Magazines

ధరల మంటతో వృద్ధికి ముప్పు

1 గంట క్రితం

Surging prices
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 2 నిమిషాల చదవడం

5.5 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం

ప్రజల కొనుగోలు శక్తిపై ఒత్తిడి

ఇంధన ధరలు, ఎల్‌నినోతో మరింత ముప్పు :ఆర్బీఐ బులిటెన్‌ వెల్లడి


ముంబయి : దేశ ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణం ప్రధాన ముప్పుగా పరిణమిస్తోందని రిజర్వ్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ ) హెచ్చరించింది. ఆహార పదార్థాలు, ఇంధనంతోపాటు ఇతర వస్తువుల ధరలు భారీగా పెరుగుతుండటం ఆర్థిక వృద్ధికి సవాలుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 5.5 శాతానికి చేరగా, అక్టోబర్‌లోనూ ఆహార ధరల పెరుగుదల కొనసాగుతున్నట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయని వెల్లడించింది. ధరల ఒత్తిళ్లు మరిన్ని రంగాలకు విస్తరించే ప్రమాదం ఉందని అంచనా వేసింది. పశ్చిమాసియా ఘర్షణలతో చమురు ధరలు అధిక స్థాయిలో కొనసాగడం, ఎల్‌నినో పరిస్థితులు బలపడటం ద్రవ్యోల్బణాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశముందని హెచ్చరించింది. అంతర్జాతీయ ప్రతి కూల పరిస్థితులను భారత ఆర్థిక వ్యవస్థ తట్టుకుంటున్నప్పటికీ.. పెరుగుతున్న ధరలు భవిష్యత్తు వృద్ధికి కీలక సవాలుగా నిలుస్తాయని శుక్రవారం విడుదల చేసిన అక్టోబర్‌ బులెటిన్‌లోని ‘స్టేట్‌ ఆఫ్‌ ది ఎకానమీ’వ్యాసంలో ఆర్బీఐ పేర్కొంది.

వడ్డీ రేట్ల పోటు..!

సెప్టెంబర్‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 5.5 శాతానికి పెరిగింది. ఆహారం, ఇంధనం, ఇతర వస్తువుల ధరలు విస్తృతంగా పెరగడం ఇందుకు కారణమని ఆర్‌బిఐ పేర్కొంది. ఆహారం, ఇంధన ధరలను మినహాయించి లెక్కించే కోర్‌ ద్రవ్యోల్బణం 4.3 శాతానికి చేరగా, విలువైన లోహాలను కూడా మినహాయించిన సూచీ 3.2 శాతంగా నమోదైంది. అక్టోబర్‌ 19 వరకు అందుబాటులో ఉన్న గణాంకాలు ఆహార ధరలు మరింత ఎక్కువగా పెరుగుతున్నట్లు సూచిస్తున్నాయని తెలిపింది. ద్రవ్యోల్బణం కొన్ని వస్తువులకే పరిమితం కాకుండా ఇతర రంగాలకు విస్తరించే సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.5 శాతానికి చేర్చింది. పరపతి విధాన వైఖరిని తటస్థ స్థితి నుంచి నియంత్రిత కఠినతరం దిశగా మార్చింది. ద్రవ్యోల్బణం మరింత పెరిగితే వడ్డీ రేట్ల పెంపు కొనసాగించొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

వ్యవసాయోత్పత్తిపై ప్రభావం

పశ్చిమాసియాలో ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలు అంతర్జాతీయ ఇంధన ధరలను అధిక స్థాయిలో ఉంచుతున్నాయని ఆర్బీఐ పేర్కొంది. చమురు సరఫరాలో అంతరాయాలు రవాణా, ఉత్పత్తి వ్యయాలను పెంచి దేశీయ ధరలపై అదనపు ఒత్తిడి తెచ్చే ప్రమాదముంది. దీనికితోడు బలపడుతున్న ఎల్‌నినో పరిస్థితులు వ్యవసాయోత్పత్తిపై ప్రభావం చూపితే ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశముందని తెలిపింది. అంతర్జాతీయ వాణిజ్య విధానాల్లో అనిశ్చితి, ప్రభుత్వ బాండ్లపై రాబడులు పెరగడం, ఆర్థిక పరిస్థితులు కఠినతరం కావడంతో వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయని వివరించింది.

భౌగోళిక సవాళ్లు..

విదేశీ మారక నిల్వలు అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు కొంత రక్షణ కల్పిస్తున్నాయని ఆర్‌బిఐ పేర్కొంది. ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బి) స్వాప్‌ సదుపాయం ద్వారా 13,300 కోట్ల డాలర్ల నిధులు సమకూరినట్టు తెలిపింది. అక్టోబర్‌ 16 నాటికి విదేశీ మారక నిల్వలు 10.6 నెలల సరుకుల దిగుమతులకు సరిపడా ఉన్నాయని వెల్లడించింది. అయితే ఆర్థిక వృద్ధి అంచనాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ ధరల పెరుగుదల, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సవాళ్లుగా కొనసాగనున్నాయని ఆర్బీఐ బులెటిన్‌ స్పష్టం చేసింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్