ఆ రోజు ఉదయం నుంచి ఒక్క మెసేజ్ కూడా లేదు. మామూలుగా అయితే, నేను ఆఫీసుకు చేరేలోపే ఏదో ఒకటి వచ్చేది. ఒక్కోసారి ఒక పాట లింక్. మరోసారి ఏదైనా పుస్తకంలో నచ్చిన వాక్యం. ఇంకోసారి కారణం లేని ఒక చిన్న గొడవకు ఆరంభం. ఆ రోజు మాత్రం ఏమీ లేదు. న్యూస్ రూమ్‌లో పని హడావుడిగా సాగుతోంది. ఫోన్లు, వార్తలు, ఎడిటింగ్, పేజీల మీద చర్చలు.. నేను కూడా పనిలోనే ఉన్నాను. అయినా మధ్యమధ్యలో ఫోన్ వైపు చూపు వెళుతోంది. మధ్యాహ్నం దాటిపోయింది.
‘ఏమై ఉంటుంది?’ అన్న ఆలోచన మొదలైన వెంటనే, ‘ఏదో పని ఉండి ఉంటుంది’ అని నన్ను నేనే సమాధానపరుచుకున్నాను. కానీ ఆ సమాధానం నన్ను ఎక్కువసేపు నమ్మించలేకపోయింది. రాత్రి ఎనిమిది దాటుతుండగా మెసేజ్ వచ్చింది.
“కిందికి రా.”
అంతే.. వెళ్లేసరికి కారు పక్కన నిలబడి ఉంది. నన్ను చూసి చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో అలసట ఉంది. రోజంతా తనలో తాను ఏదో పోరాటం చేసి, చివరికి ఇక ఒంటరిగా ఉండలేక నా దగ్గరికి వచ్చిన మనిషిలా కనిపించింది.
“ఏమైంది?” అని అడిగాను.
“కారెక్కు. చెప్తాను.”
నేను పక్క సీట్లో కూర్చున్నాను. ఆమె కారు స్టార్ట్ చేసింది.
“ఎక్కడికి వెళ్తున్నాం?” అడిగాను.
“తెలియదు.”
“అయితే ఎటు వెళ్తున్నావు?”
“అది కూడా తెలియదు’’.
నేను నవ్వాను.
“నీకు దారి తెలియనప్పుడు మాత్రం నా దగ్గరికి వస్తావన్నమాట.”
ఆమె నవ్వలేదు. కిటికీలోంచి బయటకు చూస్తూ ఉండిపోయింది. కొద్దిసేపు నేను కూడా ఏమీ మాట్లాడలేదు. ఆమె చెప్పాలనుకున్నప్పుడు చెప్తుందని నాకు తెలుసు. కానీ ఈసారి ఆమె మౌనం వెనుక ఏదో బరువుందనిపించింది. కారు ట్యాంక్‌బండ్ వైపు మళ్లించి, కొంతదూరం వెళ్లాక ఆమెనే మాట్లాడటం మొదలుపెట్టింది.
“ఈరోజు ఇంట్లో ఒక సంబంధం గురించి మాట్లాడారు.”
నేను ఆమె వైపు చూశాను. ఆమె మాత్రం రోడ్డుమీద నుంచి చూపు తిప్పలేదు.
“అబ్బాయి బాగున్నాడట. మంచి ఉద్యోగం. కుటుంబం కూడా బాగుందట. వాళ్లకు తెలిసిన వాళ్లే. అందరూ మాట్లాడుకున్నారు. ఎవరికీ అభ్యంతరం లేదు.”
“నువ్వేమన్నావు?”
“నన్ను ఎవరూ ఏమీ అడగలేదు.”
ఆ మాట చెప్పేటప్పుడు ఆమె గొంతులో కోపం కంటే బాధ ఎక్కువగా ఉంది.
“అడిగితే ఏం చెప్పేదానివి?” అన్నాను.
ఆమె ఒక్క క్షణం ఆగింది.
“ఒక నిర్ణయం తీసుకుంటే ఎవరో ఒకరిని బాధపెట్టాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది. నిర్ణయం తీసుకోకపోతే నన్ను నేనే బాధపెట్టుకుంటానేమోనని ఇంకా భయంగా ఉంది.”
“ఒక విషయం గురించి ఆలోచిస్తూ, దానికి సంబంధించిన మరో పది విషయాలను కూడా ఒకేసారి మోసేస్తావు.”
“మరి నువ్వేమో ఒక సమస్యను రెండు వాక్యాల్లో పరిష్కరించగలననుకుంటావు.”
