Magazines

బి. నరసింగరావు తెలంగాణ తెర తొలి వెలుగురేఖ

3 గంటల క్రితం

బి. నరసింగరావు
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 9 నిమిషాల చదవడం

"నేను 50 సినిమాలు తీసి ఉండవచ్చు, కానీ నావి మామూలు సినిమాలు కావు. అవి ప్రేక్షకులను కట్టిపడేసే సామాజిక వాస్తవాలు" అనంటారు జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు బి. నరసింగరావు. ఆయన సినిమా చూశాక ప్రేక్షకులు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. వారు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, తమ ఆలోచనల్లో మునిగిపోతారు. అలా ప్రేక్షకులు ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు తన సినిమా గురించి ఆలోచించాలని ఆయన కోరుకుంటాడు. 'దాసి'ని చూసిన తర్వాత లింగ వివక్ష గురించి, రంగుల కలలో కళల గురించి, మా భూమిలో వర్గ పోరాటం గురించి, మట్టి మనుషులలో కూలీల గురించి, హరివిల్లులో మృత్యువు గురించి ఇలా!


బి. నర్సింగరావు గురించి మాట్లాడుకోవడం అంటే ఒక 60 ఏళ్ల తెలంగాణ సాంస్కృతిక జీవన పరిణామ వికాసాల గురించి మాట్లాడుకోవడమే. వర్తమానంలో ఆయన చాలామందికి సినిమా దర్శకుడిగానే తెలుసు. కానీ ఆయన కవి, కథారచయిత, గొప్ప చిత్రకారుడు కూడా. ఈ మూడింటి సమ్మేళనమే ఆయనలోని సినీ దర్శకుడు. ఆయన జీవితమంతా ప్రజాకళలు, ప్రజాకవులతో కలిసి మమేకమై జీవించిన కళాకారుడు.

తొలి దశలో ఆయన నటుడిగా మా భూమి, 'రంగుల కల' చిత్రాలలో నటుడిగా కనిపించాడు. కానీ ఆ తర్వాత స్క్రిప్ట్ రాయడం, దర్శకత్వం, నిర్మాణ రంగాలకే పరిమితమయ్యాడు. ఆయన చివరి చిత్రం 'హరివిల్లు' 2003లో వచ్చింది. కానీ ఆ తర్వాత కాలం వృథాగా గడవలేదు. నిరంతరం సాహితీ సృజన, కళాఖండాల చిత్రీకరణ, అరుదైన తెలంగాణ ప్రాచీన సాహిత్యపు లోతులను, చరిత్రను అన్వేషించడంలోనే ఎక్కువ కాలాన్ని గడిపాడు.

B. Narsing Rao"తెలంగాణ సినిమా'' మా భూమి

నాటకరంగ అనుభవమే నరసింగరావుకు సినిమాపై ఆసక్తి కలిగించింది. 70వ దశకం ప్రారంభంలో వీధి నాటకాలతో మొదలై విప్లవ రచయితలు, 'దిగంబర కవుల' స్ఫూర్తితో మొదట "ఆర్ట్ లవర్స్", 'జన నాట్య మండలి' సంస్థలను స్థాపించాడు. ఆ తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది. ఆ సమయంలో నర్సింగరావు అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఎమర్జెన్సీ తర్వాత తెలంగాణ ప్రజల జీవనంలో వచ్చినటువంటి మార్పును, సమాజంలో ఉన్న అంతర్మథనాన్ని ఆయన అర్థం చేసుకుని ఒక చలనచిత్రకారుడిగా పరిణామం చెందాడు. ఇది తెలంగాణకు ఎంత మేలు చేసిందంటే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న "తెలంగాణ సినిమా" అన్న మాటకు అక్కడే అంకురార్పణ జరిగింది. 1940లలో జరిగిన తెలంగాణ రైతాంగ పోరాటం నేపథ్యంలో గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో ఆయన 'మా భూమి' సినిమాను గనక నిర్మించక పోతే ఈరోజు సినిమా కూడా ప్రజాకళల్లో ఎట్లా అంతర్భాగం అవుతుందో మనకు తెలిసేది కాదు. మాభూమి నిర్మాతలలో రవీంద్రనాథ్ తో పాటు వీరు కూడా ఒకరుగా ఉన్నప్పటికీ 'మా భూమి' సినిమా రూపకల్పనలో కథతో మొదలుకొని సంభాషణలు, సంగీతం, చిత్రీకరణ, సెట్స్, కాస్ట్యూమ్స్ వంటి అంశాలను దగ్గరుండి చూసుకున్నాడు. ఈ చిత్రానికి ఆయన పనిచేయడం వలన చలనచిత్ర రూపకల్పనలో ఉన్న విధానాలని ఆకలింపు చేసుకోగలిగాడు. ఇదే ఆయన భావి సినీ జీవితానికి ఒక బలమైన పునాది.

