సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన చర్చలు
డిమాండ్లపై హామీ
ఏఐకేఎస్ వాహన లాంగ్ మార్చ్ తాత్కాలిక నిలిపివేత
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మహారాష్ట్రలో రైతులు, ఆదివాసీలు, కార్మికులు, మహిళలు, శ్రామిక ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏఐకేఎస్ చేపట్టిన వాహన లాంగ్ మార్చ్ తాత్కాలికంగా నిలిపివేశారు. పలు డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీలు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కిసాన్ సభ నేతలు ప్రకటించారు. అక్టోబరు 26న అహిల్యానగర్ జిల్లా అకోలే నుంచి ముంబాయికి ప్రారంభమైన ఈ మార్చ్‌ను థానే జిల్లా షహాపూర్ వద్ద బుధవారం నిలిపివేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన ముంబాయి లోని సహ్యాద్రి రాష్ట్ర అతిథి గృహంలో రెండు గంటలకు పైగా చర్చలు జరిగాయి. ఉప ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే, సునేత్రా పవార్‌తో పాటు మంత్రులు చంద్రశేఖర్ బవన్‌కులే, రాధాకృష్ణ విఖే పాటిల్, గిరీష్ మహాజన్, దత్తాత్రేయ భరణె, సంబంధిత శాఖల కార్యదర్శులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్ దావలే నాయకత్వంలో మాజీ ఎమ్మెల్యే జె.పి. గావిట్, ఎమ్మెల్యే వినోద్ నికోలే, ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి అజిత్ నవాలే తదితరులతో కూడిన ప్రతినిధి బృందం చర్చల్లో పాల్గొంది. ఆమోదించిన డిమాండ్ల అమలును సమీక్షించేందుకు నవంబరు 4న మంత్రులతో మరో సమావేశం నిర్వహించనున్నారు.
మహిళలు, కార్మికుల సమస్యల పరిష్కారానికి హామీ
లాడ్లీ బెహన్ పథకంలో కేవైసీ ప్రక్రియ అసంపూర్తిగా ఉండటంతో ప్రయోజనాలు కోల్పోయిన 92 లక్షల మంది మహిళలకు తిరిగి లబ్ధి చేకూర్చడం, కేవైసీ గడువును కొనసాగించడం వంటి అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేవైసీ పూర్తి చేసినప్పటికీ ఆర్థిక సాయం అందని మహిళలకు వెంటనే చెల్లింపులు పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు అదనంగా రూ.1,000 గౌరవ వేతనం చెల్లించే ఆమోదిత నిర్ణయాన్ని అమలు చేయడంతో పాటు మరింత పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నిర్మాణ కార్మికుల మెడిక్లెయిమ్ పథకాన్ని పునరుద్ధరించడం, ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఉపకార వేతన పథకాన్ని అమలు చేయడంపైనా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. పెసా మొబిలైజర్ ఉద్యోగుల గౌరవ వేతనాలను స్వయం సహాయక సంఘాల ద్వారా కాకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరగా, అందుకు వెంటనే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ గౌరవ వేతనాలను కూడా అత్యవసరంగా విడుదల చేయాలని నిర్ణయిం చారు. పార్ట్‌టైమ్ అటెండెంట్లు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామ ఉపాధి సేవకుల సమస్యలపైనా సానుకూల చర్చలు జరిగాయి. నిరుపేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అందించే పింఛన్లను పెంచడం, లాడ్లీ బెహన్ పథకం తరహాలో వారికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించే అంశాలను పరిశీలిస్తామని ప్రభుత్వం తెలిపింది.
సాగుదారులకు భూములపై హక్కులు కల్పించాలి
అటవీ భూములు, వరకస్ భూములు, గైరాన్ (మేత భూములు), దేవాలయ ట్రస్టుల భూములు, ఇండ్ల స్థలాలపై సాగు దారులకు హక్కులు కల్పించే అంశాలపై చర్చించారు. ఇందుకు అవసర మైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసేందుకు అంగీ కారం కుదిరింది. బాల్ హిర్డా అటవీ ఉత్ప త్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించేందుకు ఏఐకేఎస్ ప్రతినిధులతో కూడిన అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. భండార్దరా డ్యామ్ నుంచి ఆదివాసీ ప్రాంతాలకు నీరందించడం, పర్యావరణ సున్నిత మండలాన్ని రద్దు చేయాలన్న డిమాండ్లపైనా చర్చలు జరిగాయి.
హామీల అమలు కోసం పోరాటం కొనసాగిస్తాం
ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం నిర్వహిం చాలన్న ఏఐకేఎస్ డిమాండ్ నెరవేరడం, పలు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీలు ఇవ్వడంతో లాంగ్ మార్చ్‌ను తాత్కా లికంగా నిలిపివేసినట్టు ఏఐకేఎస్ నేతలు తెలిపారు. అయితే, ప్రభుత్వం ఇచ్చిన హామీలు క్షేత్రస్థాయిలో అమలయ్యే వరకు పోరాటం, తదుపరి కార్యాచరణ కొనసాగి స్తామని స్పష్టం చేశారు. పరిష్కారం కాని మిగిలిన డిమాండ్ల సాధనకు కూడా ఉద్యమిస్తామని ప్రకటించారు.
రైతుల సమస్యలపై సానుకూల హామీలు
కరువు ప్రభావిత రైతులకు జాతీయ విపత్తు ప్రతి స్పందన నిధి (ఎన్‌డిఆర్‌ఎఫ్) నిబంధనలకు మించి పరిహారం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నమో షేత్కారీ మహాసన్మాన్ నిధి పథకం కింద పెండింగ్‌లో ఉన్న రెండు విడతల మొత్తాన్ని త్వరగా విడుదల చేస్తామని తెలిపింది. పంట రుణాలను క్రమం తప్పకుండా తిరిగి చెల్లించే రైతులకు ఇచ్చే రూ.50 వేల ప్రోత్సాహక మొత్తాన్ని పెంచాలన్న డిమాండ్‌పై రుణమాఫీ ఉపసంఘంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుం టామని ప్రభుత్వం పేర్కొంది.






కామెంట్‌లు (0)