సింగరేణిలో రూ.10 వేల కోట్ల కుంభకోణం రెండేండ్లలో రూ.6,317 కోట్ల నిధులు మాయం
కార్మికుల లాభాల వాటా ఇవ్వకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇండ్లను ముట్టడిస్తాం : సింగరేణి కార్మిక గర్జన సభలో కేటీఆర్
నవతెలంగాణ-గోదావరిఖని
సింగరేణి సంస్థను ప్రయివేటీకరించే కుట్రలను తిప్పికొడతామని, కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తే సహించబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి స్టేడియంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. సింగరేణిలో నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లు, సైట్ విజిట్ సర్టిఫికెట్లు, ఓపెన్‌కాస్ట్ గనుల టెండర్లు, బొగ్గు ఉత్పత్తి, యంత్రాల కొనుగోళ్లు తదితర అంశాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. సింగరేణిలో అవకతవకలపై సీబీఐ లేదా సిట్టింగ్ న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను పూర్తిగా చెల్లించాలని కోరారు.
నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల వ్యవహారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ప్రస్తావించారు. నైనీ బ్లాక్‌లో కుంభకోణాన్ని అడ్డుకున్నామని, తద్వారా ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లు మిగిలాయని మంత్రి చెబుతున్నారని అన్నారు. “ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లు మిగిలాయని చెబుతున్నప్పుడు, ఆ మొత్తాన్ని మింగాలనుకున్నది ఎవరు? అసలు నైనీ బ్లాక్ టెండర్లలో ఏం జరిగింది?” అని ప్రశ్నించారు. వాటాలు, బేరాలు కుదరకపోవడం వల్లే నైనీ బ్లాక్ టెండర్లు రద్దయ్యాయని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికెట్ల పేరుతో సుమారు రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, దీనికి సంబంధించిన ఆధారాలతో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశామని చెప్పారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాల్సిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాయడమేంటని కేటీఆర్ ప్రశ్నించారు.
సైట్ విజిట్ సర్టిఫికెట్లతో టెండర్లను నిలిపివేశారు
సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గడానికి టెండర్ల నిర్వహణలో జాప్యమే ప్రధాన కారణమని కేటీఆర్ ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ల పేరుతో టెండర్ల ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని, శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో ఏడుసార్లు టెండర్లను వాయిదా వేశారని అన్నారు.
ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన బావమరిది సృజన్‌రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. డీజిల్, జిలెటిన్ స్టిక్స్, సోలార్ ప్రాజెక్టులు, జైపూర్ విద్యుత్ కేంద్రం, ఓవర్‌బర్డెన్ పనులు తదితర అంశాల్లోనూ అక్రమాలు జరిగాయన్నారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని కేటీఆర్ ఆరోపించారు. ఉత్పత్తి తగ్గడానికి కార్మికుల నిర్లక్ష్యం కారణం కాదని, టెండర్లలో జాప్యం, నిర్వహణ లోపాలు, నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యమే కారణమని విమర్శించారు. సింగరేణి వ్యాప్తంగా సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని ఆరోపించారు.
విద్యుత్ ఉత్పత్తిని నిలిపేస్తున్నారా?
సింగరేణిలో బొగ్గు కొరత ఉందని చెబుతూ రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి సమస్యలకు ప్రభుత్వం కారణాలు చూపుతోందని కేటీఆర్ విమర్శించారు. కేటీపీఎస్, భూపాలపల్లి, యాదాద్రి తదితర థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు అందడం లేదని చెబుతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ కోతలు పెరిగాయని విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ప్రయోజనాలను కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు దెబ్బతీశాయని ఆరోపించారు. లోయర్ సీలేరు ప్రాజెక్టును మోడీ ప్రభుత్వం చంద్రబాబుకు అప్పగించిందన్నారు. తెలంగాణకు రావాల్సిన 500 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును కూడా ఆంధ్రప్రదేశ్‌కు తరలించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని కేటీఆర్ తెలిపారు.
లాభాల వాటాలో అన్యాయం
సింగరేణి లాభాల్లో కార్మికులకు అందే వాటాను కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 16 శాతం నుంచి 32 శాతానికి పెంచామని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ఏడాది 33 శాతం లాభాల వాటా ఇస్తామని ప్రకటించి, 16 శాతమే చెల్లించిందని ఆరోపించారు. రెండో ఏడాది 34 శాతం ఇస్తామని చెప్పి, 12 శాతానికే పరిమితం చేసిందని విమర్శించారు. కార్మికులకు అందాల్సిన బోనస్, లాభాల వాటాను నిలిపివేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. సింగరేణిని ప్రయిటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ట్రాన్స్‌కోలో 26 శాతం వాటాను ప్రయివేటుపరం చేసే కుట్ర జరుగుతోందని పేర్కొంటూ, ఇదే విధంగా భవిష్యత్‌లో సింగరేణిని కూడా ప్రయివేటీకరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఆర్టీసీ ఎన్నికల ఫలితమే సింగరేణిలోనూ పునరావృతం
ఆర్టీసీ కార్మిక ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీకి వ్యతిరేకంగా వచ్చిన ఫలితాలను కేటీఆర్ ప్రస్తావించారు. ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారని, సింగరేణి కార్మికులు కూడా తమ హక్కులు, సంక్షేమం, సంస్థ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.





కామెంట్లు (0)