మిల్లర్లను అప్రమత్తం చేస్తూ పెట్టిన పోస్టే అరెస్టుకు కారణమా ?
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన జిల్లా అధ్యక్షులు కాట్రగడ్డ సతీష్‌కుమార్ ను అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు
నవతెలంగాణ-ములుగు
ములుగు జిల్లా రైస్ మిల్లర్ల వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు కాట్రగడ్డ సతీష్‌కుమార్‌ను సీఐడీ అధికారులు శుక్రవారం ఉదయం 7.45 గంటల సమయంలో పసరలోని ఆయన స్వగృహం నుంచి అదుపులోకి తీసుకున్నారు. అక్టోబరు 25న జరిగిన అసోసియేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆరు రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మిల్లర్లను అప్రమత్తం చేస్తూ ఆయన సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుకారణంగా అతడిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు ములుగులో ప్రచారం జరుగుతుంది. అయితే అక్టోబరు 25న ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో అప్పటి ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్‌కుమార్‌తోపాటు మరో ఐదుగురు రైస్‌మిల్లర్లను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అదేరోజు చోటుచేసుకున్న పరిణామాల అనంతరం జరిగిన ఎన్నికల్లో కాట్రగడ్డ సతీష్‌కుమార్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజాగా ఆయనను కూడా అదుపులోకి తీసుకున్నారన్న వార్తతో మిల్లర్లలో ఆందోళన నెలకొంది.
పలు మిల్లర్లలో తనిఖీలు, కేసుల నమోదు
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తిలోని శ్రీలక్ష్మీనర్సింహా, వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 2025-26 ఖరీఫ్, రబీ సీజన్లకు కేటాయించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యం నిల్వలను భౌతికంగా పరిశీలించారు. మిల్లులకు కేటాయించిన ధాన్యం, ప్రభుత్వానికి అప్పగించిన బియ్యం, మిగిలి ఉండాల్సిన నిల్వలను రికార్డులతో పోల్చి చూడగా భారీ వ్యత్యాసాలు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో రూ.4,61,29,753 విలువైన 2,079 మెట్రిక్ టన్నుల ధాన్యం, శ్రీలక్ష్మీనర్సింహా ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో రూ.4,42,54,886 విలువైన 1,531.84 మెట్రిక్ టన్నుల ధాన్యంలో వ్యత్యాసం ఉన్నట్టు సివిల్ సప్లయిస్ అధికారులు వెల్లడించారు. ఈ రెండు మిల్లుల్లో కలిపి సుమారు రూ.9 కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించి కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. మరోవైపు, 2010-11 నుంచి 2023-24 వరకు ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి పది రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు సివిల్ సప్లయిస్ అధికారులు తెలిపారు. ఈ మిల్లుల నుంచి 75,302 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి 25 శాతం జరిమానాతో కలిపి రూ.85,09,76,205 విలువైన బకాయిలు రావాల్సి ఉందని వెల్లడించారు. పలుమార్లు గడువు ఇచ్చినా మిల్లర్లు సీఎంఆర్ బియ్యం అప్పగించకపోవడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది.







కామెంట్లు (0)