ఈసీఐ సాఫ్ట్‌వేర్‌లో ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతున్న ఫామ్-7
‘సర్’ నోటీసులకు స్పందించని వారిపై అదే ఫామ్‌తో వేటు..క్షేత్రస్థాయిలో పరిశీలన చేయని వాటికీ ఫామ్-7 దాఖలు చేస్తున్న ఈఆర్ఓలు
2002-2026 జాబితాల్లో ఒక్క అక్షరం తప్పున్నా ఓట్ గాయబ్..ఫామ్-7 ఇవ్వాల్సింది బాధితులు, కుటుంబసభ్యులు
వారి పనికూడా సాఫ్ట్‌వేరే చేస్తున్న వైనం..ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్లో వివాదాస్పద విధానం
మీ ఓటు 2002లో ‘ LAXMI’ అని ఉండి, 2026 ఓటర్ల జాబితాలో ‘LAKSHMI’ అని ఉంటే ఆటోమేటిక్‌గా ఓట్‌ను తొలగించేస్తున్నారు. చిరునామా మారి, ఫోన్ నెంబర్ ఓటరు జాబితాకు అనుసంధానం కాకుండా, ‘సర్’ నోటీసు అందుకోలేకుంటే, మీ తరఫున కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ‘సాఫ్ట్వేర్’ అటోమేటిక్‌గా ఫామ్-7 సృష్టించుకొని, మీ ఓటును తొలగించేస్తుంది. మరికొన్ని చోట్ల ఎన్నికల రిటర్నింగ్ అధికారులే (ఈఆర్ఓ) గంపగుత్తగా ‘ఫామ్-7’ లు దాఖలు చేస్తున్నారు. వాస్తవానికి వీటిని కుటుంబసభ్యులు దాఖలు చేయాలి. కానీ వారి పేరుతో అధికారులే దాఖలు చేసి, ఓట్లు తొలగించేస్తుండటం వివాదంగా మారుతోంది. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్లో ఇదే తరహాలో వివాదాస్పద విధానం అమలు చేస్తున్నారు. దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
న్యూఢిల్లీ : ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో పేర్ల తొలగింపుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. ఓటర్ల పేర్లను తొలగించేందుకు ఉపయోగిస్తున్న ఫామ్-7లను ఆటోమేటిక్‌గా రూపొందించి, వాటిపై ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్ఓలు) డిజిటల్ సంతకాలు చేస్తున్నప్పటికీ.. ఈ విధానానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు లేదా ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్ఓపీ) జారీ చేయలేదని తెలిసింది. ఎన్నికల నిబంధనల్లోనే లేని విధానాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారులు అమలు చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనితో ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా ఫామ్-7లు?
ఓటర్ల జాబితాలో ఒకరి పేరును తొలగించాలని కోరేందుకు ఫామ్-7ను ఉపయోగిస్తారు. ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈఆర్ఓలు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు (ఏఈఆర్ఓలు) స్వయంగా ఈ ఫామ్‌లను రూపొందించి, డిజిటల్ సంతకాలు చేసి పేర్ల తొలగింపు ప్రక్రియను చేపడుతున్నట్టు వెల్లడైంది. సర్ విచారణల్లో పరిష్కారం కాని తార్కిక వ్యత్యాసాలు ఉన్నట్టు గుర్తించినవారిని, ఓటర్ల వివరాలను పాత జాబితాలతో అనుసంధానించలేకపోయిన సందర్భాల్లోనూ ఈ విధానం అనుసరిస్తున్నారు. అయితే, 2024 ఓటర్ల జాబితాల మార్గదర్శకాల్లో ఈఆర్ఓలు స్వయంగా ఫామ్-7 దాఖలు చేయడానికి ఎలాంటి నిబంధనా లేదు. ఓటర్ల జాబితాలో పేరు తొలగింపునకు అభ్యంతరం వ్యక్తం చేసే వ్యక్తి, అదే జాబితాలో తన పేరు కూడా ఉండి ఉండాలనే నిబంధన ఉంది. కానీ దాన్ని పట్టించుకోకుండా, ఎవరో ఒకరి పేరుతో పామ్-7లు దాఖలవుతున్నాయి. నిబంధనల ప్రకారం ఫామ్-7ను దాఖలు చేయాల్సింది సంబంధిత ఓటరే తప్ప, నిర్ణయం తీసుకునే అధికారి కాదు. అర్హత లేదని తేలిన పేరును తొలగించే అధికారం ఈఆర్ఓకు ఉన్నప్పటికీ, అందుకోసం నిబంధనల్లో పేర్కొన్న విధానాన్నే అనుసరించా ల్సి ఉంటుంది. కానీ అలా జరగట్లేదు.