'మా భూమి' 1980లో విడుదలైన తర్వాతనే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏడాదిన్నర కాలం నాటి తెలంగాణ జీవితాన్ని, తెలంగాణ ప్రజల పోరాట సమగ్ర స్వరూపాన్ని మనం తెలుసుకోగలిగాము. ఇంకా చెప్పాలంటే 'మా భూమి' సినిమా అన్నది తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు ఒక సెల్యులాయిడ్ రూపం. పాలనా వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నందున 'మా భూమి' చిత్రానికి ఆటంకాలు ఎదురైనా విజయం సాధించింది.

అట్లానే ఆ తర్వాత ఆయన వ్యక్తిగత జీవితంలోని అభిరుచిని, ఒక సామాజిక బాధ్యత గల చిత్రకారుడిలో ఉద్వేగాన్ని 'రంగుల కల'లో చూపిస్తాడు. 'రంగుల కల' నిజంగా ఒక థియేటర్ లో అంత పెద్ద స్క్రీన్ క్యాన్వాస్ పై సెకనుకు 24 ఫ్రేములలో కదిలిపోయే కొన్ని లక్షల చిత్రాలుగా చూపించగలిగిన గొప్ప సినిమా 'రంగుల కల'. ఆత్మకథాత్మక శైలిలో సాగే ఈ చిత్రం గుర్తింపు పొందలేకపోయిన ఒక ప్రతిభావంతుడైన చిత్రకారుడి జీవితం గురించి వివరిస్తుంది. ఉన్నత వర్గాల కళా దృక్పథాన్ని వ్యతిరేకించే ఆదర్శవాదంతో కూడిన చిత్రకారుడి పాత్రను తాను స్వయంగా పోషించాడు. 'రంగుల కల' గురించి బి.నరసింగరావు "సినిమా మాధ్యమం ద్వారా సౌందర్య విలువలను నొక్కిచెప్పడానికి చేసిన ఒక ప్రయోగం అది" అంటాడు. ఇంకా నర్సింగరావు సినిమాను "సంగీతం, చిత్రలేఖనం, ఇతర కళారూపాలను తనలో ఇముడ్చుకున్న అత్యున్నత కళారూపం"గా భావిస్తాడు. ఈ భావననే ఆయన కళా ఖండాలనదగిన సినిమాలు తీయడానికి కారణమైంది. 'రంగుల కల' 1983లో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది.

రంగుల కలలో, అంతకు ముందు 'మా భూమి'లో గద్దర్ చే పాడించిన "బండెనక బండి కట్టి" పాట ఆ తర్వాత ప్రజా కళాకారులకు ఒక 'అంథమ్' వంటిది. 'రంగుల కల'లో "మదనా సుందారి మదనా సుందారి", "భద్రం కొడుకో జర పైలం కొడుకో" పాటలు హైదరాబాద్ ప్రజల జీవన గమనాన్ని పట్టిచూపేవి. ఈ పాటలు కూడా గద్దర్‌‌కే కాదు, నర్సింగరావు సినిమాలకు కూడా అదనపు ఆకర్షణ అయినవి. నిజానికి గద్దర్ ను ఒక ప్రజా కళాకారుడిగా రూపొందించడంలో బి. నర్సింగరావు తెర వెనుక నిర్వహించిన భూమిక చాలా ఉంది.

