ఒక తల్లి తన కూతురిని పాఠశాలకు పంపించి, సాయంత్రం క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందని ఎదురుచూస్తుంది. ఒక చిన్నారి తన స్కూల్ బ్యాగ్ వేసుకుని నవ్వుతూ బడికి వెళుతుంది. ఆ పసిమనసుకు తెలియదు.. తన చుట్టూ ఉన్న ప్రపంచంలో కొందరి మనసులు ఎంత క్రూరంగా మారుతున్నాయో! ఒక అమ్మాయి పదో తరగతి చదువుతోంది. ఆమె వయసు పుస్తకాలతో స్నేహం చేయాల్సిన వయసు. పరీక్షల గురించి ఆలోచించాల్సిన వయసు. జీవితంలో ఏదో సాధించాలని కలలు కనాల్సిన వయసు. కానీ ఆమెను ఒక వ్యక్తి ప్రేమించమని వేధిస్తాడు. ఆమె నిరాకరిస్తుంది. ఆ నిరాకరణను గౌరవించాల్సిన వ్యక్తి, ఆమె ప్రాణాల మీదకు వస్తాడు. రంపంతో దాడి చేసేంత క్రూరత్వానికి దిగజారుతాడు.
ఒక్కసారి ఆలోచించండి! ఆ అమ్మాయి తల్లిదండ్రుల గుండెల్లో ఇప్పుడు ఎలాంటి అలజడి ఉంటుంది? తమ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లిదండ్రులకు ఎంతటి మానసిక క్షోభ? ప్రేమించలేదనే కారణంతో ఒక అమ్మాయి జీవితాన్ని ఛిద్రం చేసే హక్కు ఎవరిచ్చారు? ఇంకో వైపు.. ఎల్కేజీ చదువుతున్న ఒక పసిపాప! ఇంకా సరిగ్గా ప్రపంచాన్ని అర్థం చేసుకోని వయసు. బడి అంటే ఆటలు, పాటలు, బొమ్మలు, స్నేహాలు అనుకునే వయసు. అలాంటి చిన్నారిపై నాలుగో తరగతి చదువుతున్న మరో బాలుడు బెంచీలతో బాది దాడి చేశాడనే వార్త మనల్ని కలచివేస్తోంది. ఆ పసివాళ్లకు ఏం తెలుసు? హింస అంటే ఏమిటో, ద్వేషం అంటే ఏమిటో కూడా పూర్తిగా తెలియని వయసు కదా! అసలు ఆ బాలుడి మనసులోకి అంతటి హింసాత్మక ప్రవర్తన ఎలా వచ్చింది? అతడు చూసిన ప్రపంచం ఏమిటి? నేర్చుకున్నది ఏమిటి? అనుకరిస్తున్నది ఏమిటి? మనం అందిస్తున్న బాల్యం ఎటువైపు ప్రయాణిస్తోంది? ఇక్కడ రెండు ప్రాణాలు మాత్రమే గాయపడలేదు. తల్లిదండ్రుల నమ్మకం గాయపడింది. బాల్యం మీద సమాజానికి ఉన్న భరోసా గాయపడింది. మానవత్వం తలదించుకుంది.
సమగ్రంగా పరిశీలించాలి
ఒక అమ్మాయి ‘నాకు ఇష్టం లేదు’ అన్నపుడు ఆ మాటను గౌరవించలేని యువకుడు ఎందుకు తయారవుతున్నాడు? ఒక చిన్నారి బాధను చూసి ఆగాల్సిన మరో చిన్నారి చేతులు ఎందుకు హింసకు అలవాటుపడుతున్నాయి? ఇది కేవలం నేరాల గురించి చర్చించాల్సిన సందర్భం కాదు. ఇది మన కుటుంబ వ్యవస్థను, పిల్లల పెంపకాన్ని, విద్యావ్యవస్థను, సామాజిక వాతావరణాన్ని, డిజిటల్ ప్రపంచాన్ని, మనిషి మానసిక పరిణామాన్ని సమగ్రంగా పరిశీలించాల్సిన సందర్భం. ఒక నేరస్థుడిని శిక్షించడం ద్వారా ఒక నేరానికి ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. కానీ మరో నేరస్థుడు తయారుకాకుండా చూడగలిగినప్పుడే సమాజంలో మార్పు ప్రారంభమవుతుంది. ప్రేమించడం తప్పు కాదు. ఆమెను ఇష్టపడటం తప్పు కాదు. తన భావాలను వ్యక్తపరచడం కూడా తప్పు కాదు. కానీ అంగీకరించలేదని ఆమెను వేధించడం, వెంటపడటం, బెదిరించడం, దాడి చేయడం మాత్రం ప్రేమ కాదు. అది ఆధిపత్యం.
