‘సర్’తో ఓటర్లలో ఆందోళన
ఫామ్-6 నుంచి ఈసీఐనెట్ వరకు అనేక ప్రశ్నలు
ఓటర్ల జాబితా మార్పుల్లో పారదర్శకత ఎక్కడ?
ఇద్దరు కమిషనర్ల అభ్యంతరాలపై సమాధానాలు లేని వైనం
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య దేశంలో పౌరుడి ఓటు హక్కు అత్యంత కీలకం. కానీ ఓటర్ల జాబితా సవరణ పేరుతో చేపట్టిన సర్ ప్రక్రియలో నిబంధనలు, సాంకేతిక వ్యవస్థ, అధికారుల నిర్ణయాలపై వరుస ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘంలోనే ఇద్దరు కమిషనర్లు కొన్ని నిర్ణయాలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు వచ్చిన వార్తా కథనాలు వ్యవహారాన్ని మరింత తీవ్రంగా మార్చాయి. దీంతో ఓటు హక్కుపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఓటర్ల జాబితాలో అనర్హుల పేర్లను తొలగించడం అవసరమే. కానీ ఆ ప్రక్రియలో అర్హులైన పౌరుల పేర్లు తొలగిపోకుండా చూడటం అంతకంటే ముఖ్యమైన బాధ్యత. అయితే సర్ పేరుతో పౌరుల నుంచి అదనపు పత్రాలు కోరడం, ఫామ్-6లో మార్పులు చేయడం, ఈసీఐనెట్ ద్వారా క్షేత్రస్థాయి అధికారుల అధికారాలను పరిమితం చేయడం వంటి అంశాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు కొన్ని నిర్ణయాలు, ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 2023 చట్టం ప్రకారం కమిషన్ నిర్ణయాలు ఏకాభిప్రాయంతో లేదా మెజారిటీతో తీసుకోవాలి. అలాంటప్పుడు ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసిన నిర్ణయాలు అమల్లోకి ఎలా వచ్చాయి? వాటిని కమిషన్ మెజారిటీ అభిప్రాయంగా ఎందుకు పరిగణించలేదు... వాటిపై నిర్ణయాలు రికార్డు చేశారా? అనే ప్రశ్నలకు స్పష్టత లేదు.
ఫామ్-6లో మార్పులెందుకు?
కొత్తగా ఓటర్ల నమోదు కోసం
ఫామ్-6 సమర్పిస్తారు. ‘సర్’ సమయంలో ఈ ఫామ్‌కు అదనపు ప్రకటనను జతచేయడంపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు నివేదికలు పేర్కొన్నాయి. దీనిని వారు ‘చట్టవిరుద్ధం, అనధికారికం’గా పేర్కొన్నట్టు వివరించాయి. సర్ పూర్తయిన రాష్ట్రాల్లో ఆ అదనపు ప్రకటనను ఆన్లైన్ ఫామ్-6 నుంచి తొలగించినట్టు తాజా నివేదికలు వెల్లడించాయి. అయితే సర్ కొనసాగుతున్న ప్రాంతాల్లో అది కనిపిస్తోంది. దీంతో 'ఓటరుగా నమోదు కావడానికి చట్టం అనుమతించిన సమాచారమే అడుగుతున్నారా? లేక అదనపు అడ్డంకులు సృష్టిస్తున్నారా?' అనే ప్రశ్న సామాన్య ఓటరు నుంచి వస్తోంది.
ఈసీఐనెట్పై కూడా ప్రశ్నలే
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయత పెంచేందుకు ఈసీఐనెట్‌ను తీసుకొచ్చారు. కానీ చట్టప్రకారం ఓటర్ల జాబితాను తయారు చేయడం, సవరించడం వంటి బాధ్యతలు ఉన్న అధికారులకే ఈ వ్యవస్థలో కొన్ని సందర్భాల్లో పూర్తి యాక్సెస్ లేకపోవడం ప్రశ్నలకు దారితీసింది. గోవాలో ఒక ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్ఓ) యాక్సెస్ కోసం వరుసగా ఈ-మెయిళ్లు పంపినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. పశ్చిమ బెంగాల్లో కూడా కొంతమంది బీఎల్ఓలు, ఈఆర్ఓలు తమకు తెలియకుండానే తమ పేర్లతో నోటీసులు జారీ అయ్యాయని ఫిర్యాదు చేసినట్టు కథనాలు వెలువడ్డాయి.
ఐటీ వ్యవస్థపై పర్యవేక్షణ ఎక్కడ?
ఈసీఐలోని ఐటీ విభాగం పనితీరుపైనా ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. వ్యవస్థ చట్టానికి అనుగుణంగా పనిచేయాలనీ, స్వతంత్ర ఆడిట్, అంతర్గత పర్యవేక్షణ ఉండాలని వారి నుంచి సూచనలు వచ్చినట్టు తెలిసింది. తర్వాత ఈసీ మాత్రం పర్యవేక్షణను తొలగించే ఆదేశం అమలు కాలేదని స్పష్టం చేసింది. కొత్త ఐటీ కార్యక్రమాలను కమిటీ పరిశీలించిన తర్వాతే కమిషన్ ఆమోదిస్తుందని తెలిపింది. అయినప్పటికీ ఇలాంటి వివాదం ఎందుకు తలెత్తింది? భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా ఏ నియంత్రణలు ఉంటాయి? అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.
పశ్చిమ బెంగాల్లో లక్షల అప్పీళ్లు
సర్ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో ఓటర్ల పేర్లపై 38.31 లక్షల అప్పీళ్లు నమోదయ్యాయి. ఇందులో 22.21 లక్షలు తిరిగి ఓటర్లుగా చేర్చాలని కోరినవే. 16.10 లక్షలు మరికొందరి పేర్లను తొలగించాలని కోరిన అప్పీళ్లు. ఇక్కడ కూడా ఒక కీలకమైన ప్రశ్న ఎదురవుతోంది. ఒకరి ఓటు హక్కు కొనసాగాలని నిర్ణయించిన తర్వాత ఆ నిర్ణయాన్ని ఎవరు సవాలు చేశారు? ఏ ఆధారాలతో చేశారు? ఆ ప్రక్రియకు బాధ్యత ఎవరిది? అనేవి కీలకంగా మారింది.
ప్రజాస్వామ్యానికి జవాబుదారీతనం అవసరం
మోడీ ప్రభుత్వ కాలంలో ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల సంఘం పనితీరుపై రాజకీయ పార్టీలతో పాటు పౌర సమాజం నుంచి కూడా పలు సందర్భాల్లో ప్రశ్నలు వచ్చాయి. సర్ వివాదం ఆ చర్చను మరింత ముందుకు తెచ్చింది. ఓటర్ల జాబితాలో ఎవరి పేరు ఉండాలి? ఎవరి పేరు తొలగించాలి? ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఏ సాంకేతిక వ్యవస్థ ద్వారా తీసుకున్నారు? తప్పు జరిగితే బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు రావాల్సి ఉంది. ఎన్నికల సంఘం ప్రకటించిన సమీక్షలు, మార్పులు ఆచరణలో ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ఈసీఐనెట్ సమీక్ష నివేదికను ప్రజలకు వెల్లడిస్తారా? అర్హులైన ఓటర్లకు జరిగిన నష్టాన్ని ఎలా సరిచేస్తారు? క్షేత్రస్థాయి అధికారులకు చట్టం ఇచ్చిన అధికారాలు వాస్తవంగా అందుబాటులో ఉంటాయా? అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.






కామెంట్లు (0)