“నేను ఎప్పుడన్నాను?”
“నీ ముఖం చెప్తుంది.”
ఈసారి నేను నవ్వాను. ఆమె కూడా కొంచెం నవ్వింది. కానీ ఆ నవ్వు ఎక్కువసేపు నిలవలేదు. కారు రోడ్డు పక్కన ఆపింది. ఇద్దరం కిందికి దిగి టీ తీసుకున్నాం. రాత్రి గాలి కొంచెం చల్లగా ఉంది. ఆమె కప్పు చేతుల్లో పట్టుకుని నిలబడింది.
“రామ్.. నీ దగ్గర ఒక విషయం చెప్పగలను.”
“చెప్పు”
“అందరి దగ్గరా వాళ్లకు నచ్చినట్టు ఉండాలి. నీ దగ్గర మాత్రం నేను నాలా ఉండగలను. నాకే అర్థం కాని నన్ను కూడా నువ్వు అర్థం చేసుకుంటావన్న నమ్మకం నాకుంది.”
నేను ఆమెను చూశాను.
“అందుకే నా దగ్గరికి వచ్చావా?”
“అవును.”
ఆమె అంత స్పష్టంగా చెప్పడం నాకు సంతోషాన్నిచ్చింది. కానీ నాలో ఓ ప్రశ్న మొదలైంది. ఆమె తన భయాలన్నీ నా దగ్గర పెట్టుకోగలుగుతోంది. తన జీవితంలోని అనిశ్చితిని నాతో పంచుకోగలుగుతోంది. మరి నేను? నా గురించి ఆమెకు ఎంత స్పష్టంగా చెప్పాను? ఆమె టీ తాగి కప్పును పక్కన పెట్టింది.
“రామ్.. మనిద్దరం ఇలా ఎన్నాళ్లు ఉంటాం?”
నేను వెంటనే సమాధానం చెప్పలేదు. ఆమె నా ముఖంలోకి చూసింది.
“ఈ ప్రశ్నకు కూడా నీ దగ్గర సమాధానం లేదా?”
“సమాధానం ఉంది. కానీ నువ్వు ఏమనుకుంటున్నావో తెలుసుకోవాలనిపిస్తోంది.”
“నేను ఏమనుకుంటున్నానో నీకు తెలియదా?”
“తెలుసనుకుంటున్నాను. కానీ అనుకోవడం వేరు. నువ్వు చెప్పడం వేరు.”
ఆమె కొద్దిసేపు మౌనంగా ఉంది.
“మన రీయూనియన్ గుర్తుందా, రామ్?”
ఆ ప్రశ్న వినగానే నేను ఆమె వైపు చూశాను. ఆ కలయిక తర్వాత మా మధ్య మారిన దూరాలు, దగ్గరైన మనసులు నాకు గుర్తొచ్చాయి. అప్పటికి మేమిద్దరం ఒకరినొకరం ప్రేమిస్తున్నామని తెలుసు. అయినా మళ్లీ ఒకరిని ఒకరు ఎంచుకోవడం చిన్న విషయం కాదు.
“గుర్తుంది” అన్నాను.
“అప్పుడు నేను నిన్ను ఎంచుకున్నాను. ఎవరో నన్ను నీ దగ్గరకు నెట్టలేదు. నువ్వు అడిగావని కాదు. నీతో ఉండాలని నాకు అనిపించింది కాబట్టి.”
ఆమె గొంతు స్థిరంగానే ఉంది.
“కానీ ఆ రోజు తీసుకున్న నిర్ణయం మన మధ్య ఉన్న భావనగానే మిగిలిపోకూడదనిపిస్తోంది. నా జీవితంలో కూడా దానికి ఒక చోటు ఉండాలి. మనం ఒకరినొకరు ప్రేమిస్తున్నామని తెలుసు. కానీ మన భవిష్యత్తు గురించి మాత్రం స్పష్టంగా మాట్లాడుకోలేదు.”
నేను తలవంచాను. ఆమె చెప్పింది నిజమే. ఆమె స్వేచ్ఛకు విలువివ్వాలని అనుకున్నాను. తన నిర్ణయాలు తానే తీసుకోవాలనుకున్నాను. ఆమె స్వభావాన్ని గౌరవించాలనుకున్నాను. పెళ్లి గురించి తొందరపెట్టి, మన బంధాన్ని మరో బాధ్యతగా మార్చకూడదనుకున్నాను. అందుకే నా కోరికను కూడా చాలాసార్లు నా లోపలే దాచుకున్నాను. ఆమె నా మౌనాన్ని గమనించింది.
