Magazines

జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి

1 గంట క్రితం

Gyanesh Kumar must be removed.
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 2 నిమిషాల చదవడం

రేపు కలెక్టరేట్ల ముందు ధర్నాలు..8న లోక్‌‌భవన్‌ ముట్టడి

నవంబర్ ఒకటో తేదీన చలో ఢిల్లీ : తొమ్మిది కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్‌, టీజేఎస్‌, ఎస్‌‌పీ, ఆర్జేడీ నిర్ణయం


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ‌జ్ఞానేశ్‌‌కుమార్‌‌ను వెంటనే తొలగించాలని 9 వామపక్ష పార్టీల, కాంగ్రెస్‌, టీజేఎస్‌, ఎస్‌‌పీ, ఆర్జేడీ నేతలు డిమాండ్‌ ‌చేశారు. ఇదే అంశంపై మంగళవారం అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయనున్నట్టు తెలిపారు. 8న హైదరాబాద్‌‌లోని లోక్‌‌భవన్‌‌ను ముట్టడిస్తామనీ, నవంబర్‌ ఒకటో తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌‌లోని ఎమ్‌‌బీ భవన్‌‌లో ఆ పార్టీల నేతల సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ, కాంగ్రెస్‌ ‌నేత, ఎంపీ మల్లు రవి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహ, సీపీఐ(ఎంఎల్‌)‌మాస్‌‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్‌) ‌లిబరేషన్‌ ‌రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేశ్‌‌రాజా, ఎస్‌‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి సీహెచ్‌. మురహరి, ఆర్‌ఎస్‌‌పీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు, ఆర్‌‌జేడీ రాష్ట్ర అధ్యక్షులు శోభాయాదవ్‌, సీపీఐ(ఎంఎల్‌)‌న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.గోవర్ధన్‌, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శవర్గ సభ్యులు వనం సుధాకర్‌, టీజేఎస్‌ రాష్ట్ర నాయకులు సలీమ్‌‌పాషా, సమాజ్‌‌వాదీపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీరాములు మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ హక్కులను పరిరక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘంపై కలిసికట్టుగా పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించామని తెలిపారు.

ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల కమిషన్‌ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌(సర్‌) ప్రక్రియపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాల సవరణ పేరుతో ప్రజల ఓటు హక్కును హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సర్‌‌పేరుతో బీజేపీకి యాంటీ ఓటింగ్‌‌గా ఉన్న మైనార్టీ, దళిత, ఆదివాసీ గిరిజన ప్రజల ఓట్లను ఈసీ తొలగించే ప్రయత్నం చేయడాన్ని తప్పుబట్టారు. బయట దొరకని ఫారమ్‌ -7 ‌పత్రాలు బీజేపీ నేతల దగ్గర కట్టలుకట్టలు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. ఫారమ్‌-7 ‌ద్వారా ఓట్లను తొలగించే కుట్ర జరుగుతున్నదని విమర్శించారు. ఫారమ్‌ 7 ‌ద్వారా వచ్చిన అభ్యంతరాలపై నేరుగా ఓటర్‌‌ను విచారించిన తర్వాతనే ముందుడుగు వేయాలని డిమాండ్‌ ‌చేశారు. గతంలో ఎన్నికల జాబితాల్లో పేర్లు తొలగించడం ద్వారా ప్రజాస్వామ్య హక్కులకు నష్టం కలిగిందని చెప్పారు. తెలంతాణలో ఓటర్ల జాబితాలను పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో రూపొందించాలని డిమాండ్ చేశారు. సర్‌ ప్రక్రియను తక్షణమే ‌నిలిపేయాలనీ, ఇప్పటికే తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి జాబితాల్లో చేర్చాలని కోరారు. ఓటర్ల డేటాను కేంద్రీకృతం చేయడం, ఎన్నికల ప్రక్రియలో సాంకేతిక వ్యవస్థల వినియోగంపై కూడా పలు సందేహాలు వ్యక్తం చేశారు. మోడీ, అమిత్‌‌షా ఆడించినట్టు జ్ఞానేశ్‌‌కుమార్‌ ఆడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే మోడీ సర్కారు తన అధికార సుస్థిరం కోసం ఈడీ, సీబీఐ, ఈసీ లాంటి రాజ్యాంగ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ చాలా రాష్ర్టాల్లో గెలిచిన ఓట్లశాతం కంటే తొలగించిన ఓట్ల శాతం ఎక్కువగా ఉందని వివరించారు. మోషాలు ఓవైపు కార్పొరేట్లకు దేశ సంపదను చోరీ చేపడుతున్నారనీ, మరోవైపు ఓట్ల చోరీ చేస్తూ అధికారాల్లోకి వస్తున్నారని విమర్శించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్