తాజాగా సివిల్ సప్లయ్ అధికారి శ్రీకాంత్‌రెడ్డి అరెస్ట్
14 రోజుల రిమాండ్
మరో రైస్‌మిల్లర్ అరెస్ట్
హైకోర్టు ద్వారా ముందస్తు బెయిల్ పొందిన పలువురు రైస్‌మిల్లర్లు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఎఫ్‌సీఐకి సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం సరఫరా చేసి చీటింగ్ చేసిన కేసులో పలువురు రైస్‌మిల్లర్ల యజమానులను అరెస్టు చేసిన సీఐడీ.. తాజాగా అందుకు సహకరించారని నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డిని అరెస్టు చేసింది. శనివారం సాయంత్రం ఆయనను సస్పెన్షన్ చేస్తూ శాఖపరమైన ఉత్తర్వులు వెలువడగా.. రాత్రి వేళ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు బోధన్‌కు చెందిన విద్య రైస్ అగ్రో ట్రేడర్స్ యజమానిని సైతం అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుచగా.. వీరిరువురికి 14 రోజుల రిమాండ్ విధించింది. సీఐడీ దూకుడు పెంచిన వేళ.. పలువురు రైస్‌మిల్లర్లు ముందుస్తు బెయిల్ పొందినట్టు సమాచారం. వివరాల్లోకి వెళ్తే..
సీఎంఆర్, ఇతర ధాన్యం చెల్లింపుల విషయంలో నిజామాబాద్ జిల్లాలోని రైస్మిల్లర్లపై ఇటీవల విజిలెన్స్ తనిఖీలు చేపట్టి పలువురిపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా.. తాజాగా సీఐడీ రంగంలోకి దిగింది. ఎఫ్‌సీఐకి సన్నరకం బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా.. దొడ్డు రకం పంపి ప్రభుత్వాన్ని మోసం చేసిన కేసులో ఇదివరకే నిజామాబాద్ జిల్లాలోని ఆరు రైస్మిల్లర్లపై కేసులు నమోదు చేయగా.. నలుగురిని అరెస్టు చేసింది. మరో ఇద్దరు పరారీలో ఉండగా.. వారు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకురావడంతో వారిని విచారించారు. రిమాండ్‌కు తరలించిన మిల్లర్లను తమ కస్టడీలోకి తీసుకొని విచారించిన సీఐడీ.. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా సదరు శాఖకు నివేదిక పంపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గ్రేడ్ ఏ, గ్రేడ్ బి ధాన్యం సరఫరా చేసే విషయంలో సదరు రైస్‌మిల్లర్లకు సహకరించిన అభియోగంపై పౌరసరఫరాల శాఖ నిజామాబాద్ జిల్లా అధికారి శ్రీకాంత్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సరిగ్గా పర్యవేక్షణ చేయకపోవడంతోనే పలువురు రైస్‌మిల్లర్ల తీరుతో ప్రభుత్వానికి నష్టం చేకూరినట్టు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడిన అనంతరం సీఐడీ.. డీసీఎస్వో శ్రీకాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకుంది. ఎఫ్‌సీఐకి సన్నం బియ్యం పంపాల్సి ఉండగా(గ్రేడ్ ఏ) వాటికి బదులు దొడ్డు రకాలకు సైతం గ్రేడ్ ఏ కేటగిరి ఇచ్చి పంపడంలో సదరు రైస్‌మిల్లర్లకు సహకరించారని విచారణలో తేలినట్టు సమాచారం. దీంతో ఆయనను సైతం అరెస్టు చేసింది. శ్రీకాంత్‌రెడ్డి గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వద్ద ఓఎస్డీగా పనిచేశారు. సీఐడీ అరెస్టుల పర్వం కొనసాగిస్తున్న సమయంలో పలువురు రైస్‌మిల్లర్లు హైకోర్టు తలుపు తట్టినట్టు తెలిసింది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు సుమారు 40 మంది రైస్‌మిల్లర్లు యాంటిసిపేటరీ బెయిల్ (ముందస్తు బెయిల్) పొందినట్టు సమాచారం.






కామెంట్లు (0)