ఉద్యోగం కేవలం లైఫ్ సెటిల్మెంట్కు కాదు. సమాజంలో మీకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ను తెచ్చిపెడుతుంది. అలాంటి వృత్తి జీవితాన్ని ఎంతలా ప్రేమిస్తే, కెరీర్‌లో అంతలా దూసుకుపోతాం. కానీ, కొంతమంది మాత్రం ఉద్యోగాన్ని ఒక జైలు శిక్షలా భావిస్తూ రోజులు వెళ్లదీస్తుంటారు. అయితే జాబ్‌లో అసంతృప్తిగా ఉంటూ ఇలా భారంగా బండి లాగితే కెరీర్ గ్రాఫ్ పడిపోతుంది. అంతేకాదు అప్పటివరకు గడించిన ఉద్యోగానుభవం పైనా రిమార్క్ పడే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ అసంతృప్తికి కారణమేంటో తెలుసుకొని వాటిని దూరం చేసుకోవడం మంచిది. ఇంతకీ, ఉద్యోగుల్లో అసంతృప్తికి దారి తీస్తున్న ఆ కారణాలేంటి? వాటి నుంచి బయటపడాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసుకుందాం.
కొంతమందికి ఎంత పనిచేస్తున్నా, దానికి తగ్గ ప్రతిఫలం దక్కదు. దాంతో వారి మనసులో ‘ఎంత చేసినా వృథానే’ అన్న భావన కలుగుతుంది. ఇది కూడా ఉద్యోగంపై ఇంట్రెస్ట్ తగ్గడానికి, కెరీర్ అసంతృప్తితో ముందుకు సాగడానికి కారణమవుతుంది.
ఉద్యోగులు తక్కువ సంఖ్యలో ఉన్న కంపెనీల్లో ఎక్కువ పని భారం పడుతుంటుంది. దానివల్ల కూడా ఒత్తిడి ఎదురవుతుంది. జాబ్‌లో అసంతృప్తికి ఇదీ ఓ కారణమే.
కొందరిలో ఏఐ వంటి కొత్త టెక్నాలజీల వల్ల తమ కొలువుకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందోనన్న భయం ఉంటుంది. నేటి రోజుల్లో ఉద్యోగ అసంతృప్తికి, ఒత్తిడికి కారణమవుతున్న వాటిల్లో ఇదీ ఒకటని చెప్పుకోవచ్చు.
కొంతమంది ఉద్యోగుల విషయంలో తమ పైఆఫీసర్స్ నుంచి సరైన మద్దతు, ఆశించిన ప్రోత్సాహం దక్కదు. ఇది కూడా ఉద్యోగంలో అసంతృప్తి ఫీల్ కలగడానికి కారణమవుతుందంటున్నారు.
జాబ్ చేసే మహిళలకు వర్క్-లైఫ్ బ్యాలన్స్ ముఖ్యం. ఈ రెండింటినీ బ్యాలన్స్ చేసుకున్నప్పుడే అటు పర్సనల్ లైఫ్, ఇటు కెరీర్‌నూ ఆస్వాదించగలరు. కానీ కొందరు పలు కారణాల వల్ల దీన్ని బ్యాలన్స్ చేసుకోలేకపోతున్నారు. అది వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో సంతృప్తి లేకుండా చేస్తుంది.
ఆఫీస్ వాతావరణమే కాదు, సహోద్యోగులతో మంచి సత్సంబంధాలు లేకపోవడం వల్ల కూడా కొంతమందికి ఉద్యోగంలో సంతృప్తి ఉండదు.
మరి ఏం చేయాలి?
రీజన్ ఏదైనా ఉద్యోగంలో అసంతృప్తి దరిచేరితే అది కెరీర్‌కే మంచిది కాదు. అందుకే ఈ అసంతృప్తిని వీలైనంత త్వరగా దూరం చేసుకోవడం మంచిది. ఈ క్రమంలో కొన్ని టిప్స్ పాటించడం మంచిది.
ఉద్యోగంలో అసంతృప్తి భావనను దూరం చేసుకోవాలంటే పని వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవడం ముఖ్యం. కనుక మీ మనసుకు ప్రశాంతతనిచ్చే మొక్కలు, వస్తువులను ఏర్పాటుచేసుకోవడం, పనికి తగినవిధంగా ప్లాన్ వేసుకోవడం, మిమ్మల్ని ప్రోత్సహించే కొలీగ్స్‌తో ఫ్రెండ్షిప్ చేయడం వంటివి చేయాలి.
జీవితంలో ఎలాంటి టార్గెట్స్ లేకుండా ముందుకు సాగడం వల్ల కూడా ఒక దశలో అసంతృప్తికి లోనయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఉత్సాహంగా పనిచేయాలంటే కెరీర్‌కి సంబంధించి నిర్దిష్ట లక్ష్యాలను ఏర్పరచుకోండి.
విశ్రాంతి లేకుండా వర్క్ చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దాంతో చేసే పని మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. అందుకే మధ్యమధ్యలో బ్రేక్ తీసుకోవడం, చిన్న చిన్న డెస్క్ వర్కవుట్లు చేయడం వల్ల తిరిగి పునరుత్తేజితం పొందచ్చు. అలాగే అప్పుడప్పుడూ వర్క్ నుంచి షార్ట్ బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో కలిసి వెకేషన్లకూ ప్లాన్ చేసుకోవచ్చు. తిరిగొచ్చాక పనిపై పూర్తి దృష్టి పెట్టగలరు.
ఉద్యోగ భద్రతకు సంబంధించిన భయాలు, అసంతృప్తుల్ని దూరం చేసుకోవాలంటే, మారుతోన్న సాంకేతికతలను బట్టి కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ఉత్తమమైన మార్గం. ఇది కొత్త అవకాశాల్ని కల్పించడంతో పాటు కెరీర్ అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది.
‘ఎంత వర్క్ చేసినా ఫలితం శూన్యం’ అనుకునే బదులు, మీ పనితీరు, కంపెనీ డెవలప్మెంట్లో మీరు పోషించిన రోల్ గురించి పైఅధికారులకు తెలియజేయాలి. అందుకు సంబంధించి మీరు రూపొందించిన రిపోర్ట్స్ వారికి చూపించాలి. వారు మీ కష్టాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటారు. తద్వారా మీ కెరీర్‌లో అసంతృప్తి దూరమవుతుంది.





కామెంట్‌లు (0)