Magazines

హుస్సేన్‌సాగర్‌ నీటి నాణ్యత పర్యవేక్షణ

1 గంట క్రితం

Monitoring of water quality in Hussain Sagar
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 3 నిమిషాల చదవడం

6 లొకేషన్లలో నిమజ్జనానికి ముందు, తర్వాత నీటి నమూనాల సేకరణ, విశ్లేషణ
నిమజ్జనం సమయంలో 
పెరిగిన టర్బిడీటీ, టీఎస్ఎస్, బీఓడీ, సీఓడీ విలువలు

నెక్లెస్ రోడ్ వద్ద అత్యధికంగా 200 ఎన్‌‌టీయూ టర్బిడీటీ, 164 మి.గ్రా/సీఓడీ నమోదు

నవతెలంగాణ-సిటీబ్యూరో

​హైదరాబాద్‌‌లోని హుస్సేన్‌సాగర్ నీటి నాణ్యత పర్యవేక్షణను తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీ-పీసీబీ) చేపట్టింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్దేశించిన మానిటరింగ్ షెడ్యూల్ ప్రకారం.. నిమజ్జనానికి ముందు, నిమజ్జనం సమయంలో, నిమజ్జనం తర్వాత మూడు దశల్లో హుస్సేన్ సాగర్‌లోని 6 లొకేషన్ల నుంచి నీటి నమూనాలను సేకరించి నాణ్యతా ప్రమాణాలను విశ్లేషించింది.

సెప్టెంబర్‌ 14‌న వినాయక చవితి పండుగను నిర్వహించగా, సెప్టెంబర్ 11న, సెప్టెంబర్ 17, 19, 21, 23 తేదీల్లో నిమజ్జనం సమయంలో, తర్వాత సెప్టెంబర్ 28న టీజీ-పీసీబీ నీటి నమూనాలను సేకరించి నాణ్యతా పరీక్షలను నిర్వహించింది.

​ఆరు ప్రాంతాల్లో నమూనాల సేకరణ

ఎన్టీఆర్‌ పార్క్‌ ఎదురుగా ప్లాట్‌ఫాం నంబర్‌ 1, 2, లుంబినీ పార్క్‌ సమీపంలో, నెక్లెస్‌ రోడ్డు వద్ద, నిమజ్జన ప్రాంతానికి సమీపంలోని లేపాక్షి హస్తకళల కేంద్రం వద్ద, బుద్ధ విగ్రహం సమీపంలోని కంట్రోల్‌ పాయింట్‌ వద్ద నీటి నమూనాలను సేకరించారు. ఈ ఆరు ప్రాంతాల్లో నిమజ్జనానికి ముందు, సమయంలో, తర్వాత నమోదైన నీటి నాణ్యత ప్రమాణాలను పోల్చి చూశారు.

​వెల్లడైన ఫలితాలు ఇలా..

టర్బిడీటీ (నీటి మసకదనం) : గణేష్ విగ్రహాల నిమజ్జనం సమయంలో హుస్సేన్‌సాగర్‌లోని 6 మానిటరింగ్ లొకేషన్లలో టర్బిడిటి విలువలు పెరిగినట్టు పరీక్షల్లో వెల్లడైంది.

నిమజ్జనం తర్వాత ఈ విలువలు తగ్గుముఖం పట్టినప్పటికీ, నిమజ్జనానికి ముందు నమోదైన స్థాయికి తిరిగి చేరుకోలేదు. నెక్లెస్ రోడ్డు ప్రాంతంలో నిమజ్జనం సమయంలో అత్యధికంగా 200 ఎన్‌‌టీయూ టర్బిడిటి నమోదైంది.

​మొత్తం నిల్వ ఉన్న ఘన పదార్థాలు (టీఎస్ఎస్) : నిమజ్జనం సమయంలో అన్ని మానిటరింగ్ లొకేషన్లలో టీఎస్ఎస్ (టోటల్ సస్పెండెడ్ సాలిడ్స్) విలువలు పెరిగాయి. నిమజ్జనం తర్వాత తగ్గుదల కనిపించినప్పటికీ, నిమజ్జనానికి ముందు స్థాయికి చేరుకోలేదు. ఎన్టీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న ప్లాట్‌ఫాం నెంబర్ 1 వద్ద నిమజ్జనం సమయంలో అత్యధికంగా 99 మి.గ్రా/లీ టీఎస్ఎస్ నమోదైంది.