B. Narsing Raoదాసి ఒక సెల్యులాయిడ్ మిరాకిల్

బి. నరసింగరావు తన చిత్రం 'దాసి' ఐదు జాతీయ అవార్డులను గెలుచుకోవడంతో కొత్త శిఖరాలను అధిరోహించాడు. 'దాసి' 1988లో ఉత్తమ తెలుగు చిత్రంగా, నాయిక పాత్ర పోషించిన అర్చన ఉత్తమ నటిగా, సినిమాటోగ్రాఫర్ ఎ.కె. బిర్, ఆర్ట్ డైరెక్టర్ టి. వైకుంఠం, కాస్ట్యూమ్ డిజైనర్ సుదర్శన్ తమ విభాగాలలో అవార్డులను అందుకున్నారు. బి.నరసింగరావు దాసికి జాతీయస్థాయిలో వచ్చిన గుర్తింపు తెలుగు చిత్ర పరిశ్రమను ఆశ్చర్యపరిచింది. అప్పటికి తెలుగు సినీ రంగం సాధారణంగా నాసిరకం చిత్రాలను నిర్మిస్తూ నవ్యతకు వ్యతిరేకంగా తనను తాను బలోపేతం చేసుకుంది. ఎన్.టి. రామారావు ప్రభావంతో లక్షలాది పౌరాణిక చిత్రాలకు నిలయమైన తెలుగు నేల పాత ఫార్ములాకు ఎంతగా అమ్ముడు పోయిందంటే కళాత్మక చిత్రాలకు తావు లేకుండా పోయింది.

94 నిమిషాల నిడివి గల ఈ చిత్రం నెమ్మదిగా సాగినప్పటికీ, దృశ్యపరంగా ఒక అద్భుతం. 1925 నాటి నిజాం పాలనలో 'గడీల'లో సాగే భూస్వామ్య జీవనశైలిని లోతుగా పరిశోధించి కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఐతే దాసి సినిమాలో సంభాషణలను కేవలం 20 నిమిషాలకే ఎందుకు పరిమితం చేశారనే విషయాన్ని ఇలా వివరిస్తాడు - "దృశ్యపరమైన అనుభూతిని మరింత గాఢం చేయడానికి వీలైనంత వరకు మాటలను తగ్గించా" నని.

'దాసి' చిత్రంలో తెలంగాణ ప్రాంతంలోని ఒక గడీ (జమీందారు నివాసం) యజమాని వద్ద పనిచేస్తూనే, అతని భోగదాసిగా కూడా మారాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్న ఒక పనిమనిషి వేదనను నరసింగరావు సున్నితంగా ఆవిష్కరించాడు. చిన్నతనంలో తన పేద తల్లిదండ్రులు కేవలం 20 రూపాయలకు గడీ యజమానికి తనను ఎలా అమ్మేశారో ఆ దాసి చెప్పే శక్తివంతమైన ప్రారంభ వాక్యాలు మిగిలిన సినిమాకు దిశానిర్దేశం చేస్తాయి. అది మాత్రమే కాదు ప్రేక్షకుడిని నిశ్శబ్దంగా తన వెంట చలనచిత్ర ప్రయాణంలోకి తీసుకువెళ్తాయి. ప్రేక్షకుడు దాసి సినిమాలో ఎంతగా అంతర్లీనం అవుతాడంటే చరిత్రలో జరిగిన సంఘటనలు దృశ్యరూపంగా వర్తమానంలో తన ముందే జరుగుతున్నంత తీవ్రస్థాయిలో అనుభూతి చెందుతాడు. ఆయన 1988లో కేవలం 13 రోజుల్లో 'దాసి' చిత్రీకరణను పూర్తి చేశాడు.