“నువ్వు నన్ను తొందరపెట్టలేదు. అది నాకు తెలుసు. కానీ ఒక విషయం చెప్పనా?”
“చెప్పు.”
“నన్ను తొందరపెట్టకపోవడం వేరు రామ్. నీకు ఏం కావాలో చెప్పకుండా ఉండటం వేరు.”
ఆమె మాట నాలో ఎక్కడో గుచ్చుకుంది.
“నిజమే,” అన్నాను.
ఆమె నా వైపు చూసింది.
“నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు రామ్. నేను వెంటనే నిర్ణయం తీసుకోవాలని అడగడం లేదు. నువ్వు నాతో ఏ జీవితాన్ని కోరుకుంటున్నావో తెలుసుకోవాలనుకుంటున్నాను.”
నేను కొద్దిసేపు ఆమె చేతిని నా చేతిలోకి తీసుకున్నాను.
“నిన్ను ప్రేమిస్తున్నాను. అది నీకు తెలుసు. కానీ అక్కడితోనే ఆగిపోవాలని లేదు. నీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నాను. నీ పనులు, నీ కలలు, నీకు నచ్చిన ప్రపంచం.. వాటన్నింటికీ చోటుండే జీవితంలో నేను కూడా ఉండాలనుకుంటున్నాను.”
ఆమె నిశ్శబ్దంగా వింటోంది.
“నువ్వు నా కోసం ఏదీ వదులుకోవాలని నేను కోరుకోవడం లేదు. నా కోసం నీ ప్రపంచాన్ని చిన్నది చేసుకోవాలని కూడా లేదు. మనిద్దరం మన జీవితాలను మనమే నిర్మించుకుంటూ, ఒకరికొకరం తోడుగా ఉండాలి. నువ్వు అలసిపోయినప్పుడు నేనుండాలి. నేను అలసిపోయినప్పుడు నువ్వుండాలి. సమస్యలన్నీ పరిష్కరించగలనని కాదు.. వాటిని నీతో కలిసి ఎదుర్కోవాలనుకుంటున్నాను.”
నా గొంతు కొద్దిగా బరువెక్కింది.
“నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది.”
ఆమె కళ్లలోకి చూశాను.
“ఇది నా నిర్ణయం. నా కోరిక. నువ్వు కూడా అదే కోరుకుంటేనే మనం ఆ దిశగా వెళ్దాం. నీకు ఇష్టం లేకపోతే, మన బంధం గురించి నీకు వేరే ఆలోచన ఉంటే, అది కూడా నువ్వు స్వేచ్ఛగా చెప్పొచ్చు.”
ఆమె వెంటనే సమాధానం చెప్పలేదు. నా చేతిని మరింత గట్టిగా పట్టుకుంది. కాసేపటి తర్వాత తలెత్తి చూసింది.
“నేను కూడా అదే కోరుకుంటున్నాను, రామ్.”
ఆ మాటలో హడావుడి లేదు. ఎవరికో సమాధానం చెప్పాలనే తొందర లేదు. తన జీవితాన్ని తనే ఎంచుకుంటున్నాననే నిశ్చయం ఉంది.
“అయితే మనం పెళ్లి చేసుకుందాం” అన్నాను.
ఆమె నవ్వింది.
“ఇంత సింపుల్‌గా చెప్పేస్తావా?”
“మరెలా చెప్పాలి? ప్రెస్‌మీట్ పెట్టాలా?”
ఆమె నవ్వుతూ నాపైకి వంగి నూదిటిపై ముద్దుపెట్టింది. ఆ రాత్రి మేము ఇంకొంతసేపు కారులో తిరిగాం. పెళ్లి ఎప్పుడు, ఎలా, ఎవరితో మాట్లాడాలి అనే విషయాలు కూడా చర్చించుకున్నాం. అన్నీ అప్పుడే తేల్చేయలేదు. కానీ మొదటిసారి మా ఇద్దరి భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు, ఎదుటివారి మనసులో ఏముందో ఊహించుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇంటికి చేరుకున్నాక ఆమె నుంచి మెసేజ్ వచ్చింది.
“రామ్...”
“చెప్పు.”
“ఐ హేట్ యూ!”
నేను నవ్వుకున్నాను.
ఆ రోజు నుంచి “ఐ హేట్ యూ!” అన్న ప్రతిసారీ ఆ మాట వెనక దాగిన ప్రేమతోపాటు, మేమిద్దరం కలిసి ఎంచుకున్న భవిష్యత్తు కూడా నాకు గుర్తుకొస్తుంది.
- రామ్







కామెంట్లు (0)