తిరస్కారాన్ని తట్టుకోలేని మనస్తత్వం
ప్రేమలో అంగీకారం ఉండాలి. పరస్పర గౌరవం ఉండాలి. ఎదుటివారి నిర్ణయాన్ని గౌరవించే సంస్కారం ఉండాలి. ఒక అమ్మాయి ‘నాకు నువ్వు ఇష్టం లేదు’ అని చెప్పినప్పుడు ఆ సమాధానాన్ని గౌరవించలేని వ్యక్తి ప్రేమ గురించి మాట్లాడటానికి కూడా అర్హుడు కాదు. ఇక్కడ మనం బాలురకు చిన్నప్పటి నుంచే ఒక విషయం నేర్పించాలి. అమ్మాయి ఒక వ్యక్తి. ఆమె ఎవరి ఆస్తి కాదు. ఆమె శరీరం, ఆమె జీవితం, ఆమె నిర్ణయాలు ఆమెవి. ఆమె అంగీకారం లేకుండా ఆమెపై ఎలాంటి హక్కూ ఎవరికీ లేదు. తాము కోరుకున్నది తప్పకుండా తమకు దక్కాలని, తమ మాటే నెగ్గాలని, తమ ఇష్టానికి ఎదుటివారు తలవంచాలని భావించడం. ఇది కేవలం ప్రేమ వ్యవహారాల్లోనే కనిపించదు. స్నేహాల్లో, కుటుంబ సంబంధాల్లో, ఉద్యోగాల్లో, సామాజిక వ్యవహారాల్లోనూ కనిపిస్తుంది. ఒక వ్యక్తి ‘కాదు’ అని చెప్పినప్పుడు ఆ సమాధానాన్ని గౌరవించడం కూడా ఒక గొప్ప మానవీయ నైపుణ్యం. ప్రేమించడం ఒక భావోద్వేగం. తిరస్కారాన్ని గౌరవించడం ఒక సంస్కారం. ఈ రెండింటి మధ్య తేడాను మన పిల్లలకు నేర్పించాలి.
భావోద్వేగాలకు విచక్షణ తోడవ్వాలి!
మనిషి ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి మెదడులోని కొన్ని ముఖ్యమైన వ్యవస్థలను పరిశీలిద్దాం! Amygdala మన భావోద్వేగ స్పందనల్లో, ముఖ్యంగా భయం, ముప్పును గుర్తించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. Prefrontal Cortex ఆలోచించడం, పరిణామాలను అంచనా వేయడం, నిర్ణయాలు తీసుకోవడం, ప్రవర్తనను నియంత్రించడం వంటి పనుల్లో సహకరిస్తుంది. మనకు కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కాసేపు ఆగడం, ఎదుటివారి హక్కులను గుర్తించడం, తన చర్య వల్ల కలిగే పరిణామాలను ఆలోచించడం వంటి నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలి. కోపం రావడం తప్పు కాదు. కోపంతో మరొకరిని గాయపరచడం తప్పు. నిరాశ కలగడం తప్పు కాదు. నిరాశతో ఎదుటివారి జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం తప్పు. అందుకే పిల్లల్లో Emotional Regulation, Empathy, Self-control, Frustration Tolerance వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి.
డిజిటల్ ప్రపంచం
నేడు పిల్లల బాల్యం కేవలం ఇంట్లోనూ, పాఠశాలల్లోనూ పెరగడం లేదు. వారి చేతుల్లోని మొబైల్ ఫోన్లలో కూడా పెరుగుతోంది. రీల్స్, షార్ట్ వీడియోలు, గేమ్స్, వెబ్ సిరీస్లు, సినిమాలు.. ఇలా అనేక రకాల దృశ్యాలు వారి ఆలోచనా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. ఒక సినిమా చూసినంత మాత్రాన ఒక వ్యక్తి హింసాత్మకంగా మారిపోతాడని చెప్పలేం. సినిమాలు, కళలు సమాజంలోని అనేక భావోద్వేగాలను, సంఘర్షణలను ప్రతిబింబిస్తాయి. హింసను చిత్రీకరించడం ఒక్కటే నేరాలకు కారణం కాదు. అయితే హింసాత్మక దృశ్యాలను పదేపదే చూడటం, వాటిని అనుకరించడం, హింసకు ప్రశంసలు లభిస్తున్నట్లు భావించడం కొందరిలో దూకుడు ప్రవర్తనకు దోహదపడే అవకాశం ఉంది.