దాసి' సినిమాను ఢిల్లీలో జరిగిన ఒక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌‌లో ప్రదర్శించినప్పుడు చివరికి కమల గర్భ విచ్ఛిత్తి దృశ్యాలు ఆ గడీలో ఉన్నటువంటి ఒక గవాశి లోంచి ఒక అరణ్య రోదనగా శబ్దాలు బయటికి పోతున్నప్పుడు, దాసిగా నటించిన అర్చన కేకలు విన్న ఓ విదేశీ మహిళ ప్రతినిధి ఆ దృశ్యాన్ని చూడలేక కేవ్వున అరుస్తూ థియేటర్‌‌ను వదిలి వెళ్ళిపోతుంది. ఈ ఒక్క సందర్భం చాలు. ఆయన సినిమాలు వాస్తవికతకు ఎంత దగ్గరగా ఉంటాయనడానికి. నరసింగరావుకు అంతర్జాతీయంగా ఒక పాస్పోర్ట్ గా చెప్పుకునే సినిమా 'దాసి'. మాస్కో ఫిలిం ఫెస్టివల్ గాని, ఇతర దేశ దేశాల్లో 'దాసి' సినిమాకు బ్రహ్మరథం పట్టాయి.

నర్సింగరావు తీసిన మరో సినిమా 'మట్టి మనుషులు'. ఈ 'మట్టి మనుషులు' సినిమాలో నర్సింగరావు వలస కూలీల వ్యధాభరితమైనటువంటి జీవనాన్ని దృశ్యీకరించాడు. ప్రధానంగా వలసలు పోయే పాలమూరు జిల్లా పేదలు హైదరాబాద్ అడ్డా కూలీలుగా మారి ఎంత దుర్భరమైన జీవిస్తారో, ఎన్ని రకాల శోషణలకు గురువుతారో చూపిస్తాడు.

ఇంద్రధనస్సుపై శైశవ గీతం

బి. నర్సింగరావు తీసిన మరో ఫీచర్ ఫిలిం 'హరివిల్లు'. ఒకరకంగా బాలల మానసిక విశ్లేషణకు అద్దం పట్టిన సినిమా ఇది. ఒక సాధారణ బాలిక, మరణానికి చేరువవుతున్నఉన్నత వర్గానికి చెందిన బాలుడు మధ్య ఉన్నటువంటి ఒక బాండింగ్‌‌ని ఆయన చూపిన విధానం మనకు చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. నర్సింగరావు 'హరివిల్లు' తీసినా, 'దాసి' తీసినా, లేకపోతే 'మట్టి మనుషులు' తీసినా, 'రంగుల కల' తీసినా, డాక్యుమెంటరీలు తీసినా వాటి.ల్లో ఆయన విభిన్నమైన ఆలోచనల ముద్ర ప్రస్ఫుటంగా కనిపిస్తది. అదే బి.నర్సింగరావు సినిమాల్లోని ప్రత్యేకత.

హైదరాబాదు నగర జీవితంపై బి నర్సింగరావు తీసిన 'ది సిటీ' డాక్యుమెంటరీ శతాబ్దాల నగర చరిత్రను దృశ్యమానం చేస్తుంది. అలాగే తెలంగాణ గ్రామీణ జీవన సంస్కృతిని చిత్రీకరించిన 'మా ఊరు' డాక్యుమెంటరీలలో ఒక కళాఖండంగా నిలిచిపోయింది. ఈ డాక్యుమెంటరీలో నర్సింగరావు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవన శైలిని అత్యంత సహజంగా చిత్రించాడు.