​రసాయనిక ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ) : నిమజ్జనం సమయంలో అన్ని ప్రాంతాల్లోనూ సీఓడీ విలువలు గణనీయంగా పెరిగాయి. నెక్లెస్ రోడ్డు వద్ద అత్యధికంగా 164 మి.గ్రా/లీ సీఓడీ నమోదైంది. నిమజ్జనం తర్వాత కూడా అన్ని ప్రాంతాల్లో సీఓడీ విలువలు నిమజ్జనానికి ముందున్న స్థాయికి తిరిగి చేరుకోలేదని వెల్లడైంది.

జీవరసాయనిక ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) : అన్ని మానిటరింగ్ లొకేషన్లలో నిమజ్జనం సమయంలోనూ, నిమజ్జనం తర్వాత బీఓడీ విలువలు పెరిగినట్టు నీటి నాణ్యతా పరీక్షలు తేల్చాయి.

​మొత్తం కోలిఫామ్ బ్యాక్టీరియా : నిమజ్జనం సమయంలో అన్ని ప్రాంతాల్లోనూ మొత్తం కోలిఫామ్ బ్యాక్టీరియా స్థాయిల్లో గణనీయంగా పెరిగాయి. నిమజ్జనం తర్వాత నెక్లెస్ రోడ్డు, లేపాక్షి హస్తకళల కేంద్రం, బుద్ధ విగ్రహం సమీపంలోని 3 లొకేషన్లలో తగ్గుదల నమోదైంది. లుంబినీ పార్క్ వద్ద నిమజ్జనం సమయంలో పెరిగిన కోలిఫామ్ స్థాయి తర్వాత ముందు స్థాయికి చేరుకున్నాయి. అయితే ప్లాట్‌ఫాం నెంబర్ 1, 2 ప్రాంతాల్లో నిమజ్జనం సమయంలో పెరిగిన స్థాయులు నిమజ్జనం తర్వాత కూడా నిమజ్జనానికి ముందు స్థాయితో పోలిస్తే ఎలాంటి మార్పూ లేదు.​

ఫీకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా : ప్లాట్‌ఫాం నెంబర్ 1, 2, నెక్లెస్ రోడ్డు, బుద్ధ విగ్రహం సమీపంలోని 4 లొకేషన్లలో నిమజ్జనం సమయంలో ఫీకల్ కోలిఫామ్ బాక్టీరియా స్థాయులు గణనీయంగా పెరిగాయి. నిమజ్జనం అనంతరం తగ్గుదల నమోదైనప్పటికీ, నిమజ్జనానికి ముందు స్థాయికి చేరుకోలేదు.

లుంబినీ పార్క్ వద్ద నిమజ్జనం సమయంలో పెరిగిన ఫీకల్ కోలిఫామ్ బాక్టీరియా స్థాయులు, నిమజ్జనానికి ముందు నమోదైన స్థాయితో పోలిస్తే నిమజ్జనం తర్వాత మరింత పెరిగినట్టు నీటి నాణ్యత పరీక్షలు వెల్లడించాయి. లేపాక్షి హస్తకళల కేంద్రం వద్ద మొత్తం కోలిఫామ్ బ్యాక్టీరియా స్థాయి నిమజ్జనం సమయంలో పెరిగిందని, నిమజ్జనం తర్వాత కూడా నిమజ్జనానికి ముందు నమోదైన స్థాయితో పోలిస్తే నిమజ్జన సమయంలో నమోదైన స్థాయిలోనే కొనసాగిందని నాణ్యతా పరీక్షల్లో వెల్లడైంది.

​డిసాల్వ్డ్ ఆక్సిజన్ (డీఓ) : గణేష్ విగ్రహాల నిమజ్జనం కారణంగా హుస్సేన్ సాగర్ లో డిసాల్వ్డ్ ఆక్సిజన్ (నీటిలో కరిగిన ఆక్సిజన్) స్థాయుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకోలేదని పరీక్షల్లో వెల్లడైంది.

​వర్షపు నీటి ప్రవాహ ప్రభావం : సెప్టెంబర్ 14, 19, 20, 22 తేదీల్లో కురిసిన వర్షాల కారణంగా క్యాచ్‌మెంట్ ప్రాంతాల నుంచి వర్షపు నీరు హుస్సేన్‌సాగర్‌లోకి చేరింది. ఈ నేపథ్యంలో సీఓడీ, బీఓడీ, హార్డ్ నెస్ (నీటి కాఠిన్యం) వంటి కొన్ని నీటి నాణ్యత ప్రమాణాల్లో క్షీణత గమనించినట్టు నీటి నాణ్యత పరీక్షలు తేల్చాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్