మొదటి గురువులు
పిల్లలు హింసాత్మకంగా ప్రవర్తించినప్పుడు వారిని మాత్రమే నిందించడం ద్వారా సమస్య పరిష్కారం కాదు. వారి చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా పరిశీలించాలి. పిల్లలు తల్లిదండ్రుల మాటల కంటే వారి ప్రవర్తనను ఎక్కువగా గమనిస్తారు. తండ్రి ఇంట్లో తల్లిని అవమానిస్తుంటే, చిన్న చిన్న విషయాలకు ఇంట్లో గొడవలు జరుగుతుంటే, పిల్లలు హింసను ఒక సాధారణ ప్రవర్తనగా భావించే ప్రమాదం ఉంది. అమ్మాయిని గౌరవించాలని చెప్పే తండ్రి, తన ఇంట్లో భార్యను గౌరవించకపోతే ఆ బోధనకు అర్థం ఏముంటుంది? కొడుకు విషయంలో ప్రతి తప్పునూ సమర్థిస్తే ఆ కుటుంబంలో సమానత్వం ఎలా పెరుగుతుంది? తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రేమను నేర్పించాలి. అదే సమయంలో ప్రేమలో తిరస్కారాన్ని కూడా నేర్పించాలి. ‘నువ్వు ఎవరినైనా ఇష్టపడవచ్చు. కానీ వారు నిన్ను ఇష్టపడాలని బలవంతం చేయలేవు. నీకు కోపం రావచ్చు. కానీ ఆ కోపంతో మరొకరిని గాయపరిచే హక్కు నీకు లేదు’. ఈ చిన్న జీవిత సత్యాన్ని ప్రతి ఇంట్లో పిల్లలకు నేర్పించాలి.
మార్కుల ఫ్యాక్టరీలా ఉండకూడదు!
మన పాఠశాలల్లో విద్య అంటే పరీక్షలు, మార్కులు, ర్యాంకులు, పోటీలు అనే భావన బలపడిపోయింది. కానీ విద్య అంటే కేవలం పాఠ్యపుస్తకాల్లోని సమాచారాన్ని మెదడులో నింపడం కాదు. ఒక మనిషిని మంచి మనిషిగా తీర్చిదిద్దడం కూడా. పాఠశాలల్లో Emotional Intelligence అనే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. పిల్లలకు కోపం వచ్చినప్పుడు ఎలా స్పందించాలి? తోటి విద్యార్థి తనతో మాట్లాడకపోతే ఎలా స్వీకరించాలి? ఎవరైనా తనను అవమానిస్తే హింసకు వెళ్లకుండా ఎలా పరిష్కరించుకోవాలి? స్నేహం అంటే ఏమిటి? వ్యక్తిగత హద్దులు అంటే ఏమిటి? సమ్మతి (Consent) అంటే ఏమిటి? ఇలాంటి విషయాలను వయసుకు తగిన విధంగా బోధించాలి. ప్రతి పాఠశాలలో శిక్షణ పొందిన కౌన్సిలర్లు ఉండాలి. తరచూ దూకుడుగా ప్రవర్తించే పిల్లలను వెంటనే చెడ్డవారిగా ముద్ర వేయకుండా, వారి ప్రవర్తన వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవాలి.
చట్టం-శిక్షలు-న్యాయం
ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న వస్తుంది. ఇలాంటి నేరాలకు చట్టాలు సరిపోవా? శిక్షలు సరిపోవా? లేక చట్టాల అమలులోనే లోపం ఉందా? భారతదేశంలో మహిళలపై వేధింపులు, వెంటపడటం, దాడులు, హత్యాయత్నాలకు సంబంధించి ఇప్పటికే చట్టపరమైన నిబంధనలు ఉన్నాయి. భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Samhita) ప్రకారం సెక్షన్ 78లో Stalking అంటే వెంటాడటం, తిరస్కరించి నప్పటికీ పదేపదే సంప్రదించ డానికి ప్రయత్నించడం వంటి చర్యలను నేరంగా పరిగణించారు. సెక్షన్ 109లో Attempt to Murderకు సంబంధించిన శిక్షలున్నాయి. అలాగే శరీరానికి తీవ్ర నష్టం కలిగించే దాడులకు సంబంధించిన నిబంధనలు కూడా ఉన్నాయి. అయితే చట్టం ఉండటం ఒక్కటే సరిపోదు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించే పోలీసు వ్యవస్థ ఉండాలి. బాధితురాలి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి.
- రమాదేవి కులకర్ణి, 8985613123






కామెంట్లు (0)