ఈ రెండు కాకుండా మరోవైపు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ప్రకృతిని, సహజమైన రాక్ వరల్డ్‌‌ని 'ఆకృతి' పేరుతో తీసిన మరొక డాక్యుమెంటరీ ఆయన విభిన్న ఆలోచనా దృక్పథానికి దర్పణం పడుతుంది.

కవిత్వం, కథా రచన, నాటక రచన, నాటక ప్రదర్శన, దర్శకత్వం, తర్వాత సినిమా రంగంలో నిర్మాణత, స్క్రీన్ ప్లే, నటన, దర్శకత్వం, సంగీతం ఇలా ఒకదాంట్లోంచి మరొకదాంట్లోకి ఒక నిశ్శబ్ద నదిల ప్రవహిస్తూ పోవడం నర్సింగరావు కళాజీవనంలోని ప్రత్యేకత. ఇలా నాటకరంగం నుండి సినిమా రంగానికి నరసింగరావు మారడం సాధారణ విషయమే అయినప్పటికీ తెలుగు నాట 'సీరియస్ సినిమా' ప్రక్రియకు అంకితభావం కలిగిన ఏకైక ప్రతినిధిగా ఆయన నిలవడం మాత్రం విశేషం.

బి. నర్సింగరావు రాశిలో తక్కువైన ఫీచర్ ఫిలింలే తీసి ఉండవచ్చు గాని, వాశిలో వాటి ఘనత అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందింది. ఆయన ఒక సినిమా తీసి ప్రజల పరం చేసి తిరిగి కవిగానో,రచయితగానో, చిత్రకారుడుగానో తన పూర్వ రంగంలోకి మారిపోతాడు. కానీ తన సినిమాలు ప్రదర్శింపబడ్డ గల్లా పెట్టే దగ్గర లాభనష్టాలు లెక్క చూసుకోవడానికి కూర్చునే సీమాంధ్ర దర్శకనిర్మాతల వంటి వాడు కాదు.

ఇలా దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా నర్సింగరావు గొప్పతనాన్ని చెప్పడానికి ఒక సందర్భం ఇక్కడ ప్రస్తావించక తప్పదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దర్శకుడు సత్యజిత్ రే మరణించిననప్పుడు ది హిందూలో ఫిలిం క్రిటిక్ గౌతమ్ కౌల్ "ఆఫ్టర్ రే హూ?" (సత్యజిత్ రే తర్వాత ఎవరు?) అన్న శీర్షికలో ఒక వ్యాసం రాస్తూ "సత్యజిత్ రే వారసులు ఇద్దరే కనపడతారు. ఒకరు ఆదూర్ గోపాలకృష్ణన్, మరొకరు బి.నర్సింగరావు. బి నర్సింగరావును ఆయన సత్యజిత్ రే తో సరిపోల్చుతూ సత్యజిత్ రే లాగే బి.నర్సింగరావు కవి, కథకుడు, చిత్రకారుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు కూడా కావడం యాదృచ్ఛికమే అయినా, రే వారసుడిగా బి నర్సింగరావును చెప్పుకోవచ్చు" అనంటాడు.

మన కాలపు మహా దర్శకుడుగా బి. నర్సింగరావు అందుకున్న పురస్కారాలు, అవార్డులు లెక్కలేనన్ని. వాటి గురించి ఇక్కడ చెప్పుకోవడానికి స్థల పరిమితి ఉన్నది కనుక నర్సింగరావు గొప్పతనాన్ని, ఆయన కళారంగంలో చేసిన సేవను మనం కొనియాడడానికి అక్షరాలేమీ సరిపోవు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆయనే వైతాళికుడు. అటువంటి బి.నర్సింగరావుకి ఈనెల 7న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో గౌరవించడం తెలంగాణ సమాజానికి దక్కిన గౌరవం. బి నర్సింగరావుకు సినిమా రంగంలో రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత దాదా ఫాల్కే వంటి అవార్డు ఏనాడో రావాలి. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఆ గౌరవాన్ని ఇస్తుందని ఆశిద్దాం.

B ranagaraoతెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన ప్రతిభాశాలి
చిత్ర దర్శకుడిగా విశేష గుర్తింపు పొందిన నర్సింగ్‌రావు చిత్రకారుడిగా, ఛాయాగ్రాహకుడిగా, కవిగా, క్యూరేటర్‌గా అసమాన ప్రతిభను చాటుకున్నారు. చలనచిత్రం, చిత్రలేఖనం, ఛాయాగ్రహణం, సాహిత్యం, చారిత్రక ఆధారాల సేకరణ, భద్రపరచడం వంటి విభిన్న రంగాలను సమన్వయం చేసుకుంటూ, సంస్కృతిని పరిశీలించడం, విశ్లేషించడం, అర్థం చేసుకోవడం, భావితరాల కోసం పరిరక్షించడం ఆయన సృజనాత్మక కృషిలో అంతర్భాగాలుగా నిలుస్తాయి. ఈ బహుముఖ ప్రతిభ, విభిన్న రంగాల్లో ఆయన సాధించిన విశేష కృషి నర్సింగ్‌రావుకు “సాంస్కృతిక పునరుజ్జీవన ప్రతిభాశాలి ” అనే బిరుదుకు కారణభూతమైనవియి. పుస్తకాలు , అలాగే కళాత్మక దృశ్యరూపకల్పనలతో కూడిన ప్రత్యేక ప్రాజెక్టుల ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందేలా తెలంగాణ కళా వారసత్వాన్ని నిలిపారు. ఉదాహరణకు, ఆయన సృజనలో రూపుదిద్దుకున్న ‘ఆర్ట్ @ తెలంగాణ’ (Art @ Telangana) గ్రంథం దాదాపు ఒక శతాబ్ద కాలపు చిత్రకళాత్మక వ్యక్తీకరణలను సమగ్రంగా లిఖితబద్ధం చేస్తూ, తెలంగాణ చిత్రకారుల కృషిని భారతీయ ఆధునిక కళ, ప్రాంతీయ కళల విస్తృత చరిత్రతో అనుసంధానిస్తుంది. నర్సింగ్‌రావు తన సృజనాత్మక ప్రయాణమంతటా తెలంగాణ భౌగోళిక ప్రకృతి సౌందర్యం, మాండలికాలు, పండుగలు, జానపద సంప్రదాయాలు, కళా ప్రక్రియలు, సామాన్య ప్రజల నిత్యజీవిత అనుభవాలను గంభీరమైన కళాత్మక అధ్యయనానికి కేంద్రబిందువులుగా నిలిపారు. తద్వారా తెలంగాణ వెలుపల, లోపల ఉన్న ప్రేక్షకులు, కళాభిమానులు ఈ ప్రాంతపు విశిష్టమైన సాంస్కృతిక వైభవాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, ఆస్వాదించడానికి ఆయన కృషి దోహదపడింది. నర్సింగ్‌రావు ఐదు జాతీయ చలనచిత్ర పురస్కారాలతో పాటు, నంది అవార్డులు సహా పలు రాష్ట్రస్థాయి గౌరవాలను, అంతర్జాతీయ పురస్కారాలను కూడా అందుకున్నారు. ప్రముఖ చలనచిత్రోత్సవాల్లో జ్యూరీ సభ్యుడిగా వ్యవహరించి, సినిమా, కళారంగాల అభివృద్ధికి, వాటి సంస్థాగత ప్రస్థానానికి తన వంతు విలువైన తోడ్పాటును అందించారు. తన చలనచిత్రాలు, ప్రచురణలు, కళా ప్రదర్శనలు, ప్రత్యేక కళాత్మక ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలకు విశేష ప్రాధాన్యతను కల్పించారు. ఐతే సాధారణంగా కనిపించే జీవితంలోని అంశాలను సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన కళారూపాలుగా మలచగలగడం బి. నర్సింగ్‌రావు విశిష్టత.