సాఫ్ట్‌వేర్‌తో ఆటోమేటిక్‌గా..
ఎన్నికల సంఘానికి చెందిన ఈఆర్ఓనెట్ సాఫ్ట్వేర్ ద్వారా ఫామ్-7లు ఆటోమేటిక్‌గా రూపొందుతున్నాయని స్వయంగా ఎన్నికల అధికారులే చెప్తున్నారు. ‘సర్’ విచారణల సమయంలో ఓటర్ల పేర్లను తొలగించే ప్రక్రియ చేపట్టినప్పుడు ఈ ఫామ్‌లు ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతున్నాయి. అయితే ఈ విధానాన్ని అనుసరించేందుకు ఎన్నికల అధికారులకు ఈసీఐ ఎలాంటి లిఖితపూర్వక మార్గదర్శకాలు జారీ చేసిందనే అంశంపై స్పష్టత లేదు. దీనిపై అధికారికంగా అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వట్లేదు.
చిన్న తప్పులకే అనర్హుల ముద్ర
ఓటర్ల వివరాల్లో చిన్నపాటి తేడాలను కూడా ఈఆర్ఓనెట్ సాఫ్ట్వేర్ తార్కిక వ్యత్యాసాలుగా గుర్తిస్తోంది. పేర్లలో స్వల్ప తేడాలు, తోబుట్టువుల వయసుల మధ్య వ్యత్యాసాలు, తల్లిదండ్రులు-పిల్లల వయసుల మధ్య తేడాలు, ఆరుగురికి మించి పిల్లలు ఉన్న తల్లిదండ్రుల వివరాలు వంటి అంశాలను ఈ సాఫ్ట్వేర్ అనుమానాస్పదంగా గుర్తిస్తున్నట్టు గతంలో వెల్లడైంది. ఇలాంటి వ్యత్యాసాల ఆధారంగా ఓటర్ల పేర్ల తొలగింపునకు ఫామ్-7లు రూపొందించడం విమర్శలకు దారితీస్తోంది. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. చిన్నపాటి తప్పుల ఆధారంగా ఫామ్-7 దరఖాస్తులు ఆటోమేటిక్‌గా రూపొందుతున్నాయనీ, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈ విధానం ఎంపిక చేసుకున్నట్టుగా అమలవుతోందని ఆరోపించింది. దీనివల్ల తమ పార్టీకి మద్దతు ఇచ్చే ఓటర్లు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. ఉత్తరాఖండ్‌లో సర్ ప్రక్రియ సందర్భంగా దాఖలైన దాదాపు 1.73 లక్షల ఫామ్-7 దరఖాస్తుల్లో 95 వేలకుపైగా దరఖాస్తులను అనర్హమైనవిగా గుర్తించారు.
పది దరఖాస్తులకే పరిమితి
భారీ సంఖ్యలో ఫామ్-7 దరఖాస్తులు దాఖలవుతుండటంపై విమర్శలు రావడంతో ఈసీఐ అక్టోబర్ 9న ఒక వ్యక్తి కేవలం పది ఫామ్-7 లు మాత్రమే ఇవ్వాలని షరతు విధించింది. అయినా ఈ దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. వాటిని ఎవరు రూపొందిస్తున్నారు? వాటి వెనుక ఉన్న ప్రక్రియ ఏమిటి? అనే అంశాలపై పూర్తి వివరాలు వెల్లడించడంలో ఎన్నికల సంఘం విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






కామెంట్లు (0)