ఆధ్వర్యంలో నిర్వహించిన మహార్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాంలీలా మైదానానికి గొప్ప రాజకీయ చరిత్ర ఉందని గుర్తు చేశారు. స్వాతంత్య్ర పోరాట కాలంలో మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్, సర్దార్ పటేల్ వంటి నేతలు అనేక సభల్లో ప్రసంగించిన ప్రాంగణమిదని చెప్పారు. భగత్‌సింగ్ స్ఫూర్తితో యువత పోరాటాలకు సిద్ధమైన విప్లవభూమి అని అభివర్ణించారు. ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతూ మోడీ వరుసగా అధికారంలోకి వస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే మహిళల తాళిబొట్లు కూడా తెంచుకుపోతాయని ప్రచారం చేశారని గుర్తుచేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి, ఆ లక్ష్యాన్ని సాధించలేకపోయారని విమర్శించారు.






కామెంట్లు (0)