ఒక గ్రామాన్ని సాంస్కృతిక ఆధారాల నిక్షేపంగా, ఒక పండుగను దృశ్యరూపంలో భద్రపరిచిన చారిత్రక రికార్డుగా, ఒక జానపద గేయాన్ని చలనచిత్ర అనుభూతిగా, ఒక మాండలికాన్ని కళాత్మక వ్యక్తీకరణగా, ఒక ప్రాంతీయ కథను భారతీయ చలనచిత్ర చరిత్రలో భాగంగా తీర్చిదిద్దడం ఆయన సృజనాత్మక ప్రతిభకు నిదర్శనం. విశ్వవిద్యాలయాలు, సంగ్రహాలయాలు, చారిత్రక దస్త్రాల భాండాగారాలు, పరిశోధకులకు ఆయన సృజనాత్మక రచనలు, కళాకృతులు అనేక విభాగాల్లో అధ్యయనం చేయడానికి విస్తృత అవకాశాలను అందిస్తాయి. ప్రాంతీయ చలనచిత్రాలు, దృశ్య మానవశాస్త్రం, జానపద సంప్రదాయాలు, ఛాయాగ్రహణం, చిత్రలేఖనం, సాహిత్యం, తెలంగాణ సాంస్కృతిక చరిత్ర వంటి విభిన్న అంశాలపై లోతైన పరిశోధనకు ఆయన కృషి విలువైన ఆధారంగా నిలుస్తుంది. ఆయన కళా ప్రస్థానం ద్వారా తెలంగాణ దృశ్య సంస్కృతి, కళా వారసత్వం చిరస్థాయిగా కళాత్మక రూపాన్ని సంతరించుకున్నాయి. ప్రాంతీయ జీవన వైవిధ్యాన్ని, జానపద సంప్రదాయాలను, సాంస్కృతిక అస్తిత్వాన్ని తన సృజనలో ప్రతిబింబిస్తూ, తెలంగాణ కళా వైభవాన్ని భావితరాలకు అందించే మహత్తర కృషి ఆయనది. బి. నర్సింగ్‌రావు ప్రస్థానం కేవలం ఒక విజయవంతమైన చలనచిత్ర దర్శకుడిగా, కళాకారుడిగా సాగిన ప్రయాణం మాత్రమే కాదు. తెలంగాణ సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకుంటూ దాని వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి అంకితమైన సృజనాత్మక జీవన ప్రస్థానం. మారుతున్న సమాజంలోని అనేక జీవన పార్శ్వాలకు తన కళ ద్వారా శాశ్వత రూపాన్ని అందించి, వాటిని భారతదేశ విస్తృత సాంస్కృతిక చరిత్రలో అంతర్భాగంగా నిలిపిన ఘనత నర్సింగ్‌రావు గారిది. తద్వారా తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వాన్ని, కళా వారసత్వాన్ని జాతీయ సాంస్కృతిక ప్రస్థానంతో అనుసంధానిస్తూ, తనదైన ప్రత్యేక ముద్రను వేశారు. చలనచిత్ర రంగం, సాహిత్యం, దృశ్య సంస్కృతి, తెలంగాణ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, ప్రోత్సాహం వంటి విభిన్న రంగాలకు ఆయన అందించిన అసాధారణమైన సేవలను గుర్తిస్తూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి. నర్సింగ్‌రావుకు గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ (డి.లిట్.) హానరిస్ కాసా (గౌరవార్థం ప్రదానం చేసే డాక్టరేట్) పట్టాను ప్రదానం చేయడం తెలంగాణకే గర్వకారణం.

(వ్యాసకర్త : బి. నర్సింగరావు సినీ జీవన చరిత్ర రచయిత)
హెచ్‌.రమేష్‌‌బాబు, 93916 34727



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్